ఈడీ ఉత్తర్వుపై హైకోర్టు స్టే!
జగన్ కేసులో ఆస్తుల స్తంభనకు సంబంధించి ఇడి ప్రత్యేక కోర్టు ఇచ్చిన స్వాధీనం ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఈ రోజు ఉదయం సాక్షి ఛానల్‌లో స్క్రోలింగు చూశాను.అది కూడా చాలా పొడిగా వుండింది. నిన్న నేను ఆ విషయమై వ్యాఖ్యానించాను గనక ఇది కూడా ఇవ్వాలని సాక్షి పత్రిక వెబ్‌సైట్ చూస్తే ఈ వార్త కనిపించలేదు. నిన్న ఆ ఉత్తర్వులను ప్రముఖంగా ఇచ్చిన హిందూతో సహా వివిధ పత్రికలు చూశాను. వాటిలోనూ వివరాలు లేవు. ప్రస్తుతం మన తెలుగు మీడియా వున్న స్థితికి ఇదో నిదర్శనం అనుకోవచ్చు. మరి సాక్షిలోనూ ఎందుకు ఇవ్వలేదంటే మొన్నటి వార్త వారు ఇచ్చి వుండరు గనక ఇప్పుడు స్టేను ఇవ్వడానికి ఇబ్బంది అయివుండొచ్చు. పైగా నేను చూసిన స్క్రోలింగు ప్రకారం భారతిసిమెంటు విషయంలో స్టే అని వుంది. మరి ఇతర కంపెనీల సంగతి తెలియలేదు. ఏమైతేనేం ఇప్పటికి ఇదీ పరిస్థితి.
దీనిపై నా పోస్టు కొందరు జగన్ అభిమానులకు కోపం తెప్పించింది. అయితే జరిగేది జరిగినట్టు చెప్పుకోవడం, దాని పూర్వాపరాలు ప్రభావాలు విశ్లేషించడానికే ఈ పేజి. జగన్‌పై కేసులు నిజం, వాటిపై తీర్పు రావలసి వుండటం నిజం. ఇవి కక్ష సాధింపు అని వైసీపీ అనొచ్చు. నిజం అని టిడిపి వాదించవచ్చు. కేసులు వున్నా ఆయన ప్రతిపక్ష నాయకుడైనప్పుడు ఆయన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లున్నప్పుడు సముచిత పాత్ర వుంటుందనేది నా వాదన. ప్రతిపక్షంగా వారు లేవనెత్తే సమస్యలు పరిశీలించడానికి బదులు అహౌరాత్రాలు ఆ కేసుల గురించే వాదోపవాదాల వల్ల ఉపయోగం వుండకపోగా సమస్యలు వెనక్కుపోతుంటాయి. పోనీ ఇంత చెప్పే టిడిపి అదనంగా ఏమైనా సాక్ష్యాలు సంపాదించి కేసులు వేగవంతం చేసిందా అంటే అదీ లేదు. కేంద్రంలోని బిజెపిది మరీ దొంగాట. ఏం చేస్తాం!