అమరావతా?భ్రమరావతా? -ప్రపంచ బ్యాంకుకూ డౌట్
ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి చుట్టూ అల్లిన వూహల పందిరిపై ప్రపంచ బ్యాంకుకూ సందేహం వచ్చింది. 4000 కోట్ల అప్పు కోరుతున్న క్రిడా అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ అప్పు తీర్చే శక్తి వుందా అంటూ ఆలోచనలో పడింది. మెకెన్సీ కంపెనీ ఇచ్చిన నివేదికలు సంతృప్తి కలిగించక బ్యాంకు బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ప్రభుత్వ భవన సముదాయం నిర్మించడానికి ఎంత సమయం పడుతుంది, కేంద్రం నుంచి ఎంత వస్తుంది, దీనివల్ల జనాభా, ఆదాయం ఏ మేరకు పెరుగుతాయి వంటి విషయాలపై మరింత స్పష్టత కావాలని బ్యాంకు భావిస్తున్నది. అంతేగాక కొండవీటి వాగు ముంపు నివారణ పథకాలపైన, పర్యావరణ పరిరక్షణ నమూనాలపైన కూడా సందేహాలు వచ్చాయి. నిజానికి రాజధాని నిర్మాణంపై సింగపూర్ ఉచితంగా డిజైన్లు ఇచ్చిందని చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వం 11 కోట్లు ఈ కంపెనీలకు ఇచ్చింది. ఇప్పుడు వాటిని రూపొందించిన మాకీ అసోసియేట్స్‌ను పక్కనపెట్టి స్వంతంగానే డిజైన్లు తయారు చేయిస్తున్నది. ఇందులో అన్నీ అరకొరగా అస్పష్టంగా వున్నాయి.ఎవరిని భాగస్వామిని చేసుకోవాలో తేల్చలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బుతోనూ ఇతరత్రా సమీకరణలతోనూ దశలవారీగా నిర్మించుకునే బదులు అంతర్జాతీయ ప్రమాణాలంటూ వాణిజ్య బాణీలు మిళితం చేయడంతో మొత్తంగానే పని నత్త నడకలో పడిందని, నమ్మకం తగ్గిందని పాలక పక్ష నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎప్,ఎల్ఐసి వంటివి ఇప్పటికే రుణాల మంజూరుకు నిరాకరించాయి. హడ్కోతో మాత్రం చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 58 వేల కోట్ల మేరకు రుణాలు సేకరించేందుకు మార్గాలు అన్వేషించాలని ఆదేశించారు గాని అవకాశాలు పరిమితంగానే వున్నాయి. కేంద్ర బిజెపి కూడా ఇచ్చిన వాటికి లెక్కలు అడగడంపైనే కేంద్రీకరిస్తున్నది. సింగపూర్‌పై చంద్రబాబు ఆశలు ఫలించేట్టు లేవని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పైగా ఆ దశ బహుశా ఈ పదవీ కాలంలో మొదలు కాకపోవచ్చు.
పదవీ కాలం సగం దాటిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వున్న అమరావతి నిర్మాణానికి వూపు తెప్పించినట్టు కనిపించాలని ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలలో మునిగితేలుతున్నారు. కాని పూర్తిస్థాయి ప్రణాళికే లేకుండా చేసేది కనిపించడం లేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు కూడా వేయలేదు. కేవలం మూడు గ్రామాల్లో మాత్రమే అది కూడా అంతర్గత దారుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.సీడ్ యాక్సెస్ రోడ్ భూమి చదును దశలోనే వుండిపోయింది. ఈ ఆలస్యం అస్పష్టత భూములిచ్చిన రైతులను కూడా కలవరపెడుతున్నాయి.ఈ లోగా నోట్లరద్దు నిర్ణయంతో భూముల రేట్లపై ఆశలు అడుగంటాయి. విజయవాడకు అనుసంధానం, కృష్ణానది నీటి సరఫరా, హైటెన్షన్ విద్యుత్ వైర్ల మార్పు వంటివి కూడా ముందుకు సాగలేదు. ఎన్టిఆర్ జలసిరి ద్వారా నీటిఎద్దడి లేకుండా చేస్తామన్న హామీ కూడా అమలుకు నోచలేదు. ఉపాధి పోయిన యువతకు నెలకు రు.2500చెల్లింపు సక్రమంగా జరగడం లేదు. వీరికి సహాయంగా వుంటాయన్న అన్నక్యాంటిన్లు సచివాలయం మినహా మరెక్కడా ఏర్పడలేదు.