ఎఫ్‌ఎంపిపి ‘నమో’.. ప్రభుచావ్లా– కొత్త పేరు ‘డిమో’ ..స్వప్నదాస్ గుప్తా ….. లెక్క తప్పితే ‘ఢమో’?
దేవుళ్లనూ వాళ్ల పేర్లనూ రాజకీయాల కోసం వాడుకోవడంలో బిజెపి ఆరెస్సెస్‌లది పెట్టింది పేరు. 1990వ దశకంలో అయోధ్య రాముడే వారి ఎన్నికల చిహ్నంగా మారాడు. ఇప్పుడు యుపి ఎన్నికల్లో దానికేం పెద్ద ప్రాధాన్యత లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక ఆయననే అపర శివుడైనట్టు నమో నమో అన్నారు. సాక్షాత్తూ వారణాసి నుంచి పోటీ పెట్టించారు. నమ:శ్శివాయ అని పాడుతుంటే వారిలోనే కొందరు భరించలేక పోయారు గాని మన వెంకయ్య నాయుడు మాత్రం దైవదూత అనీ అసలు దేవుడేనని కీర్తనలు పాడుతుంటారు. ఆయితే ఇప్పుడు మరో కాషాయ పాత్రికేయుడు నమోను కాస్త డిమోను చేశారు.డీ మానిటైజేషన్‌లోని అక్షరాలతో డిమో అంటూ స్వప్నదాస్ గుప్తా వ్యాసం రాశారు.
మరో పత్రికా ప్రముఖుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రభుచావ్లా అయితే మోడీ విధానాల మంచిచెడ్డల కంటే నాటకీయ ప్రచారం ప్రధానంగా చూసుకుంటారని తేల్చేశారు. ఎందుకంటే ఎఫ్‌ఎంసిజిలాగా మోడీ ఒక ఎప్‌ఎంపిపి అని చావ్లా నామకరణం చేశారు. అంటే ఫాస్ట్ మువింగ్ పొలిటికల్ ప్రాడక్ట్ అట. ఆ స్పీడు కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేస్తూనే వుండాలట. అవి ఇతరులకు అంతుపట్టకూడదు. అంచనాలకు అందకూడదు. గత శతాబ్దిలో రెండోసారి దేశమంతా మోడీ గురించి మాట్లాడుకుంటుంది గనక ఆయన లక్ష్యం నెరవేరినట్టేనట. అయితే అనుభవజ్ఞుడైన చావ్లా చివరలో ఒక సలహా కూడా ఇచ్చారు. ప్రజలతో సంబంధం లేని సలహాదారుల బృందానికి పరిమితమం కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.లేకపోతే ఢమో అనే పరిస్థితి రావచ్చని ఆయన కవి హృదయం. పారాహుషార్.