ఉపశమనం అడిగితే ఉన్నది తగ్గించారు
నోట్లరద్దు బాధల నుంచి ఉపశమనం కలిగించాలని అందరూ కోరుతుంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన వెసులుబాటునే ఎత్తివేసింది. పాత నోట్ల మార్పిడికి డిసెంబరు 30 వరకూ గడువు వుంటుందని సాక్షాత్తూ ప్రధాని మోడీనే ప్రకటించారు. కాని ఇప్పుడు ఆ గడువును ఉన్నఫలానా రద్దు చేశారు. పాత 500.1000 నోట్ల మార్పిడి తగ్గిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెల్పింది. అయితే పాత 500 నోట్లతో మాత్రం విద్యార్థులు ఫీజులు మరికొన్ని చెల్లింపులకు డిసెంబర్ 15 వరకూ అవకాశం కొనసాగుతుంది. ఇక మిగిలిన పాత నోట్లను ఎవరైనా సరే బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవలసిందే. ఈ విధానం వల్ల ఇది వరకూ ఖాతాలు లేని వారు కూడా కొత్తగా ప్రారంభించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నదట.
ఈ రోజు జరిగిన క్యాబినెట్ అత్యవసర సమావేశం అధికంగా డిపాజిట్ చేసేవారిని జరిమానాతో అనుమతించే విషయం పరిశీలించినట్టు సమాచారం. పాత నోట్లను కొందరు నాశనం చేస్తున్న ఘటనల రీత్యా నిర్ణీత జరిమానా కడితే ఆమోదించవచ్చనే ఆలోచన నడుస్తున్నది. అంటే ఇది మరో విధంగా అధిక ధనానికి ఆమోద ముద్రవేసే మరో స్వచ్చంద వెల్లడి పథకం అవుతుంది. మరి మామూలు ప్రజలకు మార్పిడి అవకాశం రద్దు చేసిన ప్రభుత్వం బడా బాబులకు కొత్తగా తలుపులు తెరవాలని ఆలోచించడం విశేషం.బహుశా దీనిపై రేపు ప్రకటన రావచ్చు. ఇది ఇలా వుంటే దీనిపై ప్రధాని మాట్లాడాలనే ప్రతిపక్షాల ఆందోళనకు స్పందిస్తారా లేదా చూడాల్సి వుంటుంది. జిఎస్‌టి బిల్లు చర్చలోనూ ఆయన లోక్‌సభలో ధన్యవాదాలు చెప్పడం తప్ప రాజ్యసభలో మాట్లాడలేదు. బహుశా ఇప్పుడు కూడా అంతేచేస్తారని పాలకపక్షీయులు అంటున్నారు.