నిబద్దుడు, నిరంతర కృషీవలుడు విహెచ్
నిన్నటి వరకూ జీవించివున్న తెలుగు జర్నలిస్టులలో బహుశా అత్యంత వయోవృద్ధుడూ అనుభవజ్ఞుడూ నిపుణుడూ నిబద్దుడూ వి.హనుమంతరావు. ఆరుపదుల పైబడిన ఆయన రాజకీయ పాత్రికేయ సామాజిక జీవితం అక్షరాలా ఆదర్శప్రాయమైంది. మూడునాలుగు తరాల పత్రికా ప్రపంచాన్ని మీడియా మలుపులనూ మార్పులనూ కళ్లారా చూసిన వ్యక్తి. అన్ని దశల్లోనూ కలంతో పాటు కాలు కూడా కదలుస్తూ కళ్లారా చూస్తూ సజీవాసక్తి నిలబెట్టుకున్న వ్యక్తి. నిరాడంబరుడే గాక నిష్కపటి కూడా. చాలా చాలా పాతతరం వారైనా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ నూతనత్వాన్ని ఆహ్వానిస్తూ నవతరంతో కలసి నడిచిన వారు. ఇవన్నీ చేయగల దృష్టినీ శక్తిని తనకిచ్చిన కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆశయాల పట్ల అంకితభావాన్నీ అనుబంధాన్ని ఆఖరు వరకూ ప్రయత్న పూర్వకంగా అట్టిపెట్టుకున్న వ్యక్తి. ఒక్క ముక్కలో ఆయనో అనుభవాల సంపుటి. మూడు నాలుగు తరాలకు మిత్రుడు. హితుడూ సన్నిహితుడూ.
తన సాంకేతిక విద్య వల్ల మొదటనే పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర సహాయకుడుగా స్థానం పొందడం విహెచ్ లభించిన గొప్ప అవకాశం.పశ్చిమ గోదావరి జిల్లా మండపేటలో 1926లో పుట్టిన విహెచ్ గ్రామంలోని కమ్యూనిస్టు కార్యకర్తలతో కలసి పనిచేస్తూ రాజకీయ తరగతులకు హాజరవుతుండేవారు. పార్టీపై చాలా గౌరవం ఏర్పడింది. ఎస్సెల్సీ చదివి 1940లలో పోస్టల్ సర్వీసులోనూ నౌకాదళంలో సివిల్ విభాగంలోనూ పనిచేశారు. అలాటి సమయంలోనే ప్రజాశక్తి వారపత్రిక దినపత్రికగా మారబోతుంది గనక అక్కద తన అవసరం వుందని స్థానిక నాయకులు చెప్పారు. సుందరయ్యకు రాతలో సహాయపడేందుకై షార్ట్‌హ్యాండ్ వచ్చిన యువకులు ప్రత్యేకంగా అవసరం గనక నీవు వెళ్లమని వారు ప్రోత్సహించారు. తెలంగాణ పోరాటానికి సంబంధించిన చాలా పత్రాలు మాత్రమే గాక విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే చారిత్రాత్మక రచన కూడా అలాగే షార్ట్‌హ్యాండ్‌లో రాసిచ్చారాయన.చెప్పింది వేగంగా రాసుకుని తర్వాత రోజు చూపించేవారు. మరో అధ్యాయం తీసుకునేవారు. అలా పదిరోజులలోనే పుస్తకం పూర్తయింది. ప్రజాశక్తికి న్యూస్‌ప్రింట్ దొరికేది కాదు. రహస్యంగా మద్రాసులో దాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా ఇరవయ్యవ ఏటనే ఆయన నిర్వహించారు.తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అజ్ఞాతవాసంలోని నాయకులకు తలలోనాలుకలాగా అతి జాగ్రత్తగా మసులుతూ సమచారం చేరవేయడమే పెద్ద సవాలు. అదిగాక విహెచ్ ఈ రచనాసహకారంకూడాచేశారు.. పోరాట విరమణ తర్వాత 1952లో సుందరయ్య పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడుగా వెళ్లినప్పుడు కూడా ఆయన అనుసరించారు. తొలి పార్లమెంటులో హేమాహేమీలను చూస్తూ వారి ప్రసంగాలనూ చర్చలనూ విశాలాంధ్ర తరపున పార్లమెంటులో తొలి తెలుగు విలేకరిగా , అన్ని కమ్యూనిస్టు పత్రికలకూ వార్తలు పంపించేవారు. ఇదంతా . ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన సుందరయ్య తోడల్లుడు(లీలమ్మ బావ) ఎఎస్‌చారి వార్తాసేకరణలో సలహాలు సూచనలు చేసేశారట. ఆయన చెప్పిన మీదట తనే చొరవగా అన్నిచోట్లకూ వెళ్లి సంబంధాలు పరిచయాలు పెంచుకోవడం ప్రారంభించారు. కోటంరాజు రామారావు వంటివారిని కలశారు. అమరవీరుని భార్య సరళను వితంతు వివాహం చేసుకుని ఆచరణలో ఆదర్శం చూపారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య హౌరాహౌరీగా జరిగిన 1955 ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ, నాగార్జున సాగర్ నిర్మాణం వంటివాటన్నిటికీ ఆయన సాక్షి, నివేదికుడు కూడా.
1967 తర్వాత కాలంలో యుఎన్‌పై వార్తాసంస్థకు హైదరాబాదులో విలేకరిగాచేశారు. అంతకు ముందే స్థిరపడిన పిటిఐ తో పోటీ. ఆ కాలంలో వార్తాసంస్థలపైనే పత్రికలు ఆధారపడి వుండేవి. రాజకీయాల చుట్టూనే పరిభ్రమించకుండా హైదరాబాదులోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపైన పరిశోధనాలయాలపైన కేంద్రీకరించి కొత్త వనరులు సృష్టించుకున్నారు. యుఎన్‌ఐ తరుపునే ఆయన విశాఖపట్టణంలోనూ పనిచేశారు. ఆ కాలంలోనే ఆయన చేసిన రెండు పనులు జాతీయ సంచలనం సృష్టించాయి. మొదటిది-రైతులకు బ్యాంకులిచ్చే రుణాల మంజూరులో అంతులేని సంతకాల పరంపరను సోదాహరణంగా నివేదించారు. వాస్తవానికి రుణాల జాతర వార్త కోసం వెళ్లిన విహెచ్ అక్కడ అసలైన సమస్య గమనించి ఇచ్చిన ఈ కథనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార బృందాన్ని ఆకర్షించి తర్వాత ఆ ఇబ్బందిని కొంతవరకూ తొలగించే ఉత్తర్వులు వచ్చాయి. ఇక రెండవది 1971లో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో యుఎన్‌ఐ తరపున అక్కడకు వెళ్లి భారత నావికాదళం విజయాలను పంపించడం. ఆక్కడొక తెలుగునావికుడు పరిచయం కావడంతో ఇతరుల కన్నా మిన్నగా ఆసక్తికరమైన కథనాలు పంపంచి దేశాన్ని ఆకర్షించారు. తన అనుభవాలన్నీ ఆయన అంతర్వీక్షణం అనే చిన్న పుస్తకంలో పొందుపర్చారు. ఈ కాలమంతటా వామపక్ష రాజకీయాలతోనే వున్నారు.. 1974లో ఈనాడు విశాఖలో ప్రారంభమైనప్పుడు అందులోచేరిన విహెచ్ ఎబికె ప్రసాద్‌ను ఎడిటర్‌గా తీసుకోవడానికి కారకులైనారు. 1977లో హైదరాబాద్ ఎడిషన్ సమ్మె సంఘర్సణ తర్వాత నిష్క్రమించారు.
మరెవరైనా అయితే అప్పటికి అలవాటైన పద్ధతిలోనే జీవించి వుండేవారేమో గాని విహెచ్ కొత్తపుంతలు తొక్కారు. మొదటి నుంచి తనకు ఆసక్తివున్న ఆర్థిక వివరాలు గణాంకాలు విధాన నివేదికలు వగైరాలను సేకరించి ప్రచురించి డేటా న్యూస్ ఫీచర్స్ అనే సంస్థ స్థాపించి పత్రికగా వెలువరించారు. కొన్నేళ్లపాటు అన్ని పత్రికలూ వాటిని ఉపయోగించుకున్నాయి. ఈ వివరాలతోనే ఆంధ్రప్రదేశ్ ఇయర్‌బుక్ తీసుకొచ్చారు. అప్పటికి ఇది కొత్తవరవడి. ఈ విధంగా జీవితం మలిదశలో విహెచ్ ఆర్థిక విషయాల నిపుణుడుగా నివేదకుడుగా గొప్ప ముద్ర వేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నా అంకెలు ఆయన అందించవలసిందే.ఈ అంకెలతో ముడిపడిన ఆయన ఆలోచనలు అనేక ప్రచురణలుగా మారాయి. చిరంజీవి ఠాగూరు చిత్రంలో గుక్కె తిప్పుకోకుండా చెప్పే అంకెలన్నీ ఆయన ప్రత్యామ్నాయ ఆర్థిక సర్వేలోవే! 2003లో వీక్షణం మాసపత్రిక నెలకొల్పారు. 2006లో అర్థశతాబ్ది ఆంధ్రప్రదేశ్‌పై ఇంగ్లీషులో చాలాప్రామాణిక ప్రచురణ వెలువరించారు. జర్నలిజం కాలేజీ గ్రామీణ విషయాల అధ్యయనం,శిక్షణ ప్రారంభించారు.పాఠాలు పోస్టులో కూడా పంపంచే పద్ధతి చేపట్టారు. ఆ రంగాలలో వారికి అవార్డులు స్థాపించారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా అవార్డు ఏర్పర్చారు. ఆంధ్రభూమి ప్రజాశక్తి పత్రికలలో వారం వారం కాలమ్స్ రాశారు. ప్రజాశక్తి విలేకరుల శిక్షణా తరగతుల కోసం అనేక చోట్లకు వచ్చారు. బొమ్మారెడ్డితో ఆయనకు చాలా అనుబంధం.
విహెచ్ రచించిన పుస్తకాలు ప్రజాశక్తి, ఇటీవల నవతెలంగాణ సంస్థలు పచురించాయి. రెండు పత్రికలు క్రమబద్దంగా చదువుతూ మంచి చెడ్డలపై స్పందిస్తూ తను తప్పక రాయాలని తపించేవారు. ప్రథమ సంపాదకులు మోటూరు హనుమంతరావు అవార్డు కమిటీలో వుండి సేవలందిస్తూనే వచ్చారు. ఎప్పుడూ స్తబ్దత ఎరుగని ఆయన ఆర్థిక రంగంలో వచ్చే మార్పులతో పాటు తన ఆరోగ్య సమస్యలపైనా అధ్యయనం చేస్తూ బెంగుళూరు వెళ్లి చికిత్స తీసుకునేవారు.అక్కడకు వెళ్లే ముందు పత్రిక వర్చేలాఅడ్రసు చెప్పి ఆ తర్వాత ఫోన్ చేస్తుండేవారు. 1945 ప్రాంతాలలో కమ్యూనిస్టు ఉద్యమంతోనూ పత్రికలు ప్రచురణలతోనూ అనుబంధం ఏర్పడిన విహెచ్ 2016 వరకూ అంటే 70 ఏళ్లపాటు దాన్ని నిలబెట్టుకోవడం అపురూపమైన విశేషం. . తన సహాయం తీసుకున్నవారు ముఖ్యమంత్రులూ కేంద్రమంత్రులైనా . తన ప్రచురణలకు సహకారం తప ్పఆయన ఏమీ ఆశించిందీ పాకులాడిందీ లేదు. అయినా సుదీర్ఘజీవితంలో అనేక అవార్డులు పురస్కారాలు ఆయనకు లభించాయి. కుమారుడు సతీష్‌బాబు కూడా జర్నలిస్టు కాగా భార్య సరళాకుమారి రచయిత్రి, మరో కుమారుడు కుమార్డె కూడా వున్నారు. కుటుంబ సభ్యులు కూడా తన భావాలను గౌరవించి చివరివరకూ కృషి కొనసాగడానికి దోహదపడ్డారు. విహెచ్‌ను తెలంగాణ సాయుధ పోరాట స్వర్ణోత్సవాల సందర్భంలోనూ నవతెలంగాణ ప్రథమ వార్షికోత్సవంలోనూ సత్కరించారు. ఆయనపై గౌరవ సూచకంగా బి.వి.రాఘవులు, నేను, మరికొందరు నాయకులు కలసి ప్రత్యేకంగా ఇంటికివెళ్లి సత్కరించి రావడం మరచిపోలేని అనుభవం. ఎందుకంటే ఒక మనిషి ఇంతకాలం అర్థవంతంగా ఆశయ నిబద్దంగా వృత్తి నిబద్దతతో జీవించడం నిజంగానే అరుదు.విహెచ్ పరిపూర్ణజీవితం , కృషి రచనలు పాత్రికేయులకూ ప్రగతిశీల ఉద్యమాలకూ గర్వకారణం.