మరింత ట్రైనింగ్‌ కావలెను

ఆ మధ్య జగన్‌,కెటిఆర్‌లతో తనను పోల్చి చూడవద్దంటూ నారా లోకేశ్‌ కొన్ని పాయింట్లు చెప్పారు. అందులో అధిక భాగం వయస్సులో తేడానే చెప్పాయి. కాని రాజకీయానుభవంలోనూ ఆయన వారి తర్వాతే వచ్చారని చెప్పాలి. అయినా అన్ని హంగులూ శిక్షణలూ తీసుకున్నారు గనక ఈ రోజుల్లో యూత్‌లాగా దూసుకుపోవచ్చు. కాని వివిధ కారణాల వల్ల ఆయన తడబడుతున్న తీరున అప్పుడప్పుడూ ప్రస్తావిస్తున్నా. ప్రత్యేక హౌదాపై ఆయన వ్యాఖ్యలు కూడా ఏమంత బాలేవు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఒక కాలేజీలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇబ్బంది పడటం ఇందుకు తాజా ఉదాహరణ. వారు అడిగినవి చాలా మామూలు ప్రశ్నలే. కాని సమాధానాలు సముచితంగా లేవు. ఒప్పుకోలేని విషయాల్లో తప్పుకోడం కూడా నేర్చుకోని లోకేశ్‌ తడబాటుతో ఏదో చెప్పబోయి మరింత చిక్కుల్లో పడుతున్నారు. రేవంత్‌ రెడ్డి కేసుపై ఆలస్యంగా ఇచ్చిన జవాబు అస్తవ్యస్తంగా వుంది. నోట్లరద్దు విషయంలోనూ ఏదో చెప్పి బయిటపడ్డారు. ఈ క్రమంలో ఆయన వెంటవున్న సెక్యూరిటీ గార్డులు ప్రశ్న వేసిన విద్యార్థిని చుట్టుముడితే చినబాబు జోక్యం చేసుకుని విడిపించడం కొసమెరుపు. పార్టీ సమావేశాల్లో మాట్లాడ్డానికి పదిమందిలో మాట్లాడ్డానికి తేడా. ప్రశ్నలు అదికూడా కుర్రాళ్ల దగ్గర తీసుకోవడం మరింత కష్టం.వారు ఎవరినైనా ఏదైనా అడిగేస్తారు. దేనికైనా సమాధానం చెప్పేలా తయారు కావాలి గాని వారిపై ఆగ్రహం, తనలో ఆందోళన అవసరం లేదని లోకేశ్‌ అర్థం చేసుకుంటే మరింత బాగా సిద్ధమవుతారు. అప్పటి వరకూ అంతర్గత సమావేశాలకే పరిమితం కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *