పకడ్బందీ ప్రణాళిక- అందుకే రోజుకో మెలిక!
నోట్లరద్దు ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని బిజెపి నేతలు కేంద్ర మంత్రులూ మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆయన నిరంతక కీర్తకులైన వెంకయ్య నాయుడు వంటివారు చెబుతూనే వున్నారు. అంత ఆలోచించి వుంటే కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల వందమందికిపైగా క్యూలల్లో చనిపోయే దుస్థితి వచ్చి వుండేదే కాదు. అదలా వుంచితే రోజుకో ఉత్తర్వు ఇవ్వాల్సిన సిగ్గుచేటైన పరిస్థితి అసలు వుండేది కాదు. దేశంలో ఎన్నడూ ఎరగని చూడని పరిస్థితి ఇది.
నవంబరు 8- మోడీ నోట్ల రద్దు ప్రకటన. బ్యాంకుద్వారా అయితే 4000 మార్చుకోవచ్చని, ఎటిఎంలలో 2000 తీసుకోవచ్చని నిర్ణయం.
నవంబరు 9- వారానికి 20,000 ఒకే దఫా అయితే పదివేలు తీసుకోవచ్చని వివరణ
నవంబరు 10- పెట్రోలు బంకులు ఆస్పత్రులు విమానాలు ఆర్టీసీలలోపాత నోట్ల అనుమతి డిసెంబర్31 వరకూ
నవంబరు 13- విత్‌డ్రా పరిమితి 4000 నుంచి 4500
ఎటింఎలలో 2500
నవంబరు 15- దుర్వినియోగం కాకుండా బ్యాంకులలో నల్లఇంకు పూయడం
నవంబరు 17- విత్‌డ్రా 2వేలే. రైతులకు 25వేలు, వ్యవసాయ వ్యాపారులకు 50, వేలు, పెళ్లిళ్లకు షరతులతో 2,50 వేలు విత్‌డ్రా
నవంబరు21- పాత నోట్లతో విత్తనాలు కొనొచ్చు
నవంబరు 24- డిసెంబర్ 15 తర్వాత పాత 500 నోట్ల మార్పిడి అవకాశం వుండదు. వెయ్యి నోట్లే మార్చుకోవచ్చు
నవంబరు 28- కొత్తగా వేసిన నోట్లపై విత్‌డ్రా పరిమితి ఎత్తివేత, మామూలు విత్‌డ్రా మొత్తం 24 వేలు ౖ యథాతథం.
నవంబరు 30- జన్‌ధన్‌ల నుంచి 10 వేలే విత్‌డ్రా
డిసెంబర్ 1 – 15 వ తేదీ వరకూ పెట్రోలు బంకులు విమానాశ్రయాలలో పాత నోట్లు
డిసెంబర్ 8- 10 వ తేదీవరకే పై చోట్ల పాత నోట్లు
డిసెంబర్ 15- నోట్లరద్దు తర్వాత డిపాజిట్ చేసిన 2 లక్షలు లేదా మొత్తం మిగులు 5 లక్షలు వున్న ఖాతాలనుంచి విత్‌డ్రా చేసుకోవాలంటే పాన్ నెంబర్ తప్పనిసరి
డిసెంబర్ 19- రు.5వేలు పైబడిన డిపాజిట్లు చేయాలంటే కెవైసి తప్పనిసరి. అది కూడా యాభై వేల వరకే.
ఇతర సమస్యలు కొరతలు అలా వుంచి ప్రభుత్వమే గనక సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని వుంటే ఇన్ని రకాలుగా మార్పులు చేయవలసి వచ్చేదా? తప్పులు దిద్దుకోవడానికి బదులు కొత్త తప్పులు చేస్తూ నిష్కారణ నిబంధనలతో సామాన్యులను ఎందుకు వేధిస్తున్నట్టు? ఈ కాలంలో వందల కోట్లు వున్నవారికి సంబంధించి అదనంగా ఏమైనా ఒక్క నిబంధనైనా ప్రభుత్వంప్రకటించిందా?
కొత్త నోట్లు ముద్ర వేయలేనప్పుడు పాతవి ఎందుకు రద్దు చేశారు?
నగదు రహితం పేరిట లాటరీలు నడిపి భారీ బహుమానాలు ప్రకటించడం ఎవరి మేలుకు? నగదు లేకపోతే విలువలు వుండవా? బ్యాంకులపై చెల్లింపుల బాధ్యత(లైబలిటీ) వుండదా?