విప్లవ ధృవతార కాస్ట్రో
విశ్వ విప్లవ సంకేతమా
స్వాతంత్ర సమర పతాకమా
చెక్కు చెదరని ఉక్కు సంకల్పమా
మొక్కవోని సిద్ధాంత పటిమా
సాహసికుడా
దార్శనికుడా
ఎదురొడ్డిన వాడా
పోరాడిన వాడా
కుట్రలు కూల్చినవాడా
మృత్యువునే తరిమినవాడా
ఆటుపోట్లు చూసినవాడా
అజేయమై నిలిచిన వాడా
దేశం నిర్మించిన వాడా
ధరిత్రి ప్రసరించిన వాడా
చే గువేరా చెలికాడా
గుండెలున్న మొనగాడా
కాస్ట్రో నీ ప్రస్థానం
చెరిగిపోని అధ్యాయం
చరిత్రకో నవభాష్యం
కరిగిపోని ఉత్తేజం
క్యూబా విప్లవ నేత, దేశ నిర్మాత ఫిడెల్ కాస్ట్రో మరణవార్త ప్రపంచ ప్రజానీకాన్ని స్వాతంత్ర సామ్యవాద భావుకులను విచారంలో ముంచుతుంది. సమకాలీన ప్రపంచంలోనే సమున్నత నాయకుడు సాటిలేని పాలకుడు పోరాట యోధుడు, ఆరితేరిన అనుభవజ్ఞుడు కాస్ట్రో.కాస్ట్రోను తల్చుకుంటే వెంటనే గుర్తుకు వచ్చే చే గువేరా ే తన ఆఖరి లేఖలో ఆయన నాయకత్వ పటిమను గొప్పగా అభినందించాడు.
ఆయన ఆలివ్ గ్రీన్ యూనిఫాం, సిగార్, అమెరికా సామ్రాజ్యవాదంపై నిప్పులు చెరిగే ప్రసంగాలూ, ఆత్మగౌరవం తొణకిసలాడే ప్రకటనలూ ఒక వరవడిగా మారాయి. వయసుపైబడి ఆనారోగ్యంతో ఐచ్చికంగా పదవీ విరమణ చేసిన కాస్ట్రో చివరి వరకూ సజీవంగా చురుగ్గా పనిచేస్తూ భావాలు వెల్లడిస్తూ వచ్చారు. ఐసెన్‌హౌవర్ నుంచి ఒబామా, ట్రంప్ విజయం వరకూ అమెరికా అద్యక్షులెందరినో ఎదుర్కొన్న కాస్ట్రో నాయకత్వంలో క్యూబా ఆ సామ్రాజ్యవాద శక్తికి అతిసమీపంలో అరుణారుణంగానే నిలబడింది. అలీనోద్యమంలో మనతో పాటు అగ్రస్థానం వహించిన ఆ దేశం మన పాలకులు అమెరికాకు లోబడినా తను మాత్రం తలవంచడానికి నిరాకరించింది. ఉత్తరోత్తరా వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌తో సహా లాటిన్ అమెరికాలోనూ ప్రగతిశీల ప్రత్యామ్నాయానికి అండనిచ్చింది. ఇటీవలనే క్యూబా కమ్యూనిస్టుపార్టీ మహాసభకు ఆఖరి సారి హాజరైన కాస్ట్రో తాను త్వరలోనే రాలిపోవచ్చని కాని కమ్యూనిజం ఆశయాలు మాత్రం ఉజ్వలంగా ప్రకాశిస్తుంటాయని చెప్పారు( దానిపై పోస్టు అంతర్జాతీయం లో 2016 ఏప్రిల్‌లో)
ఇప్పుడు నిజంగానే మనకు దూరమైనా చెరిగిపోని ఉత్తేజమై ప్రవహిస్తూనే వుంటాడు.
(కాస్ట్రో నాయకత్వంలో క్యూబా విప్లవ ప్రస్థానం మరోసారి చెప్పుకుందాం)