నగదు రహితం కాదు- రక్త రహితం
నోట్ల రద్దు ప్రహసనంపై ఆర్థిక వేత్త అరుణ్‌కుమార్ చాలా సులభమైన ఒక పోలిక చెప్పారు. ఇప్పుడు రద్దు చేసిన నోట్లు నగదు చలామణిలో 87 శాతం వున్నాయి.కొత్తగా విడుదలైనవి అందులో పదోవంతు కూడా లేవు. మరి ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? ఒక మనిషి శరీరంలోని 87 శాతం రక్తం ఒక్కసారిగా తీసేస్తే ఏమవుతుంది? వెంటనే కొత్త రక్తం ఎక్కించలేకపోతే తీసేయకూడదు.ఉన్నది తీసేసి కొత్తగా ఎక్కించకపోతే ఆ మనిషి కుప్పకూలిపోతాడు ఇదీ అంతే.
ఇక రెండవది- నగదు రహిత హడావుడి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా ముందున్నారు. అలాగే కెసిఆర్‌కూడా. తెలంగాణ వాలెట్ పేరిట ఒకరు ఎపి పర్స్ పేరిట మరొకరు విడుదల చేశారు.చంద్రబాబు ఒకడుగు ముందుకు వేసి మార్పుమిత్రలంటూ కొత్త తరహా ఏజంట్లను ప్రతిఫలంతో సహాప్రకటించారు. ఇంతా చేస్తే నగదు రహితం వల్ల ప్రజలు సదరు సంస్థలకు రుసుము చెల్లించవలసి వుంటుంది.2000 పైబడిన చెల్లింపులకు ప్రభుత్వం మినహాయింపు నిస్తుందంటే అంతకు లోపు కొనేవాళ్లు నష్టపోయినట్టే కదా. దీనిపై పార్లమెంటులోనూ నిరసన వ్యక్తమైంది.
స్వీడన్ బెల్జియం వంటి చోట్ల మినహా పూర్తి నగదు రహితం ఎక్కడా చలామణిలోకి రాలేదు. వచ్చిన చోట్ల సమస్యలూ పోలేదు. డిజిటల్ చెల్లింపుల పద్ధతి స్వైపింగ్ మిషన్ల వల్ల లాభపడేది ప్రధానంగా గొలుసు కట్టు రిటైల్ సంస్థలు కాగా నష్టపోయేది చిన్నచితక వ్యాపారులే. పైగా ఈ పద్ధతివల్ల ఎవరు ఏవి ఎక్కువగా కొంటున్నారు వంటి మార్కెట్ సర్వేలు తేలికై పోతాయి. ఆ బిగ్ డేటా బహుళజాతి కంపెనీలకు చేరుతుంది. నగదు చలామణి లేకపోవడం వల్ల వ్యవసాయరంగం దెబ్బతింటుంది. ఇవన్నీ వలసలనూ మార్కెట్ పట్టునూ మరింత పెంచుతాయి.
ఇప్పటికే పేమెంటు బ్యాంకుల పేరిట స్వల్ప పెట్టుబడులతో ప్రైవేటు బ్యాంకులను తీసుకువస్తున్నారు. ఈ కంపెనీలే వాటిని నడిపిస్తాయి. లాభాలు రావడం లేదంటూ గ్రామీణ బ్యాంకుల శాఖలను ఇప్పటికే మూసి వేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ బ్యాంకులను దెబ్బతీసేందుకే ప్రైవేటు బ్యాంకులకు అధిక నగదు విడుదల చేస్తున్నారు. అలా మొత్తంపైన ఒక మార్కెట్ వలయంలో మనం చిక్కుకుపోతాం. మన డబ్బుతో మనకు నచ్చినచోట గాక వారు నిర్దేశించిన చోట నియంత్రిత పద్థదిలో తీసుకోవలసి వస్తుంది. అమెరికాలోనే 20 డాలర్ల నగదుతో కొనుగోళ్లు చేయడం సినిమాలు చూడటం కూడా కష్టంగామారిందని విమర్శలుంటే మన వంటి పేద దేశంలో మొత్తం నగదు రహితం చేసేస్తామనడం నిజానికి అర్థ రహితం ఈ చర్య నిష్ప్రయోజనమనీ జాతీయ విపత్తు అనీ అంటున్న చంద్రబాబు నాయుడే మళ్లీ ఉత్సాహంగా డిజిటల్ వీరుడిలా ప్రవర్తించడం పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది.