మోడీపైనే రాహుల్‌ అస్త్రం- స్పందించని కేంద్రం

నోట్లరద్దుపై చర్చకు సంబంధించి పార్లమెంటు నిరవధికంగా స్తంభించిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీ నేరుగా ప్రధాని మోడీపైనే అవినీతి అస్త్రం సంధించడం తీవ్రమైన విషయమే. మోడీ వ్యక్తిగత పాత్రకు సంబంధించిన సమాచారం తన దగ్గర వుంది గనకే తను మాట్లాడేందుకు అనుమతించడం లేదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మోడీ అవినీతికి పాల్పడినట్టు తాను సభలో ఆరోపించబోతున్నట్టు ముందే సూచించారు. దీనిపై తన దగ్గర నిర్దిష్ట సమాచారం వుందని కూడా ధీమాగా చెప్పారు. ఈ కారణంగా సమాధానం చెప్పలేననే భయంతోనే మోడీ వెనక్కు పోతున్నారని తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంత తీవ్రంగా ఏకంగా మోడీపైనే అస్త్రం సంధించారంటే దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. నేను నోరు విప్పితే భూకంపం వచ్చేస్తుందని గతంలోనూ అన్నారు. దీనిపై కేంద్రం స్పందన చాలా బలహీనంగా పేలవంగా వుంది. సమాచారం వుంటే ఎందుకు బయిటపెట్టడం లేదని పార్లమెంటరీ మంత్రి అనంతకుమార్‌ చర్చను బలహీనపర్చేందుకు ప్రయత్నించారు. నిస్ప్రహలోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని కూడా అన్నారు. అదే నిజమైతే సభలో సమాధానం చెప్పొచ్చు. ఓటింగుతో కూడిన చర్చకు నిరాకరిస్తున్నంత వరకూ ప్రభుత్వం వెనక్కుపోయినట్టే భావించాలి. ఇప్పుడు ప్రభుత్వం. మాకేం భయం లేదు అని ముందుకొచ్చే బదులు చర్చ జరపకపోతే ఆరోపణల గురించి ఆలోచనలో పడినట్టే అనుకోవాలి.
ఇదంతా రాహుల్‌ వ్యూహాత్మకంగా చేస్తున్నారని కొందరి వ్యాఖ్యానం. ఇప్పుడు చర్చకు ఒప్పుకున్నా వెనక్కుపోయినా ఇరకాటం తప్పదు. చర్చలో ఆయన ఇదివరకే వున్న విషయాలను మరో రూపంలో ప్రస్తావించవచ్చు. నిన్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కూడా ఇదో స్కామ్‌ అని అభివర్ణించారు. అంటే కాంగ్రెస్‌ వారికి ఏవైనా నూతన ఆధారాలు దొరికాయని భావించాలా? లేక బెదరగొట్టాలని చూస్తున్నారా? అలా అనుకున్నా ఈ దూకుడుకు ఏదో ఒక కారణం వుండకుండా పోదు. మామూలుగా అయితే ఇలాటప్పుడు బిజెపి సవాలును స్వీకరించి వుండాల్సింది. ఇలా అన్నాక కూడా మామూలు విమర్శలతో విసుర్లతో సరిపెడుతున్నారంటే నేరుగా ఢకొీనడానికి సిద్దంగా లేరన్నమాట. బహుశా ఇప్పటికే గందరగోళంగా వున్న పరిస్థితి ఇంకా దిగజారుతుందనే సంకోచం కావచ్చు. షరామూములుగా ట్విట్టర్‌లో రాహుల్‌ను ఎగతాళి చేస్తున్నారు గాని రెండో వైపు నుంచి ఆలోచించడం లేదు.
బిజెపికన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందన ఇంకా తీవ్రంగా వుంది. రాహుల్‌ గాంధీ ఆధారాలుంటే సభ వెలుపల ఎందుకు బయిటపెట్టరని ఆయన ఆక్షేపించడం వింతగా వుంది. గతంలో మోడీపై తనదగ్గరున్న ఆరోపణలను ఆయన అసెంబ్లీలోనే ప్రస్తావించారు. అవి నా సైట్‌తో సహా అన్నిచోట్లా సంచరిస్తున్నాయి. మోడీకి తామే పోటీ అనుకుంటున్న మమతా బెనర్జీ కేజ్రీవాల్‌లు మరెవరినీ అనుమతించడానికి సిద్ధంగా లేరన్నమాట. మొద్దబ్బాయి అనిపించుకున్న రాహుల్‌ ఏం చేస్తారో ఏం చెబుతారో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *