నమో డిమో లీల.. ఒక నెలవిల విల..
తమ్ముడి కూతురు పెళ్లి తదితర విషయాల కోసం వెళ్లి వచ్చే సరికి పది రోజులు గడిచిపోయాయి. మొత్తం నాలుగైదు నగరాలు మూడురాష్ట్రాలు చూశాను గాని పరిస్థితి ఒక్కటే. నోట్ల రద్దు నెల రోజుల విలవిల.. మల మల.. బాధల్లో మార్పులేదు. బాగుపడిన వారు ఒక్కరూ లేరు. మహానగరాల్లో బ్యాంకుల్లో కీలక స్థానాల్లో వున్నవారూ, మీడియా సంస్థల్లో సారథ్యం వహించే వారూ ఎవరూ 500 చూసిన వారు నామమాత్రం. వయసుతో నిమిత్తం లేకుందా వరసల్లో నిలిచి అలసిసొలసి పోతున్న వారు అత్యధికం. చాలా సార్లు చెప్పుకున్న అంశాలు పునరావృతం చేయను. క్లుప్తంగా సూటిగా ఇప్పుడు మాసోత్సవం(లేదా మోసోత్సవం) నాటికి అన్ని స్పష్టమై పోయాయి.
1.నల్లడబ్బు అరికడతామన్నారు- ఆ వూసేలేదు. మీసర్జికల్ స్ట్రయిక్ సామాన్యులపై తప్ప సంపన్పులను తాకనైనా లేదు. మీ వాళ్ల దగ్గరే భారీ మొత్తాలు దొరుకుతున్నాయి! పైగా స్వచ్చంద పథకం వెల్లడి రెండో ఘట్టం ప్రకటించారు.
2. మొత్తం 15 లక్షలకోట్లలో 3 లక్షల కోట్ల నల్లధనం తిరిగిరాకపోతే విజయం అని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. అయితే ఇప్పటికే 12 లక్షల కోట్లకు పైగా డబ్బు బ్యాంకులకు తిరిగి వచ్చేసింది. కాబట్టి అదీ ఫెయిల్యూరే
3.టెర్రరిజాన్ని అరికడతామన్నారు- ఈ నోట్లరద్దు బాధల మధ్యనే కాశ్మీర్ నడిబొడ్డులాటి నగ్రోటా స్థావరంపై దారుణమైన టెర్రరిస్టు దాడి జరిగి మన సైనికులు పెద్ద ఎత్తున నష్టపోయారు.
4.నకిలీ నోట్లను అరికడతామన్నారు. కొత్త 2000 అధికారికంగా విడుదల కాకముందే లీకేజీ ఫేకేజీ కూడా జరిగిపోయాయి! పైగా ప్రధాని దగ్గర మేకిన్ ఇండియా అవార్డు పొందిన అభినవ్ వర్మ ఈ నేరానికి పాల్పడ్డారు.
5.అవినీతిని అరికడతామన్నారు- మొదట పాతనోట్లలోనూ ఇప్పుడు కొత్తనోట్లలోనూ కూడా యథేచ్చగా లంచాలు పుచ్చుకుంటున్నట్టు గుజరాత్‌లోనూ కర్ణాటకలోనూ కేసులు దొరికాయి.
6.అక్రమార్కుల చిద్విలాసాలు అరికడతామన్నారు. సాక్షాత్తూ మీ పార్టీ మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి మీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అంగరంగ వైభోగంగా పెళ్లిల్లు చేయించారు. మీరిచ్చే 2.5 లక్షల నగదుతోనేనా? ఇప్పుడు ఏకంగా టిటిడి పాలకమండలిసభ్యుడి దగ్గరా నోట్లు పట్టుబడ్డాయి. ఇంకా చాలా దారుణాలున్నాయి
7.నిష్కారణంగా క్యూల పాలైన సగటు భారతీయులు వందమంది మరకూ మరణించారు.వారికి సంతాపం తెలపడానికి కూడా మీకు మనసొప్పలేదు.
8.సమీప భవిష్యత్తులో నోట్ల సంక్షోభం పరిష్కారమయ్యే సూచనలే లేవని మీ ప్రభుత్వాధికారులే ఒప్పుకంటున్నారు. మీరూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.


