43 మంది న్యాయమూర్తులపై కేంద్రం ఆరోపణ- జస్టిస్‌ చలమేశ్వర్‌ చర్యతో పరోక్ష మద్దతు

హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించేందుకోసం సుప్రీం కోర్టు కొలీజియం పంపిన 77 పేర్లలో 43 కేంద్రం తిరస్కరించడం అసాధారణ చర్య. హైకోర్టులలో మొత్తం 10799 మంది న్యాయమూర్తుల అవసరం వుండగా ఇప్పుడు 478 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇది 45 శాతం కన్నా తక్కువే. ఇలాటి సమయంలో ఏవో సాకులతో మోడీ ప్రభుత్వం నియమకాలను ప్రతిష్టంభనలో పడేయడం దారుణం. దేశంలో న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని అందరూ కోరుతున్నారు. తమను తామే నియమించుకునే కొలీజియం స్థానే మరింత ప్రజాస్వామికమైన పద్ధతి రావాలంటున్నారు. న్యాయకమిషన్‌ ఏర్పాటు చేస్తే నియామకాలతో సహా అన్ని విషయాలు అది చూసుకుంటుంది. ఆ మేరకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి కూడా. వాటిని తగు రీతిలో ముందుకు తీసుకుపోయే చర్యలు తీసుకోవచ్చు. అందుకు బదులుగా కేంద్రం న్యాయమూర్తుల నియామకాలను తన చేతుల్లోకి తీసుకుంటున్నది. తగు రాజ్యాంగ సవరణ లేకుండా ఈ విషయంలో కేంద్రం చేయగలిగింది లేదు. అయినా ఏవో ఆరోపణలతో నిలిపివేసి ప్రతిష్టంభన సృష్టిస్తున్నది. నియామకాల కమిషన్‌ చెల్లదు గనక నియామక ప్రక్రియపై మెమోరాండం ఆఫ్‌ ప్రోసీజర్‌ రూపొందించవలసిందిగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాన్ని అడ్డుపెట్టుకుని అడుగడుగునా అడ్డుపడుతున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన జాబితాలోని 77 మందిలోనూ 43 మందిపై భద్రతా సంబంధమైన తీవ్ర అభ్యంతరాలున్నాయని కేంద్రం చెప్పడం వూహకందని విషయం.ఆ స్థాయి వరకూ వచ్చిన వారిలో అంత మంది అనుమానితులు వున్నారని ఆరోపించడం నమ్మశక్యం కాదు.
ప్రతిపక్షాల మీద మీడియా వారి మీద రకరకాల ముద్రలు వేస్తున్న మోడీ chala-thagurప్రభత్వం ఇప్పుడు న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి అక్కడ నియామకాలనూ ప్రభావితం చేయడం శోచనీయం.ఇలాటి తీవ్ర స్థాయి సందేహాలు రేకెత్తిస్తే న్యాయమూర్తులు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం కూడా దెబ్బతింటుంది. భయం వేళ్లాడుతున్నప్పుడు ఇచ్చే తీర్పులు ఎలా వుంటాయో వూహించవచ్చు. న్యాయవ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు చర్యలు తీసుకునే బదులు హడావుడిగా నియామకాలను మాత్రమే గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం అనుమతించరానిది. ప్రస్తుత సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా కొలీజియంపై చేసిన విమర్శలు బహిర్గతం అయ్యాయి.ఆయన వాదనలు కేవలం సహచర న్యాయమూర్తులనే తప్పుపట్టేలా వున్నాయి తప్ప ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నించేవిగా లేవు. దీనిపై న్యాయ వ్యవస్థలో రకరకాల అంచనాలున్నాయి. ఏమైనా న్యాయవ్యవస్థ స్వతంత్రత, జవాబుదారితనం రెంటినీ కాపాడాలే గాని ఏదో ఒకదాన్నే నొక్కడం వల్ల న్యాయం జరగదు.దీనిపై కొంత కాలం కిందట లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ్‌ హైదరాబాదులో రౌండ్‌టేబుల్‌ నిర్వహించారు.న్యాయవ్యవస్థ లోపాలు తప్పులు చెప్పడం బాగానే వుంది గాని ప్రభుత్వ వైఖరి కూడా సరిగాలేదని నేనక్కడ చెప్పాను. ఆ భావం రోజురోజుకు ఇంకా బలపడేలా ప్రభుత్వ చర్యలు వుంటున్నాయి. ఇది ఆందోళనకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *