జైళ్ళుబద్దలు.. జైజై దేశ భద్రత
పంజాబ్‌లోని నభా హై సెక్యూరిటీ జైలు కాపలాగోడలు బద్దలు కొట్టి మరీ ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ కమాండర్ హర్మీందర్ సింగ్ మంటూను విడిపించుకుపోవడం మన భద్రతా వ్యవస్థకు మరో కళంకం. వచ్చిన వారు పాక్ ప్రేరిత సాయుధులుగా కనిపిస్తుంది.పోలీసు యూనిఫాంలో ఇద్దరు ఖైదీలను అప్పగించడానికి వచ్చామంటూ వారు దర్జాగా లోపలకి వెళ్లి తాళాలు తీసుకుని తర్వాత బాంబులు కురిపించి తమకు కావలసిన వారిని తీసుకుపోయారు. దేశభక్తి గురించి దేశభద్రత గురించి రోజూ స్తోత్రపాఠాల నేపథ్యంలో దీన్ని సవాలుగా వైఫల్యంగా తీసుకుంటారో లేదో ఏలినవారికే తెలియాలి. కేంద్రంలోనూ పంజాబ్‌లోనూ కూడా (అకాలీ ప్రభుత్వ భాగస్వామిగా) బిజెపి పాలక కూటమిలో వుంది మరి! గతంలో కాశ్మీర్‌లోనూ వారి పాలక కూటమి హయాంలోనే యురీ దాడి జరిగింది. ఆ తర్వాత మరికొన్ని. అంతకు ముందు పఠాన్ కోట. ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ గంభీరోక్తులకు లోటు లేదు. మరీ పరిక్కర్ అయితే ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. ఈ మధ్యనే ఆయన చొరబాటుకు పాల్పడితే పాక్ సైనికుల కళ్లుపీకేస్తామని వ్యాఖ్యానించారు. మన దాడుల దెబ్బకు తల్లడిల్లిన పాక్ తగ్గించాలని వేడుకుంటున్నట్టు కూడా ఆయనే సెలవిచ్చారు.కాని పంజాబ్ జైలు దాడి తర్వాత. షరా మామూలుగా ప్రభుత్వం అప్రమత్తత గాలింపు వగైరా వగైరా హడావుడి చేస్తుందనుకోండి.2014లో హర్మీందర్‌ను పట్టుకున్నప్పుడు గొప్ప ఘనతగా చెప్పుకున్నవారు ఇప్పుడాయన తప్పించుకుపోత ేదారుణ వైఫల్యం అనాలి కదా? అనరు.అనరు గాక అనరు.

