సభ చట్టుబండలు- అద్వానీ నీతులు
ఊహించినట్టే లోక్‌సభ సమావేశాలు నిరర్థకంగానే ముగిసిపోతున్నాయి. దేశాన్నే కుదిపేసిన నోట్లరద్దుపై ప్రకటనకు గాని ప్రత్యక్ష చర్చ ఓటింగుకు గాని ప్రధాని సిద్దపడకపోవడం ఇందుకు ఏకైక కారణం. దేశమంతటా సభల్లోనూ రేడియోలు టీవీల్లోనూ ఇంకా విదేశాల్లోనూ కూడా ఈ విషయమై మాట్టాడే ప్రధాని అత్యున్నతమైన పార్లమెంటుకు తను జవాబుదారి అనే సూత్రాన్ని ఉల్లంఘించడం దారుణమే. రాహుల్ గాంధీ ఎందుకైనా సరే వ్యక్తిగత ఆరోపణ చేసిన తర్వాత కూడా ఆయన రోషానికి కూడా రాలేదు. ఆయన తరపున మరెవరూ సవాలుకు సిద్ధం కాలేదు. అంటే లొసుగులు స్పష్టం. నోట్లరద్దు లక్ష్యాలపై మాట మార్చినమోడీ ధోరణిని నిపుణులు గమనించారు.ఐడిఎప్‌సి సంస్థ ప్రతినిధి Êప్రవీన్ చక్రవర్తి ఆసక్తికరమైన ఒక విషయం పేర్కొన్నారు. నవంబరు8న నోట్ల రద్దు ప్రసంగంలో మోడీ నల్లడబ్బు అనే మాట 18 సార్లు వాడారే తప్ప నగదు రహితం ఒక్కసారైనా ఉచ్చరించలేదు. అదే నవంబరు 27 ప్రసంగంలో నగదు రహితం డిజిటల్ అనే మాటలు 24 సార్లు వాడుతూ నల్లడబ్బు ప్రస్తావనను తొమ్మిది సార్లకు తగ్గించేశారు. ఇప్పుడైతే ఈ రెండోదే సర్వస్వమైనట్టు మాట్లాడుతున్నారు. పోనీ అదైనాసభకు అధికారికంగా చెప్పడానికి వెనుకంజ దేనికి?సభలోచెప్పిన ప్రతి మాటకూ కట్టుబడివుండాల్సి వుంటుందని పొల్లు దొర్లితే పెనుగండమనీ ఆయనకు తెలుసు.
ఇక బిజెపి సీనియర్ నేత విఫలమనోరథుడు ఎల్‌కె అద్వానీ ఒకటికి రెండు సార్లు సభలో రభసపై ఆందోళన వ్యక్తం చేయడం, రాజీనామాచేయాలనిపిస్తుందని చెప్పడం హాస్సాస్పదంగా వుంది.రాహుల్ గాంధీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పివుండొచ్చు. వెంకయ్యచ నాయుడు సమర్థించవచ్చు గాని రాజీనామాచేయకుండా ఆయనను ఎవరూ ఆపడం లేదు. మోడీకి ఒక మాట చెప్పగలవారుంటే ఈ పరిస్తితే వచ్చేది కాదు.అయితే తాను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అద్వానీ హాయంలోనూ ఇంత కన్నా ఎక్కువ రోజులు సభా సమయం రభసలతో జరిపేశారు. యుపిఎ 2 హయాంలో పి.చిదంబరం సభకు రాకపోతే జరగనివ్వబోమంటూ రోజుల తరవడి అల్లరి సాగింది. అంతకు ముందు కూడా యుపికి అయోధ్యకు సంబంధించిన అంశాలపై అదే ఎత్తుగడ అనుసరించారు.కాబట్టి అద్వానీకి ఈ విషయంలో పెద్ద నీతులు చెప్పే అవకాశం వుండదు.