యాంటీ యాంటీ ఇంకంబెన్సీకి వూతం- టిడిపి సంబరం. అందులోనే గడ్డు సంకేతం

ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ఫ్లాష్‌టీమ్‌ సర్వే ఫలితాలపై పెద్ద ప్రకంపనాలేమీ రాలేదంటే చాలా కారణాలున్నాయి. మొదటిది ఎన్నికలు ఇప్పట్లో లేకపోవడం, వచ్చే అవకాశం కూడా లేకపోవడం. రెండోది- సర్వే నిర్వాహకులు ప్రసారకులు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..అని నొక్కి వక్కాణించడం. అదెలాగూ జరగదని చెప్పడం. ఏ సర్వే అయినా చేసినప్పటి పరిస్థితినే చెబుతుంది కాని ఇప్పటికిప్పుడు జరిగితేనే.. అని అదేపనిగా చెప్పడం తక్కువ. ఇప్పటికైతే ఇలా వుందని అంటుంటారు.
సర్వే చేసింది ఫ్లాష్‌ టీం గనక వచ్చిన ఫలితాలతో మాకు సంబంధం లేదని ఎబిఎన్‌ అనొచ్చు. కొంతకాలం కిందట టివి9 ఇలాగే మరెవరో చేశారంటూ తెలంగాణపై ఒక సర్వే ప్రసారం చేసింది. గుండుగుత్తగా టిఆర్‌ఎస్‌కే మొత్తం సీట్లు ధారాదత్తం అవుతాయన్నది ఆ సర్వే. దాంతోపోలిస్తే ఎబిఎన్‌ సర్వేలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ఓట్లు సీట్లు తక్కువ వున్నా చెప్పుకోదగినట్టే వుండటం విశేషం. ఆ విధంగా చూస్తే ఈ సర్వే టార్గెట్‌ జగన్‌ కన్నా పవన్‌ కళ్యాణ్‌ జనసేన, బిజెపి అనిపిస్తుంది. బిజెపితో కలిసి చేస్తే 120,విడిగా చేస్తే 140 తెలుగుదేశంకు వస్తాయని చూపించడంలో సారాంశం అదే.దీనిపై బిజెపి నేతలు ఇంతవరకూ స్పందించకపోవడం కూడా సందేహాలు కలిగిస్తుంది. గత ఎ న్నికల్లో టిడిపి అధికారం లోకి రావడానికి బాగా తోడ్పడిన రెండు శక్తులను ముందే తగ్గించి చూపేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది.
అంతకంటే కూడా పదవీ కాలం మధ్యలో వున్న చంద్రబాబు ప్రభుత్వంపై సహజంగా వచ్చే యాంటీ ఇంకంబెన్సీ భావనను కాస్త చల్లబర్చడానికి, బాగానే వుందని భావన కలిగించి వూగిసలాట ఓటర్లను కాపాడుకోవడానికి అక్కరకు వస్తుందని పాలకపక్షం సంతోష పడుతున్నది. అయితే ఇంత చేసినా ఓట్ల శాతం మాత్రం కలిస్తే 42.5 విడిగా అయితే 46 అంటూ చెబుతున్నది.అంటే వ్యతిరేక ఓట్లే ఎక్కువన్న మాట. ఇక వైసీపీకి 36 శాతం ఓటింగు అటూ ఇటూగా చూపించారు. ప్రభుత్వాధినేతగా చంద్రబాబు గాని ప్రతిపక్ష నేతగా జగన్‌ గాని విఫలమైనట్టు చెప్పలేదు. బాగుంది ఫర్వాలేదు కలిపి చూస్తే ముఖ్యమంత్రికి 77 శాతం, ప్రతిపక్ష నేతకు 66 శాతం వచ్చింది.
వైసీపీ పని అయిపోయిందని జగన్‌ను ప్రజలు విశ్వసించడం లేదని టిడిపి చేస్తున్న ప్రచారానికి భిన్నమైన ఫలితమిది. పైగా రోజులు గడిచే కొద్ది సమస్యల పరిష్కారంలో వెనుకబాటు ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుతుందే గాని ప్రతిపక్షానికి పెద్ద సమస్య వుండదు. కాంగ్రెస్‌ కాస్త కోలుకోవడం ఆరు శాతం వరకూ ఓట్లు తెచ్చుకోవడం కూడా వైసీపీతో జట్టుకట్టడానికి దోవ తీయొచ్చు. వామపక్షాలు కూడా ఓటింగు పెంచుకుంటాయనే సర్వే చెబుతున్నది. పోటాపోటీ ఎన్నికలలో అవి చీల్చుకునే ఓట్లు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇదంతా కూడా ఎబిఎన్‌ సర్వే లెక్కల ప్రకారం చెబుతున్నదే.
ఇంతకూ ఈ సర్వేలో ఒక ప్రధాన మైన అంశం పవన్‌ కళ్యాణ్‌పై అంచనాలు.వాటిని విడిగాచూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *