మోడీకి సహారానుంచి 52 కోట్లు పత్రాలపై గప్‌చిప్: ఇపిడబ్ల్యుఎడిటర్ సవివర కథనం


ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా సహారా గ్రూపునుంచి 55 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనే పత్రాలు మీడియాలో రాకుండా అందరూ గప్‌చిప్‌గా వుండిపోతున్నారా? మేధాపరమైన ప్రతిష్టాత్మక పత్రిక ఎనకామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకుడు పరంజయ గుహ ఠాగూర్( అద్వైతరావుతో కలసి) కలసి రాసిన ఒక కథనం ఆదాయపన్ను శాఖ పత్రాలతో సహా నెట్‌లో అందుబాటులో వుంది. అంతేగాక అవి కోర్టులోనూ అందుబాటులో వున్నాయి. అయినా సంచలనం కలిగించవలసిన ఈ పత్రాల గురించి ఎలాటి చర్చ జరగడం లేదని పరంజపే ఒక సమగ్ర కథనం ప్రచురించారు.2013 అక్టోబరు 30 – నవంబరు 29 మధ్య నెలరోజులలో జరిగిన 13 లావాదేవీలలో ఈ సొమ్ము ముట్టినట్టు కనిపిస్తున్నదని ఆయన రాశారు. అయితే నాలుగు లావాదేవీల విషయంలో రిపిటీషన్ వున్నందువల్ల వీటన్నిటినీ కలిపి చూడవలసి వుంటుందా అనే స్పష్టత రావలసి వుందనికూడా రాశారు. ఆ కాలంలో సుబ్రతా రారు ఆధ్వర్యంలోని సహారా ఇండియా గ్రూపు నుంచి ఈ మొత్తం ముట్టినట్టు ఆ సంస్థ కార్యాలయంలో జరిపిన సోదాలలో దొరికిన ఐటి పత్రాలు చెబుతున్నాయి. మోడీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజీ సింగ్ చౌహాన్, చత్తీస్‌గర్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, బిజెపి కోశాధికారి ఎన్‌ఎల్‌సిన్హా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌లు కూడా నిధులు అందుకున్నట్టు ఈ పత్రాలు చెబుతున్నాయి. దీనిపై పరంజపే సంబంధిత నేతలనూ వారి కార్యాలయాలను సంప్రదించినా సమాధానం రాలేదని పేర్కొన్నారు.వస్తే వాటిని కూడా ప్రచురిస్తామని తెలిపారు.
ఆ దాడుల సమయంలో రెవెన్యూ తదితర విభాగాలలో అధికారిగా వున్న కొసరాజు వీరయ్యచౌదరిని సివిసిగా నియమించడం సరికాదంటూ తాము కామన్‌కాజ్ సంస్థ తరపున దాఖలు చేసిన పిటిషన్ పత్రాలలోనూ ఇవన్నీ జతచేశామని ఆయన తెలిపారు.
2016 జులై 28న బిజెపి బహిష్క్రుత ఎంపి రామ్ జెఠ్మలానీ నోట పరంజపే ఈ పత్రాల గురించి మొదటిసారి విన్నారట. కాని ఆయన వాటిని అందజేయలేదు. తర్వాత ఒక కవరులో గుర్తుతెలియని వ్యక్తి ఎవరో వాటిని ఆయనకు చేర్చారు. తర్వాత చూస్తే ఢిల్లీలో తనకు పరిచయం వున్న దాదాపు పాతికమందికి పైగా ప్రముఖులకు మీడియా వారికి వీటి గురించి తెలుసని అయినా బయిటకురావడం లేదని పరంజపే అర్థం చేసుకున్నారు. కారవాన్ పత్రికలోనూ సబ్‌రంగ్‌లోనూ కూడా ఇప్పుడు ఈ పత్రాలు ప్రచురించారు.
వీటి సత్యాసత్యాలు తెలుసుకోవడానికి పరంజపే అప్పటి ఐటి ఇన్వెస్టిగేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ అంకిత్ పాండేను సంప్రదించగా తాను సెలవులో వున్నానని ఈ విషయమై మాట్లాడ్డానికి అధికారం లేదని జవాబిచ్చారు. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని న్యాయమూర్తులు ఎబిషా, అర్జిత్‌పశ్యాత్‌లకు కెవిచౌదరికి కూడా లేఖలు రాసినా ఫలితం లేదని పరంజపే తెలిపారు.
ఈ పత్రాలలో మోడీని గుజరాత్ సిఎం అనీ, అహ్మదాబాద్ మోడీజీ అని రకరకాలుగా సంబోధించారు. వివిధ తేదీలలో వున్న పద్దుల ప్రకారం మొత్తం 52 కోట్ల మేరకు ఆందించినట్టు నమోదైవుంది.ఇక బిజెపి కోశాధికారి సిన్హాకు 5 కోట్లు ఇస్తూ ఏ విషయంలో సహాయం కోరింది కూడా ఎంట్రీలో వుంది.శివాజీ సింగ్ చౌహాన్‌కు 10 కోట్లు ఇచ్చినట్టు రాశారు. ఇదంతా కూడా హవాలా డైరీలను గుర్తుచేస్తున్నదని పరంజపే రాశారు. ఆ సమయంలో సుప్రీం కోర్టు సాంకేతికంగా కేసు కొట్టివేస్తూనే ఇలాటి వాటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించిన సంగతి ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా వీటిపై విచారణ చేస్తారా అని ప్రశ్నిస్తూ కథనం సశేషంగా ముగించారు.
ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శాసనసభ సాక్షిగా మోడీకి ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి 25 కోట్లు ముట్టినట్టు ఐటి పత్రాల ఆధారంగా చేసిన ఆరోపణకు కూడా మీడియాలో ఎక్కడా పతాకశీర్షిక రాకపోవడం ఆసక్తికరం. హిందూలో మాత్రం ఆ కథనం మొదటిపేజీలో ఇచ్చినా మోడీ తదితరుల పేర్లు ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలపై ఆరోపణలు వచ్చినప్పుడు నానాహడావుడి చేసిన బడా మీడియా ఇప్పుడెందుకు వీటిపై కనీస చర్చ చేయడం లేదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలకు అతీతంగా వున్నట్టు చెప్పుకుంటున్న మోడీ అయినా స్వయంగా విచారణకు ఆదేశించవచ్చు కదా అని కొందరంటున్నారు.
పరంజజే ఇంకా ఏమి రాస్తారో చూడాలి. ఏమైనా సరే మోడియాగా మారిన బడా మీడియా మాత్రం గప్‌చిప్‌గానే వుంటుంది మరి!