ఒక సమస్య ఇంతకాలమా? చంద్రబాబు….. మరో నలభై రోజులు కావల్సిందే- మోడీ

నోట్లరద్దు పాట్లపై పాలక కూటమి ప్రధాన భాగస్వాములు తలో రకంగా మాట్లాడ్డం ఒకింత ఆసక్తికలిగిస్తున్నది. తన రాజకీయ జీవితంలో ఒక సమస్య ఇన్నిరోజులు కొనసాగడం చూడలేదని ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. దీనికి కొన్ని ఉపశమనచర్యలు అధికారులకు సూచించారు. మొదట ఈ చర్యను మరీ ఎక్కువగా స్వాగతించామనే ఆలోచనలో పడిన చంద్రబాబు నెమ్మదిగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రానికి లేఖలు కూడా రాస్తున్నారు. ఆ మాటకొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా మోడీని సమర్థించడానికి అంత హడావుడి పడివుండకూడదనే మాట ఆయన సన్నిహిత శిబిరంలోని ప్రముఖులొకరు నాతో అన్నారు. బిజెపి నేతలు కూడా గతంలో వలె అతిగా సమర్థించకుండా సమస్యలు దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి చర్చలో మాట్లాడిన ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్‌, తెలంగాణ బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్‌లు కూడా ఆ తరVలోనే సరిపెట్టారు. వారితో పోలిస్తే ఎపి ప్రణాళికాసంఘం ఉపాద్యక్షుడు సిహెచ్‌కుటుంబరావు సమర్థనే ఎక్కువగా అనిపించింది. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్‌రెడ్డి, తెలుగుదేశం ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి కూడా ప్రజల బాధలపైనే ఎక్కువగా కేంద్రీకరించారు.
కింది స్థాయిలో పరిస్థితి ఇలా వుంటే పైన ప్రధాని మోడీ మాత్రం నలభై రోజులు ఇదే పరిస్థితి అనివార్యమంటున్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో నేను ముందే యాభైరోజులు అడిగానంటూ ఆయన ఇది పెద్ద దేశం గనక చాలా సమయం పడుతుందని సూటిగానే చెప్పేశారు. కాకపోతే గతంలో వలె సామాన్యులు సంతోషిస్తున్నారని అనకుండా కొద్దిపాటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ముక్తాయించారు. ఇప్పటికి ఆయన మాటల్లో సమస్య తీవ్రత గాని త్వరగా పరిష్కరించే సూచనలు గాని బొత్తిగా లేవు.
తమ పార్టీ వారే చేస్తున్న ఆరోపణలు విమర్శలు, పట్టుపడిన నగదు ఉదంతాలు వంటివి పక్కనపెట్టి యుపి ఎన్నికల ప్రచారంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎంఎల్‌ఎ టికెట్టకోసం దబ్బులు తీసుకుంటారు గనక అలాటివారికి సమస్య అంటూ బిఎస్‌పి నాయకురాలు మాయావతిపై అస్త్రాలు సంధించారు.ఇక బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి చిట్‌ఫండ్‌అవినీతితో లక్షల మందిని ముంచిన వారు మాట్లాడుతున్నారని అపహాస్యం చేశారు.బాగానే వుంది గాని ఆమెతోచాలా కాలం చెలిమి చేసింది, ఇప్పటికి దర్యాప్తు వేగంగా జరపకుండా బేరాలు నడుపుతున్నది ఎవరనేది ప్రశ్న.
ఇంత పెద్ద చర్య తీసుకునేముందు సన్నాహాలు చేయడంలో తన ప్రభుత్వం పాలక బృందం వైఫల్యాన్ని ప్రధాని అంగీకరించకపోగా ఇతరులపై దాడి చేయడం దారుణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *