పవన్ కళ్యాణ్‌పై ముందస్తు ముద్రకు యత్నం?
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన పల్స్ ఆఫ్ ఎపి సర్వేలో అసంబద్దంగా కనిపించేది పవన్ కళ్యాణ్ పట్ల జనసేన పట్ల అనుసరించిన వైఖరి. దీనిపై జనసేన ముఖ్యులతో మాట్టాడితే తాము దానిపై స్పందించదల్చుకోలేదని స్పష్టంచేశారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదని తేల్చిచెప్పారు. ఇలాటి ఏకపక్ష ప్రచారాలపై మాట్లాడకపోవడం ఉత్తమమని తాము అనుకుంటున్నట్టు వెల్లడించారు.
రేపు ప్రజలు పవన్‌ను ఆమోదించవచ్చు , ఆమోదించకపోవచ్చు.కాని అభిప్రాయ సేకరణలో కొన్ని కొటబద్దలు పాటించలేదు. ఉదాహరణకు చంద్ర బాబు నాయుడు,జగన్‌ల పనితీరు విషయంలో బాగుంది బాగాలేదు ఫర్వాలేదు అని మూడు ప్రశ్నలుంటే పవన్‌కు ఫర్వాలేదు అన్న భాగం ఎగిరిపోయింది. నిజానికి రాజకీయ రంగంలో తన స్వంత ముద్రతో ఇప్పుడే గట్టిగా ప్రయత్నం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కుమందికి అలాటి భావన వుండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అంతిమ నిర్ణయానికి రాలేరు గనక.కాని సర్వే నిర్వాహకులో ప్రసారకులో దాన్ని లేకుండా చేశారు. అందుకే 47 మంది బాగుందని,52 శాతం మంది బాగాలేదని అన్నట్టు పేర్కొన్నారు. దీనికి ఏ వివరణైనా ఇవ్వొచ్చుగాని అది అతికేదిగా వుండదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి సర్వే చేయదలిస్తే ఆయన గతంలోనూ ఇప్పుడూ రాజకీయ రంగంలో నిర్వహించిన పాత్ర, సమస్యలపై స్పందన ప్రసంగాలూ భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తున్న తీరు, తెలుగుదేశంతో సంబంధాలు, స్వయంగా నాయకత్వం వంటివి అడిగి తెలుసుకోవాలి. ఇంకా కావాలంటే ప్రజారాజ్యం రోజుల ప్రభావం, టిడిపి బిజెపిలను బలపర్చి ఇప్పుడు వాటి విధానాల కారణంగా వ్యతిరేకించడం, ప్రత్యేక హౌదాపై వత్తిడి, వ్యక్తిగత నిజాయితీ, సామాజిక కోణం, వయో బృందాల స్పందన వంటివాటిపై ఏమనుకుంటున్నారో అడగొచ్చు. అంతేగాని ఆ పార్టీ నిర్మాణం లేకుండా ఎన్నికలలో ఏం చేస్తారో తెలియకుండా సువ్యవస్తితమైన టిడిపితో గాని నూతన శక్తిగా వచ్చిన వైసీపీతో గాని సమానంగా ప్రశ్నలు వేసేసి మూడు శాతం ఓట్లు వచ్చాయని చూపించడం అశాస్త్రీయం. ఇంకా పూర్తిగా రంగంలోకి దిగకుండానే ముందస్తుగా విఫల ముద్ర వేసేందుకు ఇది దోహదం చేస్తుంది. నూతన శక్తులను రానివ్వడం లేదన్న విమర్శను నిజం చేస్తుంది. రాజకీయాల్లో సమీకరణలు శాశ్వతంగా వుండవు. పునస్సమీకరణలు జరుగుతుంటాయి. కాబట్టే ఆదిలోనే హంసపాదులా పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ప్రతికూలంగా చూపే ప్రయత్నంగా ఈ సర్వే విమర్శలు కొనితెచ్చుకుంటున్నది.