కెసిఆర్‌ నిరాహరదీక్ష- రాజకీయ చారిత్రిక వాస్తవాలు

కెసిఆర్‌ 2009 నవంబరు 29న నిరాహారదీక్ష ప్రారంభించిన సమయంలో నేను హరగోపాల్‌, అల్లం నారాయణలతో పాటు ఎబిఎన్‌ చర్చలో వున్నాను. ఆయనను ఆరంభించడానికి ముందే అరెస్టు చేయడం, తర్వాత ఖమ్మం తరలించడం వంటి పరిణామాలన్నీ జరిగాయి. ఆయన దీక్ష విరమించినట్టు వార్త వచ్చిన కాస్సేపటికే ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ఉద్రిక్తత పెరిగాయి. ప్రభుత్వం అసత్యవార్త ప్రసారం చేసిందని ప్రకటనలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాఘాటంగా నిశ్చితాభిప్రాయాలు వెల్లడిస్తూనే వున్నాను. కెసిఆర్‌ చాలా చతురుడైన రాజకీయ వ్యూహకర్త. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని తన వైపు తిప్పుకోగలిగారు.తమ పార్టీ వారికన్నా ఆయన మాటకే ఎక్కువ విలువ చూపే పరిస్థితి వుండింది. గత్యంతరం లేదనుకుని తెలుగుదేశం కూడా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కెసిఆర్‌ను తెలంగాణ జాతిపిత అని అసమాన మేధావి అని ఎంతైనా పొగడొచ్చు గాని రెండు ప్రధాన పాలక పక్షాలైన కాంగ్రెస్‌టిడిపిలు బలపర్చడం, మరో ప్రధాన పార్టీ బిజెపి మౌలికంగా చిన్న రాష్ట్రాల కోర్కెకు అనుకూలం కావడం ఈ క్రమాన్ని వేగవంతం చేసింది. సిపిఐ కూడా వైఖరి మార్చుకున్నది.కెసిఆర్‌ దీక్ష ఫలించడానికి ఇవన్నీ కారణాలే. సిపిఎం విధానం మార్చుకోలేదు గాని ఆ అంశంపై తన అభిప్రాయం చెప్పి తటస్థంగా వుండిపోయింది. 2004లో ఏర్పడిన మన్మోహన్‌ ప్రభుత్వానికి సిపిఎంతో సహా వామపక్షాల మద్దతు కీలకం గనక వారే అడ్డుపడివుంటే ఆ అంశం ఎజెండాలోకి వచ్చేది కాదు. పెద్ద పార్టీలు ఎక్కడి పాట అక్కడ పాడాయి గాని సిపిఎం రెండు చోట్ల కూడా మౌనంగా వుండిపోయింది. దాని బలం కూడా పరిమితమే.
వాస్తవానికి 2000 సంవత్సరంలో విద్యుచ్చక్తి ఉద్యమంతో ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిన వున్నది అర్థమైంది. దాన్ని ఆధారం చేసుకుని నివురు కప్పిన నిప్పులా వున్న తెలంగాణ కోర్కెను పైకి తీసి తనకు అనుకూలంగా మలుచుకోవడంలో నిస్సందేహంగా కెసిఆర్‌ ప్రతిభ వుంది. కాని అదొక్కటే అయితే విభజన జరిగేది కాదు. అనేక శక్తులు కలసి వచ్చాయి. కెసిఆర్‌ చాకచక్యం వల్ల ఉద్యమ అత్యున్నత నేతగా ఆయన వుండిపోయారు. సమన్వయ పాత్ర నిర్వహించిన జెఎసి చైర్మన్‌ కోదండరాం మౌలికంగా రాజకీయ నేత కాదు గనక ఇది సాధ్యమైంది. జయశంకర్‌ అనారోగ్యం కారణంగా కోదండను ఎంపి చేసినప్పుడే ఇది నిర్ధారణ అయిపోయింది. రానురాను కెసిఆర్‌ మాత్రమే గాక కెటిఆర్‌ కవిత హరీష్‌ వంటివారే ప్రముఖంగా ముందుకువస్తుంటే కోదండను సాంకేతికంగానే సమన్యవ పాత్రలో నడిపించారు. సోనియాగాంధీ కూడా సంప్రదాయ రాజకీయ వేత్త కాదు గనక టిఆర్‌ఎస్‌ విలీనానికి సంబంధించి షరతులు లేకుండానే తెలంగాణ బిల్లు ఆమోదింపచేశారు. ఆమెను సకుటుంబంగా సందర్శించి కెసిఆర్‌ ఆఖరి వీడ్కోలు చెప్పేశారు.
ఈ ఘట్టంలో కెసిఆర్‌ తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవలసి వుంటుందని పార్టీ నేతలకు చెప్పేశారు. అయితే అది పైపైకే కావచ్చు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్‌లో లీనం కావాలనుకోలేదు. అలా అయితే తను ముఖ్యమంత్రి కావచ్చునేమో గాని స్వంత కుటుంబం ఆధిపత్యం వుండవు. ప్రతిదానికి అధిష్టానం వైపు చూడాలి.పైగా తన తర్వాత కుమారుడు ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్‌లో కుదరదు. ఈ కారణంగానే ఆయన చివరకు విలీనం ప్రసక్తి లేకుండా స్వంత అస్తిత్వం స్వీయ పరివారం ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ కారణంగానే తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ తన అదుపులో వుండేట్టు ఆచితూచి అడుగులేస్తూ వచ్చారు, 2010 ప్రాంతాల్లో ఒకసారి సాక్షి స్టూడియోలో కెటిఆర్‌తో మాట్లాడినప్పుడు స్వయంగా ఈ సంగతి చెప్పారు. నిరాహారదీక్ష విరమించగానే బస్సు యాత్ర చేద్దామని పార్టీ వారు కొందరు సూచిస్తే కెసిఆర్‌ కొట్టిపారేశారట. కారణం ఏమంటే ఉద్యమం అంటూనే ఉద్రేకంగా మాట్లాడుతూనే రాజకీయ లాబియింగ్‌ద్వారా విభజన చేయించుకోవాలని ఆయన వ్యూహం. ఇప్పటికీ ఆయనకు ఆ స్వభావం వుంది. లాబీ గులాబీ అనే అప్పటి మాట ఇప్పుడూ వర్తిస్తుంది.

కెసిఆర్‌తో దీక్ష విరమింపచేయడం కోసం పొత్తూరి వెంకటేశ్వరరావు కె.రామచంద్రమూర్తి వంటివారు సంపాదకుల సంతకాలు సేకరించి అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. ఏదో విధంగా దీక్ష విరమింపచేయాలన్నదే అజెండా. అందుకు అనేక ప్రత్యామ్నాయలు కూడా సిద్ధమైనాయి. అయితే అధిష్టానం అనుకున్నదానికన్నా అధికంగా స్పందించడం కెసిఆర్‌ వూహకు కూడా అందివుండదు. కాంగ్రెస్‌కు లాభం జరగడం కోసం వారు హడావుడి పడ్డారు.దీనిపై శాసనసభలో బిల్లు పెట్టడానికి నిరాకరించి రోశయ్య దిగిపోయారు.కిరణ్‌ కుమార్‌ రెడ్డి తర్వాత చాలా చేశారు గాని ఆ రోజున మాత్రం విభజన జరుగుతుందనే స్పష్టమైన సమాచారంతోనే పదవి తీసుకున్నారు. తర్వాత జరిగిందంతా చరిత్ర.
ఇంత చేసినా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్‌ పార్టీకి అత్తెసరు మెజార్టి మాత్రమే రావడం వల్ల బాహాటంగా ఫిరాయింపులను ప్రోత్సహించి మీడియాను నియంత్రించి ప్రతిపక్షాలపై ధ్వజమెత్తి ఏకపక్ష ఏక వ్యక్తి పాలనగా కుటుంబ సభ్యుల ప్రాధాన్యత కాపాడుకోగలిగారు. అప్పటి జెఎసి చైర్మన్‌ ఇప్పటికీ అలాగే వుండి కెసిఆర్‌ ప్రభుత్వ పోకడలపై నిరసన ప్రకటిస్తూనే వున్నారు. ఇలాటి వైరుధ్యాలు రాజకీయాల్లో సర్వ సాధారణం. అయితే కోదండకు పెద్దగా ప్రతిస్పందన ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు కెసిఆర్‌కు కనిపించడం లేదు. పైగా ఆయనను కూడా ద్రోహుల జాబిగాలో చేర్చడానికి సహాయకులు వుండనే వున్నారు.

చరిత్రను మలుపు తిప్పిన నిరాహారదీక్షలలో ఒకటిగా కెసిఆర్‌ నవంబర్‌29 దీక్ష మిగిలిపోయింది. అది నిజం కాదని జైపాల్‌రెడ్డి వంటివారు ఇప్పుడు అన్నా ఆ మాటలకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే వారి అధిష్టానమే అప్పట్లో కీలక ప్రకటన చేసింది. దాని వెనక తాేనే వున్నానని జైపాల్‌ చెప్పారు.ఇప్పుడు మరో విధంగా మాట్లాడినా ఉపయోగమేమిటి?కాకుంటే రాజకీయ పరిణామాలు నేతల మాటలు చేతలను అర్థం చేసుకోవడానికి మాత్రం అక్కరకు వస్తుంది. గతాన్ని పక్కనపెట్టి వర్తమానం సరిగ్గా వుండటానికి తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరడానికి ఏం చేయాలన్నదే ఇప్పటి విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *