తెలుగులోనూ విజయం ‘ధృవ’ మేనా!

ఒక చిత్రం, దాంట్లో హీరో హీరోయిన్లు వంటి అంశాలతో ప్రచారం చేసుకోవడం ఒక పద్ధతి. అయితే మార్కెట్‌ యుగంలో అదొక్కటే చాలడం లేదు. క్రికెట్‌ ఆటపట్ల ఆకర్షణకు ఆటగాళ్ల ప్రతిభతో పాటు వచ్చే ఆదాయాలు కూడా పెద్ద ఆకర్షణ. అలాగే ఒక చిత్రం ముందే ఎంత మార్కెట్‌ చేసింది, ఎన్ని కోట్లు తెచ్చింది, వంద కోట్లు దాటిందా లేదా ఇలాటివి ఇప్పుడు ప్రధానంగా ముందుకొచ్చేస్తున్నాయి. బాహుబలి,శ్రీమంతుడు వంటి చిత్రాలు ఈ ధోరణిని పెంచాయి.సరైనోడు, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ వంటివి పెద్దగా పేరు తెచ్చినా లేకున్నా వసూళ్లు వాటికి ఘనత తెచ్చిపెట్టాయి. ఇదే కోవలో ఇప్పుడు రామ్‌చరణ్‌ తేజ తమిళం నుంచి పునర్నిర్మాణం చేస్తున్న ‘ధృవ’కు కొత్త ప్రచారం జరుగుతున్నది. ట్రయలర్‌ విడుదలైన కాస్సేపటికే యూ ట్యూబ్‌లో 10 లక్షల మందికి పైగా చూశారన్నది పెద్ద పాయింటుగా మారింది. మెగా ఫ్యామిలీ నేపథ్యం, మార్కెటింగ్‌ నైపుణ్యం రీత్యా ఇదేమంత అనూహ్యం కాదు. ఈ ట్రయలర్‌లో రామ్‌చరణ్‌చాలా స్టైలిష్‌గా వున్నాడని సోషల్‌మీడియా వ్యాఖ్యలు. నిజానికి తనెప్పుడూ స్టయిల్‌కు తక్కువ చేయలేదు గాని ముందస్తు హైప్‌ ఎక్కువైనా మంచిది కాదేమో.. బ్రూస్‌లీ పేరిట ఒక డిజాస్టర్‌ చూసిన రామ్‌ చరణ్‌కు ఘన విజయం చాలా అవసరమైన సమయం ఇది.
ఎడిటర్‌ మోహన్‌ కుమారుడు రాజా దర్శకుడుగా మరో కుమారుడు జయం రవి హీరోగా రూపొందిన తనువరువన్‌ కథలో పోలీసు అధికారి నేరస్తుడు, రాజకీయ అవినీతి వంటివి కొత్త అంశాలు కాదు గాని అనేక సామాజిక కోణాలు సైంటిఫిక్‌ ఫిక్షన్‌ లక్షణాలు కలగలపడం వల్ల ఆకర్షణ పెరిగింది. విలన్‌గా అరవిందస్వామి వేయడం దాన్ని మరింత పెంచింది. ఆయన రూపం తను చేసే చెడ్డ పనుల నుంచి దృష్టి మళ్లిస్తుంది గనకే ఏరికోరి ఎంచుకున్నట్టు దర్శకుడు మోహన్‌ రాజా వివరించారు.తెలుగులోనూ అరవింద్‌ స్వామి సిద్ధార్థ అనే ఆ పాత్ర గొప్పగా పోషించినట్టు రామ్‌ చరణ్‌ ప్రత్యేకంగా చెబుతున్నారు. సుమన్‌, జగపతి బాబు ఇలా అందాల నటులు విలన్‌గా వేస్తే ఎప్పుడైనా బాగుంటుంది. చిత్రమైన మలుపులతో కూడిన సిద్ధార్థ పాత్ర సైంటిస్టుగా చేసే ప్రయోగాలు వేసే పథకాలు కూడా మిస్టరీగా వుంటాయి.దానికే ఈనాటి వాతావరణానికి తగిన సామాజిక కోణం కూడా కలపడంతో ప్రజలు విరగబడి చూశారు. తను వరువన్‌( అతను ఒంటరి)వంటి పేర్లు గతంలో తెలుగులో వచ్చాయి గనక ధృవ ఎంచుకున్నట్టున్నారు. కొరటాల శివ రాజమౌళి వంటివారి తరహాలోనే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు సోషల్‌ మెసేజ్‌ అద్దడం ఇప్పుడు ట్రెండ్‌గా వుంది.ఇది కొంతలో కొంత మేలే.చిరంజీవి తీస్తున్న కత్తి లోనూ ఆ విధంగా రైతుల సమస్యలుంటాయి.
ఈ తండ్రీ కొడుకులు ఇప్పటి వరకూ తెలుగు చిత్రాలను తమిళంలో తీసి విజయాలు సాధించారు. ఇప్పుడు వారి తమిళ చిత్రం తెలుగులోకి రావడం ప్రత్యేకత. 2015లో తమిళంలొ ఇదే అతి పెద్ద విజయం నమోదు చేసింది.మరి ఏఏ మార్పులు చేశారో చూడాలి.ఈ చిత్రం చూసిన రజనీ కాంత్‌ తన తదుపరి చిత్రం మోహన్‌కు అప్పగించారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *