అరవిందస్వామి కన్నా రామ్‌చరణ్‌కే మార్కులు
మన సినిమా సమీక్షకులలో మీడియాలో ఒక ధోరణి ఏదో ఒక మూసలో కొట్టుకుపోవడం. ధృవ చిత్రానికి అరవింద్ స్వామి గొప్ప ఆకర్షణ అన్నది అలాటి ఒక ప్రచారమేనని అయిదవ రోజు ఆ చిత్రం చూస్తే అనిపించింది. రాజకుమార్తె పనిమనిషి వేషం వేస్తే ఆకర్షణవున్నట్టు హీరోలుగా నటించిన వారు విలన్ వేషం కడితే బాగానే వుంటుంది. సుమన్ జగపతిబాబు, అరవింద్ స్వామి ఎవరైనా. అయితే వారు ఆ ప్రత్యేకత చూపించగలిగారా అనేది ప్రశ్న. అరవింద్ చాలా సొఫిష్టికేటెడ్ విలన్‌గా మేకవన్నె పులిగా అనితర సాధ్యంగా కనిపించాడనేది అతిశయోక్తి మాత్రమే. అసలు ఆ పాత్రే చాలా క్రూడ్‌గా రూపొందింది. తెరపై ప్రత్యక్షమైనప్పటి నుంచి ప్రాణాలు తీయడం కుట్రలు పన్నడం తప్ప వేరే పని లేనట్టు నడిచింది. ఆ మాటకొస్తే నాకైతే రామ్ చరణ్‌లోనే ఈజ్, డాష్ కనిపించాయి. పెద్ద సవాలన్నట్టు పోరాడాడు. రకుల్ ప్రీత్ సింగ్‌కు పాత్రేలేదని మరో కామెంటు.చాలా తెలుగు సినిమాల్లో కంటే దీంట్లో ఆమె పాత్ర ఎక్కువనే చెప్పాలి. నిజానికి హీరోను కూడా ఒక దశలో మోటివేట్ చేస్తుంది.సహాయపడుతుంది. జనరిక్ మెడిసిన్స్ అనడమే గాని ఆ సమస్యను సవ్యంగా చిత్రించింది లేదు. అనేక చోట్ల ఇతర సినిమాలు గుర్తుకు వస్తాయి. తమిళనాడు తరహా రాజకీయ వాతావరణాన్ని తెలుగీకరించడంలోనూ లోపమే.ఆఖరులో భార్య ప్రీతి విలన్‌ను చంపడంలో కూడా. కబాలిలో వలెనో దీంట్లోనూ హాలివుడ్ తరహా మ్యూజిక్‌ది సగం పాత్ర. తమిళంలో సంచలన విజయం సాధించినా తెలుగులో ఇప్పటికి ఒక మోస్తరు కలెక్షన్లతో నడుస్తున్న ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టే అవకాశమైతే లేకపోవచ్చు. పైగా నోట్ల దెబ్బ కూడావుంది.రామ్‌చరణ్ శ్రద్ధాశక్తి మాత్రం తెలుస్తాయి.చాలా భవిష్యత్తు వుంది గనక ఇంకా టఫ్ రోల్స్ చేయొచ్చు.