దేశంలోనే అతిపెద్దదిగా తెలంగాణ సిఎం అధికార నివాసం?
కెసిఆర్ తాజాగా గృహప్రవేశం చేసిన నూతన అధికార నివాసం దేశంలోని ముఖ్యమంత్రులందరి భవనాల కన్నా పెద్దదంటున్నారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది. పుష్కరకాలం కిందట చాలా విమర్శల మధ్యన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బేగంపేటలో 2004లో 8 కోట్లకు పైగా ఖర్చుతో నూతన క్యాంపు కార్యాలయం కట్టించారు. నిజానికి రాష్ట్ర చరిత్రలో చాలా కొద్దిమంది మాత్రమే ఆయనంత అధికారం చలాయించారు. ఆ రోజుల్లో వారం వారం ఆయన పాల్గొనే టీవీ చర్చ కోసం నేను వెళ్తుండేవాణ్ని. చాలాసేపు మాట్లాడేవాళ్లం. ఆయనదో అధికార వైభవమే. ఒక పూర్తిపదవీ కాలం వున్న ఏకైక ముఖ్యమంత్రిని నేనేనని ఆయన అంటుండే వారు.(చంద్రబాబు తొమ్మిదేళ్ల లెక్క ఆయన అంగీకరించరు) రండోసారి ఎన్నికల ప్రచారం కూడా అక్కడే మొదలు పెట్టి మరోసారి గెలిచారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ అక్కడ మరికొంత కాలం కొనసాగారు. చివరకు ఖాళీ చేయించి రోశయ్య ఆలస్యంగా అయిష్టంగా ప్రవేశించారు. తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చారు. ఆయననూ చాలా సార్లు కలిసేవాళ్లం. తెలంగాణ ఉద్యమంపై పొత్తూరి వెంకటేశ్వరరావు గారూ, నేనూ ఒకసారి జరిపిన చర్చ ఇప్పటికీ గుర్తుంది.ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి అంత కల్లోలంలోనూ పదవీ కాలం దాదాపు పూర్తి చేసుకునిఅధిష్టానం వద్దంటున్నా వినకుండా తనుగా రాజీనామా చేసి అధికార నివాసం ఖాళీ చేశారు. ఇందులో సచివాలయం విషయంలో నేను రాసినట్టే క్యాంపు ఆపీసులో వీరిద్దరికి ప్రవేశం పాలనావకాశం గొప్ప సూచనలే గాని అపశకునాలు కావు. అసలు రాజ్యాంగం ప్రకారం రాజకీయ బలాలతో నడిచే పా
లన గనక వాస్తు కన్నా వస్తువే ప్రధానమవుతుంటుంది. ఒకసారి మన్మోహన్ సింగ్ అణుఒప్పందం ఓటింగు సమయంలో టీవీ 9చర్చలో నేను నాతో వున్న జ్యోతిష్యులను అడిగాను ఒక ముహూర్తం మంచిదైతే అందరికీ మంచిదేనా అని.నిస్సందేహంగా అని వారు చెప్పారు. అలాగైతే ప్రతిపక్షాలకూ విజయం కలగొచ్చు కదా అంటే కాస్సేపు తబ్బిబ్బయ్యారు. చివరకు ఒకరు కోలుకుని తీర్మానం పెట్టింది మన్మోహన్ గనక ఆయనకే విజయం అని సవరించారు.
ఏమైనా కెసిఆర్‌కు నమ్మకాలు జాస్తి కావచ్చు గాని క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి మరొకటి కట్టించాల్సినంత కీడేమీ అక్కడ వుండదు. వుంటే ఆయన చేసిన మొదటి పూజలతో పోయి వుండాలి. కాని నమ్మకం చాలక నివాసానికే పరిమితమై ఇప్పుడు సువిశాల చంద్రకాంత సౌధంలోకి ప్రవేశించారు.పది ఎకరాల విస్తీర్థనంలో 42 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ ప్రభుత్వ ప్రాసాదంలో సదుపాయాలను రక్షణ వ్యవస్థలను కథలుగాచెబుతున్నారు. సహజంగా ఇంత ఖర్చు అవసరమా అని ప్రతిపక్షాలూ విమర్శిస్తున్నాయి. హిందూస్తాన్‌టైమ్స్‌లో లలితాఫణిక్కర్ అయితే ప్రజల నుంచి దూరమై పోతున్నారని కూడా విమర్శించారు. నిస్సందేహంగా అలాటి విమర్శలకు చాలా అవకాశం వుంది. అమరావతిలోనూ హైదరాబాదులోనూ కూడా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాలు కార్యాలయాల ఖర్చుపైనా విమర్శలున్నాయి. మాణిక్‌సర్కార్, కనీసం నవీన్‌పట్నాయక్ వంటివారితోనైనా ప్రజలు పోల్చకుండా వుండరు. ప్రజానాయకులుగా వచ్చిన అధినేతలు తమ చుట్టూ అధికార దుర్గాలు కట్టుకుని ఆత్మీయులనుకున్న వారికి కూడా అత్యంత విశ్వాసపాత్రులకు కూడా అందుబాటులో లేకుండా పోతే ఎలా అన్నది ప్రశ్న. ఖర్చులూ కసరత్తులూ ఎలా వున్నా కనీసం అదైనా జరగరాదని ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారని ఆశిద్దాం.