సానుకూల సిఎంల శిబిరంలో కెసిఆర్?
నోట్లరద్దుపై ప్రధాని మోడీ ఆహ్వానించి చర్చించిన మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ కావడం అందరూ గమనించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియారిటీతో పాటు ఎన్‌డిఎలో భాగస్వామిగా వున్నా- దీనిపై తానే ముందు లేఖ రాశానని చెప్పుకుంటున్నా ప్రధాని కెసిఆర్‌కు ప్రాధాన్యత నివ్వడం రాజకీయ వ్యూహం అనుకోవాలి. ఎటూ తమతో వున్న చంద్రబాబు కన్నా రేపు అవసరమైతే తనకు మద్దతు ఇవ్వగల టిఆర్‌ఎస్ అధినేతను దగ్గర చేసుకోవడం అవసరమని ఆయన ఆలోచన కావచ్చు. వచ్చే ఎన్నికల్లో గతసారి వచ్చినంత మెజార్టి రాకపోవచ్చనే అంచనా బిజెపిలో వుంది.కనుకనే కొత్త మిత్రులను కూడగట్టుకోవడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ వంటి బలమైన నూతన రాష్ట్ర ప్రాంతీయ పార్టీకి ప్రథమ తాంబూలం ఇచ్చారన్నమాట. నోట్లరద్దు దుష్ఫలితాలపై అందరికన్నా ముందు తన అసంతృప్తి వెలిబుచ్చిన కెసిఆర్ తర్వాత నెమ్మదిగా మెత్తబడుతూ వచ్చారు. పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకంచవద్దని ప్రజల బాధలు చెబితే చాలని తమ వారికి ఆదేశాలు పంపించారు. వామపక్షాలు, టిఎంసి ఆప్ వంటి పార్టీలూ వాటి వాటి పద్ధతుల్లో అవి నిరసనతెల్పుతున్నా వారితో కలవరాదని మాత్రం ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. కొత్తరాష్ట్రం గనక కేంద్రంతో మంచిగా వుండాలని పైకి చెబుతున్నా ఇద్దరికి అంతకన్నాలోతైన కారణాలే వున్నాయి. మోడీతో సమావేశం తర్వాత వచ్చిన కథనంలో రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటిపై మారుటోరియం ప్రకటించాలని మహిళల పొదుపు డబ్బును నల్లడబ్బుగా పరిగణించవద్దని ఆయన చెప్పారట. అలాగే 500 నోట్లు త్వరగా ముద్రించి పంపాలనికోరారు. మొత్తంపైన మొదట కెసిఆర్ పేరిట వచ్చిన వార్తాకథనాలలో నిశిత విమర్శనకు ఇప్పుడు సున్నితమైన నివేదనకు చాలా తేడా వుంది. ఈ విషయంలో బిజెపి వ్యూహం కృతకృత్యమైనట్టే భావించవచ్చు. సహకార బ్యాంకుల సమస్యలపై కెసిఆర్ ప్రత్యేకంగాప్రస్తావన చేసి వుండాల్సింది. ఎందుకంటే బాగానష్టపోయే వ్యవస్థల్లో అదొకటి. బహుశా తర్వాత ఇవన్నీ ఆయనే మీడియాకు చెబుతారేమో.
మరోవైపున మమతా బెనర్జీ తమ రాష్ట్రానికి అవసరమైన చిన్న నోట్లు సరఫరా చేయడం లేదని రాజస్థాన్‌కే పంపిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు ఉపసంహరణకు మూడురోజుల అల్టిమేటం ఇచ్చిన ఆమె తర్వాత ఏం చేస్తారోచూడాలి. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ముందే ఈ నిర్ణయాన్ని బలపర్చి వున్నారు. ఆయనను కూడా మోడీ అహ్వానిస్తారేమో చూడాలి. ఎందుకంటే మోడీని వ్యతిరేకించి బిజెపితో సంబంధాలు తెంచుకున్న నేపథ్యం ఆయనది. మిశ్రమ ప్రభుత్వంలో రెండో భాగస్వామి లాలూ యాదవ్ ఆర్జేడీకి బిజెపితో పొసగదు కూడా.