కెసిఆర్‌ సీట్లో జియ్యర్‌- బిజెపితో సహా విమర్శలు

నిన్న తన నూతన అధికార నివాసంలో ప్రవేశించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చినజీయర్‌ స్వామిని తన సీట్లో కూచోబెట్టడం సరికాదని బిజెపి ఎంఎల్‌సి ఎన్‌.రామచంద్రరావు విమర్శించారు. అయితే తెలివిగా తన విమర్శను రాజకీయంగా కెసిఆర్‌పైకి మరల్చారు. తన సీట్లో కూచోమని కోరడం ద్వారా ముఖ్యమంత్రి అందరి గౌరవం పొందిన స్వామిని ఇరకాటంలో పెట్టారు. ఆ స్థానం ఎన్నికైన ముఖ్యమంత్రికి మాత్రమే ఉద్దేశించింది. కాని ఆయనను కూచోబెట్టడం ద్వారా లేనిపోని వివాదాల్లోకి లాగారు అని బిజెపి నేత వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సత్యప్రసాద్‌ కూడా ఈ చర్యను తప్పుపట్టారు.రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అధికార స్థానంలో మరెవరూ కూచోకూడదు అన్నారు.
చాలా పత్రికలు ఈ విషయాన్ని దాటేశాయి. ఆఖరుకు నమస్తే తెలంగాణ కూడా జియర్‌ కూచున్న ఫోటో ప్రచురించలేదు. కాని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అదే పతాకశీర్షిక నిచ్చి ఫోటోతో సహా ఇచ్చింది.కాస్సేపు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టనిపించిందని ఫోటో క్యాప్షన్‌ ఇచ్చింది. కెసిఆర్‌ ముఖ్యమంత్రి స్థానంలోకి రావడానికి 13 ఏళ్లు పడితే స్వామిజీ కొద్ది నిముషాల్లోనే అక్కడ కూచోగలిగారంటూ నెటిజన్తు చేసిన వ్యాఖ్యలను కూడా పొందుపర్చింది.
మరోవైపు స్వామీజీ భక్తులు కూడా తక్కువ తినలేదు. తన దైవభక్తిని చాటుకోవడానికి కెసిఆర్‌ సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి అవతారమైన జియర్‌ స్వామిని కూచోబెట్టడం తప్పేమీ కాదని ఎస్‌.సత్యం రెడ్డి అనే లాయర్‌ సమర్థించారు.
అయితే శాసనసభలో వలె లేదా ఒక కార్యాలయంలో వలె గాక ఇది మామూలు స్థానమేనని రాజ్యాంగానికి దీనికి సంబంధం లేదని వాదించే అవకాశముంది. ఏది ఏమైనా బిజెపి కూడా జీర్ణించుకోలేని వివాదాదస్పద వైఖరిని చాందసాన్ని కెసిఆర్‌ వదులుకోవడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *