నల్లడబ్బు అంతం కల్ల- చిన్న వ్యాపారాలే గుల్ల
నోట్లరద్దుతో నల్ల డబ్బును అంతం చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేసుకుంటుంటే మేధావులు మీడియా వ్యాఖ్యాతల్లోనూ ఒక భాగం అదేపనిగా వంత పాడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రాణాలు కోల్పోయిన వందమంది గురించి గాని నిష్కారణంగా బాధలపాలైన కోట్లాది మంది భారతీయుల గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. చిన్న చిన్న సమస్యలుగా వాటిని తోసిపారేస్తూ క్యూలో నిలబడ్డం దేశభక్తికి నిదర్శనమంటున్నారు.ఇంకా చెప్పాలంటే సరిహద్దుల్లో పోరాడే సైనికులతో పోటీ పెట్టి మాట్లాడుతున్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ మోడీని పొగిడే ఆదుర్డాలో ఈ అభాగ్య మృతుల గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదు.
ఇంతకూ ఈ చర్యతో నిజంగా నల్లడబ్బు అదుపు అవుతుందా? ఈ ప్రశ్నకు ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ మరోసారి చాలా సులభమైన వివరణ ఇచ్చారు.ఈ చర్యను గట్టిగా బలపర్చేవారు కూడా(రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుతో సహా) 3.5 లక్షల వరకూ నల్లడబ్బును అదుపు చేయవచ్చని చెబుతున్నారు. కాని ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారమే భారత దేశంలో నల్లడబ్బు కనీసం35 లక్షలు వుంటుంది. (విదేశీ బ్యాంకుల్లో వున్నది వదిలేద్దాం) దీనిపైన ఇంతే లాభం వచ్చిందనుకుందాం. అప్పుడు యాభై రెండు కోట్లు దాటుతుంది. మరి వీరంతా చెప్పే మూడున్నర లక్షల కోట్ల అదుపు ఏ మూలకు? ఏం ప్రభావం చూపిస్తుంది? ఇంతకుముందు చెప్పుకున్న అక్రమ లాభాల్లో 20శాతానికి కూడా సమానం కాదు. పోనీ బాగా కట్టుదిట్టాలు చేశారనుకున్నా 25 శాతం దాటదు. మరి ఆ మాత్రానికి ఇంత హడావుడి అవసరమా? పైగా ఇందుకోసం కోట్లమంది సామాన్యులను పేదలను బాధపెట్టడం, చిన్న వ్యాపారాలను వ్యవసాయాన్ని దెబ్బతీయడం సరైందేనా?
ఇంతకంటే ముఖ్యమైన పాయింటు ఏమంటే నల్లడబ్బు నదిలా ప్రవహించేదే గాని కొండలా వుండిపోదు. పన్ను కట్టినా కట్టకపోయినా వ్యాపార సమాజంలో డబ్బు అధికలాభాల కోసం పరుగుతీస్తుంటుంది. అవి అక్రమమా సక్రమమా అనేది అనవసరం. ఇప్పుడు ప్రభుత్వం వేసే యభై శాతం పన్ను కంటే దానిపై వచ్చే లాభాలే అధికమనుకుంటే నిస్సంకోచంగా ఆ పనే చేస్తుంది.అంతెందుకు?మందుల తయారీ రంగంలో వేల శాతం లాభాలు వస్తాయి. వారికి ఈ పన్ను లెక్కలోకి వస్తుందా? ఇక మాదకద్రవ్యాల వంటివి ఎందుకు సరఫరా అవుతుంటాయి? లాభాల పంట పండుతుందనే కదా? కాబట్టి అలవిమీరిన లాభాలు కలిగించే వ్యవస్థ వున్నంత వరకూ దానికి ఏదో రూపంలో నిధులు అందుతాయి. లేదా కొత్తగా ఇచ్చేవారు బయిలుదేరతారు. జరగాల్సింది ఆ రంగాలను అడ్డుకోవడం. అదెలాగూ జరగదు. అమెరికాలోనే ఇప్పటికీ మాదక ద్రవ్యాల మాఫియా సవాలుగా వుంది. వారికి పెట్టుబడుల లోటు లేదు. కాబట్టి మన దేశంలోనూ కొత్త కొత్త పద్ధతుల్లో అక్రమలాభాల వేట సాగుతుంది.
వారికి నిధులు అందకుండా చేసేందుకు రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్టు పెంచితే అప్పుడు అందరికీ నష్టమే. పైగా ఆ క్రమంలో చిన్న వ్యాపారులకు పరపతి తగ్గి ఈ లాభార్జనాపరులకే పెరుగుతుంది. అప్పుడు వారు గాక వీరు దెబ్బతింటారు. బ్యాంకుల బయిట భారీ వడ్డీలకు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. అలాగాక నగదు సరఫరా తగ్గిస్తే అప్పుడు కూడా తక్కువ లాభాలు వచ్చే అంసఘటిత రంగమే చితికి పోతుంది. ఎందుకంటే ఒక్కుమ్మడిగా లాభం వచ్చిపడే అక్రమ వ్యాపారాలు వారెలాగూ ఆపరు. ఏదో విధంగా నిధులు సమకూర్చుకుంటారు.
ఇవన్నీ గాక నిజంగా నల్లడబ్బుకు ఆస్కారమే లేకుండా చేసినా-రిలయన్స్కో లేక టాటాలకో ్ల చూపని వేలకోట్లు అదనపు లాభాలు వస్తూనే వుంటాయి. టెలికాంలోనూ , సహజవాయు తవ్వకంలోనూ ఆ విధంగా జరిగింది. నిరంతరం కొత్త పథకాలతో విదేశాలకు కొత్త వ్యాపారాలకు తరలిపోతూనే వుంటాయి. వాటిని కాగ్ నివేదికలో లేక మరేదైనా సంస్థలో తవ్వితీసినా వారు కోర్టులకు వెళ్లి ఏళ్లు గడిపేస్తారు. ఈ లోగా వారి సంపద పెరిగిపోతుంటుంది. ప్రభుత్వమే ఏదో స్వచ్చంద పథకం లేదా ప్రశ్నలు వేయని పెట్టుబడుల పథకం ప్రకటిస్తుంది. ఖతమ్.
ఎటొచ్చి అప్పులు పుట్టక నగదు ఆడక చిన్న చితక వ్యాపారాలు వ్యవసాయం అనుబంధ రంగాలు గుల్ల అవుతాయి. సామాన్యులు గిజగిజలాడిపోతారు.ఈ రెండూ మనం కళ్లముందు చూస్తున్నాం.
ఈ ప్రభావం బ్యాంకులనూ దెబ్బతీస్తుంది. ఎలాగో మరోసారి చూద్దాం.