శాతకర్ణి టీజర్ నేత్రపర్వం
బాలయ్య నూరో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్ భారీ తనానికి ప్రతిరూపంగా వుంది. సహజంగానే క్రిష్ ఇలాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వుంటాడు. చారిత్రిక చిత్రమే గాక నడుస్తున్న చరిత్రలో అమరావతి చుట్టూ సాగుతున్న రాజధాని రాజకీయ ప్రచారం కోణంలోనూ శాతకర్ణికి ప్రత్యేక ప్రాధాన్యత వుంటుంది. వాస్తవానికి తెలంగాణలో రుద్రమదేవి కూడా ఆ కోణం లేకపోలేదు. ఇవన్నీ వాణిజ్యంతో పాటు రాజకీయాలు కూడా సినిమాలపై ప్రభావం చూపిస్తాయి. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ఎన్టీఆర్ కుమారుడు ఎంఎల్ఎ గనక ఇక్కడ శాతకర్ణి ఉభయ తారకం. కెసిఆర్ ఈ చిత్రం ప్రారంభంరోజు ఘనంగా స్వాగతించడం సుహృద్భావం చూపించడం కూడా అదనపు అనుకూలత కల్పించింది. కరీంనగర్లోని కోటిలింగాలలో టీజర్విడుదల చేయడం దానికి కొనసాగింపే. ఈ సందర్భంలోనూ బాలయ్యకు బాగానేస్పందన వచ్చింది.
ఇక టీజర్లోకి వస్తే బాలయ్య పౌరుషం ప్రతాపంతో పాటు నాటకీయ సన్నివేశాలు నవరసాలు కనిపించేట్టు రూపొందించారు. హేమమాలిని శ్రియ కూడా బాగున్నారు. యవనులు(గ్రీకులు) ఏదో పెద్ద పథకం వేసినట్టు దాన్ని ఓడించేందుకు పరాయి పాలకులపై పోరాడాలన్నట్టు శాతకర్ణితో చెప్పించిన డైలాగులు చప్పట్లకే పనికి వస్తాయి. ఆ సమయానికి శాతవాహనులను గాని మరెవరినీ గాని సవాలు చేసే స్థితిలో గ్రీకులు శకులు ఎవరూ లేరు.దేశం మీసం తిప్పేలా చేస్తాననే డైలాగులో సహజంగానే తెలుగు దేశం కనిపిస్తుంది. శ్రీరామరాజ్యంలో బాపు విఫలమైన రీతిలో గాక క్రిష్ బాలయ్య నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టివుంటారనుకోవచ్చు. పైగా పెద్దమీసాలు కిరీటాలు ఆభరణాలు సెట్టింగులతో ఒక భారీ భావన ఎలాగూ వచ్చేస్తుంది. సో గౌతమీ పుత్రుడికి ఘన విజయం వస్తుందనే అనుకోవచ్చు.