క్లైమాక్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్?
పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతున్న తరుణంలో- మొత్తం నెలరోజులు స్తంభనకు నాయకత్వం వహించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ నిర్వాకం తీవ్ర నిరసనకు దారితీసింది. ప్రతిపక్షాలన్ని వెళ్లి రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వాలని వెంటబడి ఒప్పించిన కాంగ్రెస్ ఉపాద్యక్షుడు తాను మాత్రం వెళ్లి ఫ్రధాని మోడీని కలవడం కలకలం సృష్టించింది. రైతుల రుణాల మాఫీ అనే నెపంతో ఆయన కలిసినా రాజకీయాల్లో ఇలాటివాటివల్ల వెళ్లే సంకేతాలు భిన్నంగా వుంటాయి. కాంగ్రెస్ బిజెపిలు కుంభకోణాలపై ఆరోపణలపై ఎంత రభస చేసుకున్నా చివరకు గప్చిప్ కావడం, నిజమైన చర్చ జరగకుండా ప్రతిష్టంభన సృష్టించడం అలవాటైన ఎత్తుగడే. ఈ సమావేశాల చివరి దశలో ఆగష్టా కుంభకోణం వాళ్లు, కిరెన్రిజ్జు వ్యవహారం వీళ్లు తీసుకొచ్చారు. ఇది గాక రాహుల్ ఏకంగా మోడీపైనే బాణం వేశారు. అయినా సరే ఎవరూ రోషాలకు పోకుండా చల్లగా ముగించేశారు. ఇద్దరి వెనక వున్న కార్పొరేట్ హస్తాలు తప్ప ఇందుకు మరో కారణం వుండదు. పైగా సభ అధికారికంగా ముగియకముందే రాహుల్ వెళ్లి కలిశారంటే రాజకీయ రాయబారమే అనుకోవాల్సి వస్తుంది.
ఉభయ కమ్యూనిస్టుపార్టీలూ ఎస్పి బిఎస్పి,డిఎంకె,ఎన్‌సిపి వంటి ముఖ్య పార్టీల నాయకులు ఈ నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిన బృందంలో పాలుపంచుకోలేదు. అసలు ఈ ప్రతినిధివర్గ సందర్శనే దండగమారి అని తాము మొదటినుంచి చెబుతున్నామని సీతారాం ఏచూరి అన్నారు. ఇతర నేతలు కూడా తమ అసంతృప్తివ్యక్తం చేశారు.