నమో భజన.. నల్లధనానికి బడా కార్పొరేట్ రూటు…?
కొంతమంది ముఖ్యమంత్రులతో సహా ముఖ్యనాయకులు నోట్లరద్దుపై పరిపరివిధాల మాట్లాడటానికి కారణమేమిటి? ఇన్ని పిల్లిమొగ్గలు ఎందుకేస్తున్నారు? దీనికి అధికార పక్షాల ఆంతరంగికులు సమాధానమిస్తున్నారు. మిగిలిన వాటిలా ఇది కేవలం విధానపరమైన సమస్య కాదు. మనుగడకు సంబంధించిన సమస్య. భారీగా డబ్బు నిల్వ చేసుకున్న వారిలో పాలక పార్టీల అగ్రనేతలు ప్రభుత్వాల నేతలూ ముందుంటారు. ప్రధాని మోడీ ముందుగా వారిని విశ్వాసంలోకి తీసుకోలేదు గనక ఆ డబ్బు ఒక్కసారిగా గుండెల మీదకుంపటిగా మారింది. అలాగే వారికి వెన్నుదన్నుగా వుండే బడా వ్యాపారుల దగ్గర బోల్డెంత లెక్క వుంది. తమ సొమ్మునూ ఈ శ్రేయోభిలాషులను కాపాడుకోలేకపోతే రేపు ఎన్నికల పోరాటం గాని రాజకీయాలలో చక్రం తిప్పడం గాని కుదరదు. కాబట్టి భేషజాలు పక్కనపెట్టి దాన్ని చెల్లించుకోవాలి.తమ వాళ్లను కాపాడుకోవాలి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకే పెద్దగా తెలియని పరిస్థితుల్లో అన్యధా శరణం నాస్తి అన్నట్టు ఆదుకోగలిగింది ప్రధాని మోడీ మాత్రమే.కనుకనే చివరకు ఆయనను కలిసి మద్దతు చెప్పి వస్తున్నారు. ఈ క్రమంలో అనేక బేరసారాలు అవగాహనలు జరిగిపోతున్నాయి. తమ పరిధిలో వున్న మేరకు సర్దుకున్నా ఇంకా చాలా రెట్లు సమస్యలు వుంటాయి గనక కేంద్రం ఆశీస్సులతో ఒక బడాబడా కార్పొరేట్ కంపెనీ పదుల్లో వీటన్నిటినీ తెలుగు చేసుకోవడానికి వారికి అండదండలు లభిస్తున్నాయి. లక్షల కోట్లలో లావాదేవీలు చేసే కార్పొరేట్లకు ఇది పెద్ద సమస్య కాదు. అవన్నీచట్టం ముద్రతోనే ఇష్టానుసారం చేసుకుపోవడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.అత్యున్నత నేతలు కూడా వారికి అడ్డుచెప్పే పరిస్థితే వుండదు.చెబితే వారూ వుండరు. అదిగో అలాటి స్వర్గధామాలను కేంద్రం ఈ రాజకీయ దోస్తులకు అందుబాటులోకి తెచ్చింది. కాబట్టే ప్రజల పేరిట ప్రభుత్వాల తరపున మాట్లాడుతూనే ఇళ్లు చక్కబెట్టుకుంటున్నారు. నేరుగా గాకుండా తమకుండే అనేకానేక మార్గాలలో గప్‌చిప్‌గా ఇదంతా జరిగిపోతుంది గనకే నిశ్చింతగా కేంద్రాన్ని సమర్థిస్తున్నారని విమర్శకులూ పరిశీలకుల మాట.