ఉల్లాసంగా… ఉత్సాహంగా.. పేదల పడిగాపులు
చూశారా? ప్రధాని నరేంద్ర మోడీ ఎంత ఖచ్చితంగా చెప్పారో! పేదలు సంతోషంగా వున్నారని. ఏమైనా సందేహం వుంటే సాక్షాత్తూ ఆయన వుండే ఢిల్లీ నగరంలోనే వివిధ చోట్ల తీవ్రమైన చలిలో వీరంతా ఎలా నిరీక్షిస్తున్నారో చూడండి! ఈ దేశంలో దాదాపు 90 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరగుతాయని అందులో అధికభాగం 500 ఆలోపు నోట్లతో వుంటాయని తెలిసికూడా కేంద్రం ఏకపక్షంగా 500.1000 నోట్లను రద్దు చేసింది. 100 నోట్ల ముద్రణలో సరఫరాలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా జీవితం స్తంభించిపోయింది. ఈ పరిస్థితి మరో యాభై రోజులు వుంటుందని ప్రధాని మోడీ అంటున్నారు గాని ఎలాటి పరిస్థితుల్లోనూ కొత్తనోట్లు రావడానికి మరో అరునెలలు పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ మోడీ మాటలను అనుసరించి రాష్ట్రాల నాయకులూ టీవీల్లో ఆ పార్టీ ప్రతినిధులు కూడా పేదలు సంతోషంగా వున్నారని ఎవరో కొందరు మేధావులు ప్రతిపక్షాలే రభసచేస్తున్నాయని తిట్టిపోస్తున్నారు. నిజం ఏమంటే అందరికంటే ఎ క్కువగా బాధపడుతున్నది ఆగ్రహావేదనలు వ్యక్తం చేస్తున్నది పేదలు అందులోనూ గ్రామీణులే. వారి దగ్గర వున్న కొద్దిపాటి నగదు అయిపోయింది. లేదా అక్కరకు రాకుండా పోయింది.పనులు ఆగిపోతున్నాయి. కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. నల్లడబ్బు స్వాములెవరైనా బయిటకు వచ్చారా అంటే వారు హాయిగా వున్నారు. వారి సొమ్ములు దాదాపు బ్యాంకు బినామీ ఖాతాల్లోనూ విదేశాల్లోనూ సురక్షితంగా వున్నాయి. నగదుపై ఆధారపడిన వ్యవసాయం చిన్న వ్యాపారాలు చితికిపోతున్నాయి గాని ఆన్‌లైన్ లో బడా వ్యాపారాలు లావాదేవీలు జరిగిపోతూనే వున్నాయి. ఇక విదేశాల్లోని అక్రమ నిల్వలకైతే అసలే గొడవా లేదు. ఏతా వాతా కష్టనష్టాల పాలవుతున్నది సామాన్యులే. పైగా కొన్ని మాసాల పాటు మామూలు వ్యాపారాలు దెబ్బతింటే దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థే నష్టపోతుంది. ఎందుకంటే ఈ చిన్న వ్యాపారాలు జిడిపిలో 45 శాతంవిలువ కలిగి వున్నాయి. 80 శాతం మంది వీటిలోనే పనిచేస్తూన్నారు. ఈ రంగం కుదేలై పోవడం దేశానికి మంచిది కాదు. దేశ జనాభాలో ఒకశాతం మందికి మాత్రమే ఎటిఎం కార్డులు వున్నాయి గనక అది కూడా వారికి చేసే మేలు వుండదు. ఏతావాతా నిందితులను వదలి బాధితులనే శిక్షించే ప్రోగ్రాం అనుకుంటే నోట్ల రద్దు నచ్చుతుంది.దాని వల్ల నల్లడబ్బు తగ్గనూ తగ్గదు.రానూ రాదు.


