చంద్రబాబుపై ఎక్స్‌ప్రెస్ చురకలు
నోట్లరద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లిమొగ్గలను ఇండియన్‌ఎక్స్‌ప్రెస్ సంపాదకీయంలో విమర్శించింది.మోడీ చర్యను మొదట ఘనంగా స్వాగతించడమే గాక అది తన ఘనతేనని చెప్పుకున్న చంద్రబాబు తర్వాత అనేక విధాలుగా మాట మారుస్తూ మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి అద్యక్ష పదవికూడా స్వీకరించిన చంద్రబాబు ఈ సమస్యపై ఎడతెగని చర్చలతో నగదు రహిత డిజిటల్ వ్యవస్థ కోసం హడావుడి పడ్డారు. అయితే ఇందుకోసం ఎపికి 20 లక్షల పివోఎస్‌లు ఇప్పటికిప్పుడు వచ్చేఅవకాశమే లేదు.నగదు సరఫరాలో రిజర్వు బ్యాంకు సహకరించడం లేదు. నిజానికి జనాభా తక్కువగా వున్న తెలంగాణకే మలిదశలో ఎక్కువ నగదు పంపినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ఇచ్చింది. మొత్తానికి పరిస్థితి మెరుగుపడేలా లేదని గ్రహించిన చంద్రబాబు పార్టీ సమావేశంలో ఇది మనం కోరుకున్నది కాదని నోరుజారారట. ఆగష్టు సంక్షోభం కన్నా ఇది పెద్ద సంక్షోభం అని తన తిరుగుబాటును తనే ప్రస్తావించుకున్నారు. అంతకు ముందు ఇది ఒక జాతీయ విపత్తు అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బిజెపి కేంద్రం నుంచి ఫోన్‌కొట్టి మరీ మాట్లాడి దారికి తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది. తను నోట్లరద్దును తప్పుపట్టలేదని మరో సవరణ చేసుకున్నారు. మరో కోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా పరిపరివిధాల మాట్లాడినా మద్దతు ప్రశంసలే అధికం. ఏమైనా ఈ చంద్ర కళలు పరిశీలకులకు హాస్యాస్పదంగా వున్నాయి.