ఎగతాళి తప్ప సూటిగా జవాబేదీ మోడీజీ ?
వారణాసిలో ప్రధాని మోడీ ప్రసంగం లైవ్ చూస్తే చాలా జాలీగా మాట్లాడిటనట్టు కనిపిస్తుంది.. దేశంలో ప్రజలు నోట్లరద్దు వల్ల ఉత్పన్నమైన సమస్యలతో బాధపడుతున్న తీరు ఆయన మాటల్లో అసలు వ్యక్తం కాకపోవడం ఆశ్చర్యమే. ఇప్పటికి 3175 కోట్ల నల్లధనం బయిటపడిందని, అందులో 86 కోట్లు కొత్త నోట్లనీ లెక్కలు చెబుతున్నాయి. లక్షల కోట్ల నల్లడబ్బులో ఇది ఏ మూలకూ చాలేది కాదు. 677 దాడుల్లో ఈ డబ్బు పట్టుపడిందంటే సగటు మరింత తక్కువగా వుంటుంది. అయినా తానేదో విప్లవం తెచ్చేసినట్టు ప్రధాని మాట్లాడుతుంటే అక్కడి సభికులు కూడా పదే పదే చప్పట్టు కొడుతూనే వున్నారు.ఈ వూపులోనే రాహుల్ గాంధీపైనా విసుర్లు ఎకసెక్కాలు సాగించారు. ఒక యువ నాయకుడు అంటూ ఆయనకు మాట్లాడ్డమే రాదనీ, భూకంపం రాలేదనీగేళి చేశారు. దీనికేమీ అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. అయితే రాహుల్‌గాంధీ లేవనెత్తిన అంశాలపై జవాబు మాత్రం దాటేశాడు. రాహుల్ కూడా నన్ను అపహాస్యం చేస్తే చేశావు గాని ఆరోపణలకు జవాబుచెప్పమని బాగానే అడిగారు. 2009నాటికి తన ప్యాకెట్లో ఏముందని అడిగినా జవాబు చెప్పలేనిస్తితిలో ఆ యువనేత వుండేవారని మోడీ అంటే మీకు ముట్టిన పది ప్యాకెట్లలో ఏముందో చెప్పండని రాహుల్ ఎదురు వడ్డించారు. నేను నవంబరు 23నే మోడీపై ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చిన ఈ ఆరోపణల గుచించిరాశాను. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా శాసనసభలో అధికారికంగా ఇవే అభియోగాలు వినిపించారు. రాహుల్ కూడా వాటినే లేవనెత్తవచ్చని అనుకున్నది నిజమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీకి సహారా నుంచి బిర్లాల నుంచి ముడుపులు ముట్టాయంటూ ఐటి శాఖలో రూపొందిన పత్రాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జెఎస్ ఖేర్, అరుమ్ మిశ్రాలు పరిగణనలోకి తీసుకోలేదనేది బిజెపి సమర్థన. ప్రశాంత భూషణ్ దాఖలు చేసిన ప్రజా వాజ్యం విచారణలో ఇంతకన్నా సాధికారికమైన విశ్వసనీయమైన ఆధారాలు కావాలని కోర్టు కోరిందట. ఇవి కల్పితాలనీ వీటి ఆధారంగానే దర్యాప్తునకు ఆదేశించలేమని చెప్పింది. అయితే తప్పు పత్రాలు సృష్టించినందుకు న్యాయవాదిపై ఎలాటి చర్య గాని వ్యాఖ్యలు గాని చేసింది లేదు. బిజెపి కూడా మౌనం పాటించింది. మొన్న భూకంపం వ్యాఖ్యల తర్వాతనే స్పందించింది. కేజ్రీవాల్ కూడా తన వాదనలు ఇప్పటికైనా రాహుల్ స్వీకరించినందుకు సంతోషం వెలిబుచ్చారు.
అయితే రాహుల్ కేవలం పాత సాక్ష్యాలకే పరిమితా కాబోరని కొత్త ఆధారాలు తర్వాత బయిటపెట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా వచ్చిన ఆరోపణలపై సూటిగా సంజాయిషీ ఇచ్చేబడులు కోర్టును అడ్డుపెట్టుకోవడం ఏం గొప్ప? ఇంతకన్నాతక్కువ ఆరోపణకే అద్వానీ రాజీనామా చేసి తర్వాత బయిటపడ్డారు. కాని మోడీజీ సర్వాతీతుడు . దేనికీ స్పందించరు.ఏమైనా ఈ నోట్లరద్దు పుణ్యాన రాహుల్ గాంధీ కాస్త పదునెక్కి ప్రధాని ప్రస్తావించాల్సిన స్థితి తీసుకురావడం విశేషం.అయితే ఆయన పార్టీ పరిస్థితి మాత్రం పెద్ద మెరుగుపడిందేమీ లేదు. ఆ సూచనలూ లేవు. మొన్న చండీఘర్ ఎన్నికల్లోనూ దెబ్బతిన్నది.