మోడీ నోట్ల దాడి!

శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన నా వ్యాసం చదవండి.. కాస్సేపట్లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చూడండి.. రాసింది న్యాయమో కాదో మీకే తెలుస్తుంది.ఇలాటి విషయాలే చెప్పినందుకు భరించలేని బిజెపి ప్రతినిధి ఈ రోజు సాక్షి చానల్‌ చర్చలో నాపై అసహనంతో ఆక్రోశంతో దాడి చేశారు. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలైనా కేంద్రం నేతల కళ్లు తెరిపించాలని కోరుకుందాం.

 

ప్రజలపై దాడికి నోట్లు కూడా ఆయుధాలేనని నిరూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. నల్ల, ్లధనంపేరిట ఆయన ప్రయోగించిన ఆయుధాలు కల్లాకపటం లేని పేదలనూ శ్రమజీవులనూ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. సాధారణ భారతీయులందనూ రోడ్లపాలైనారు.పాతిక మంది ప్రాణాలే కోల్పోయారు. పెళ్లిళ్లు వ్యాపారాలు చదవులు ఒప్పందాలు చెల్లింపులు రుణాలు ప్రయాణాలు ఒకటేమిటి సమస్త రంగాలూ అతలాకుతలమైనాయి. ఆఖరకు ఆయన మాతృమూర్తి తొంభైమూడేళ్ల పండువృద్ధాప్యంలోనూ చిల్లరకోసం వరుసకట్టవలసిన దురవస్థ ప్రాప్తించింది. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న న్యాయసూత్రం తలకిందులై కోటానుకోట్లమంది చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నరకం మరో యాభై రోజులు భరించాలని ప్రధాని దివ్యసందేశం. ఆర్థికంగా రాజకీయంగా పాలనా పరంగా సామాజికంగా అనర్థదాయకమైన ఈ నిర్ణయం చివరకు మోడీ కూడా కళ్లనీళ్లు పెట్టుకుని సమర్తించుకోవలసిన నాటకీయ పరిస్థితి సృష్టించింది. ఆయనంటే మరుసటి రోజు మాట మార్చారు గాని రెక్కాడితేగాని డొక్కాడని బక్కప్రాణులు, పైసాపైసా చూసుకుంటూ బతుకులీడ్డే బడుగులు, ఏటికి ఎదురీదుతున్నట్టు సేద్యం చేసే రైతులు, ఏపూటసాపాటు ఆపూటే అనుకునే మహిళలు వీరంతా యాభై రోజులు ఇంతటి దుర్భరంగా ఎలా బతుకుతారు?
ఇలాటి నిర్ణయం తీసుకున్నందుకు వారు నన్ను బతకనివ్వరు అని మోడీ ఎవరిని ఉద్దేశించి అన్నారో గాని వారికి కొంపమునిగిందేమీ లేదు. ఈ సర్జికల్‌ స్ట్రయిక్‌-2తో సామాన్యులను ఇంతగా చితగ్గొట్టిన మోడీ సర్కాకు కార్పొరేట్‌ బాబుల మాయబకాయిలను మాత్రం మాబాగా మాఫీ చేసి తాజా కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతుంటారు. . మాఫీకాదు ఖాతా మార్పిడి మాత్రమేనని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఇచ్చిన వివరణ ఆత్మ వంచన పరవంచన కూడా. కాంగ్రెస్‌ హయాంలో ఇలాటి వాటిపై బిజెపి ధ్వజమెత్తేది. కాని తాను మరింత బాహాటంగా విజరు మాల్యాల ఎగవేతలను సుగమం చేసింది. ఇందుకోసం బ్యాంకింగు వ్యవస్థనే బలిచేసేందుకు సిద్ధపడింది. మరోవైపున ఏ పాపం చేయని కోట్టమంది తమ కష్టార్జితమైన కాస్త సొమ్మును వాడుకోరాదని కట్టడి చేసింది. ఇలాటి ఉదంతం స్వతంత్ర భారత దేశంలోనే గాక ప్రపంచంలో ఎక్కడా జరిగి వుండదు. నేటి పరిస్థితుల్లో 500 పెద్ద నోటు కానేకాదు. పోనీ అలా పెద్ద నోట్ల రద్దు అంటూనే అంతకంటే పెద్ద 2000 నోటు తెచ్చారు. అక్రమ ధనం పట్టివేత అందామా అంటే బ్యాంకుల్లోని ఏ ఖాతాపై ఎలాటి చర్య ప్రకటించింది లేదు.ఎంతసొమ్మయినా డిపాజిట్టు చేసుకోవచ్చని ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపోచ్చని తలుపులు తెరిచింది. ఇక నల్లధనం వేటాడిందెక్కడీ పట్టుపడిందెక్కడీ అక్కడో ఇక్కడో నోట్ల కట్టలు పడేశారంటున్నా ఎవరు పారేశారో తెలియకుండా ఎలా నమ్మడం? . ఎందుకంటే ఆర్థిక వేత్తలు స్పష్టంగా చెబుతున్నది, అనుభవంలో అందరికీ తెలిసింది నల్లడబ్బు శివాజీ చిత్రంలో లాగా లేక లీడర్‌ సినిమాలో లాగా గుట్టలు పోసి వుండదు. బ్యాంకులలోనూ స్తిరాస్తుల లోనూ బంగారం రూపంలోనూ వుంటుంది. అందులో కొంత ేు నగదుగా పెద్ద నోట్లలో వుండొచ్చు. ఆ మాటకొస్తే భారీగా వందల్లోనూ వుండొచ్చు.ే నల్లడబ్బు అంటే లెక్క సరిగా చూపనిదే. బహిరంగంగానే బడా బాకీలు రద్దు చేస్తున్న ప్రభుత్వం బ్యాంకుల్లో బినామీ ఖాతాల్లో వున్న నల్లడబ్బును పట్టుకుంటుందని ఆశించలేము. మొన్న స్వచ్చంద వెల్లడి పథకం(విడిఎ) తరువాతా పట్టుకున్నదేమీ లేదు.
ఎన్నికల ప్రచారంలో మోడీయే 90శాతం అక్రమధనం విదేశాల్లో వుందని ో చెప్పారు. ఇప్పటికి ఇచ్చిన రెండున్నరేళ్లలో దాన్ని అంటుకోనైనా లేదు. వాటికి సంబంధించి 600పేర్లు బయిటకు వస్తే ప్రజల ముందుంచలేదు.బాహాటంగా బ్యాంకులకు టోపీపెట్టిన వారిని తన మంత్రివర్గంలోనే చేర్చుకున్నారు. ఇలాటి ప్రధాని హఠాత్తుగా ప్రజల నోట్ల రద్దు చేయడం ఆరునెలల సాము చేసి అవ్వను కొట్టిన చందంగా వుంది. ఈ ప్రక్రియలో అసలైన ఆసాములు ఎలాగూ సురక్షితమే. బ్యాంకుల్లోని భారీ ఖాతాలకు వారే కొత్త నోట్లు ఇస్తారు.. ఇదేగాక రకరకాల పద్ధతుల్లో తమ అక్రమ ధనాన్ని వీలైన మేరకు మార్చుకుంటారు. అందుకు ప్రభుత్వ వ్యవస్థలనూ వాడుకుంటారు. . పెద్ద చేపలను పట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమైతే అప్పుడు కనీస పరిమితికి దిగువన వున్నవారికి వెసులు బాటు కల్పించవలసింది. లేదా ఆ పరిమితిపైన వారికి కఠిన నిబంధనలు పెట్టవలసింది. పత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా అందరినీ కలిపి బాదడం వల్ల చితికిపోయిది చిన్నవారైతే తట్టుకోగలిగేది మహా సంపన్నులే. షరామామూలుగా ఈ దేశంలో అధికారుల నుంచి దళారీ వ్యవస్థలూ మాఫియాలు వారి సేవలోనే తరిస్తుంటారు. వారి బ్యాంకు నిల్వలు ఇప్పుడు 2000 నోట్లలో సురక్షితంగా వుండిపోతాయి. కొంత భాగం నష్టమైనా పెద్దలెక్కలోకి రాదు. ఈ యాభై రోజులలోనూ నోట్లు మార్చుకోవలసిన అవసరమే కలగదు. మామూలు వాళ్లకు అది రోజువారి అవసరాలకు అక్కరకు రాదు. మార్చుకోవడానికి చిల్లర దొరకదు. ఇది రెండు విధాల శిక్షే.మొత్తం వ్యవస్థలనే ప్రైవేటీకరించి ప్రజలను అటువైపు నెట్టిన ప్రభుత్వం ఇప్పుడు తమ చెల్లింపులు మాత్రం పాతనోట్లలోచేయొచ్చని అనుమతిస్తే ఎంత ప్రయోజనం?(అదైనా వారి ఆలోచన కాదు, తెలంగాణ ప్రభుత్వానిది) ప్రస్తుతం సుప్రీం కోర్టువాదనల్లో వచ్చినట్టు సెక్షన్‌26(3) ఒక సీరిస్‌ నోట్లరద్దుకు అవకాశమిస్తుందే గాని మొత్తం ఒక సంఖ్యగల వాటన్నిటిని మొత్తంగా ఎత్తివేసే వీల్లేదు. రెండవది బ్యాంకులు అడిగనప్పుడు తిరిగిస్తామనే వాగ్దానంతోనే డిపాజిట్లు సేకరిస్తాయి.కాబట్టి ఇప్పుడు మదుపరులు ఇంతే తీసుకోవాలని నిర్దేశించడం కూడా చెల్లదు.వీటిపై సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూడాలి.
నల్లధనం నిరోధానికి ఇది మార్గమే కాదని ప్రభాత్‌ పట్నాయక్‌, రఘురాం రాజన్‌, పి.చిదంబరం వంటివారంతా ప్రకటించారు. సరైన ప్రణాళిక లేకుండా చేశారని సుబ్రహ్మణ్యస్వామి, గుజరాత్‌ బిజెపి ఎంపి వినరు సహస్రాబ్ది వంటివారు కూడా విమర్శించారు. కేరళ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఘనంగాస్వాగతించగా తెలంగాణ ముఖ్యమంత్రి పరోక్షంగా స్పందన వెల్లడించి ప్రత్యక్షంగా సామరస్యం పాటిస్తున్నారు. అరుణ్‌జైట్లీ సాంకేతికంగానే మాట్లాడుతున్నారు. ఎటొచ్చి వెంకయ్య నాయుడు మాత్రం షరామామూలుగా ఈ నిర్ణయంతో మోడీ ప్రపంచ(లోక) నాయకుడై పోయారని పొగిడి పరవశిస్తున్నారు. పేదలంతాసంతోషిస్తున్నారని ఫ్రధాని ఏ దివ్యాంజనంతో చూశారో గాని ప్రత్యక్ష ప్రసారాలన్నీ ప్రజలబాధలనే చెబుతున్నాయి. ఈ హడావుడిలో అశాస్త్రీయత అవకాశవాదం ఆర్భాటం అలా వుంచి అమలు జరిపిన తీరు అసమర్థతకు నిదర్శనం. పెద్దనోట్ల రద్దు చేయాలనే ఆలోచన వుంటే చిన్న నోట్లను ముందే ఎక్కువ నిష్పత్తిలో ముద్రించి మామూలు పద్ధతిలోనే పంపించవలసింది. అది కూడా పకడ్బందీగా చేయగల సత్తా ప్రభుత్వానికి లేదా? దొంగనోట్ల చలామణి .28 శాంతానికి లోపుగా వుంటే 89 శాతం నోట్లను రద్దుచేయడం దానికి పరిష్కారమెలాఅవుతుంది? పైగా కొత్త 2000 విడుదల కాకముందే బయిటకు వచ్చేసిందంటే ఇంకేం గోప్పత? దానికి నకిలీ చేయడం కూడా పెద్ద సమస్య కాదని అధికారులే అంగీకరించారు. అందుకే ఇది ఆలోచనా రహితమైన బాధ్యతా రహితమైన ప్రణాళికా రహితమైన ఏకపక్ష ఏకవ్యక్తి చర్య.తలుచుకుంటే మీ జీవితాలే తలకిందులు చేయగలనని చెప్పడం కోసం ప్రజాస్వామికంగా ఎన్నికైన ఒక ప్రధాని చేసిన అధికార ప్రదర్శన. దీనికోసం యాభై రోజుల తర్వాత ఉరితీయడం వంటివేమీ జరగవు గాని రేపు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లోనూ రెండేళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలు తమ తీర్పునిస్తారు. ఇప్పటికైతే మాత్రం పేదలను దృష్టిలో పెట్టుకుని మరికొంత కాలం పాత నోట్లను అనుమతించడం అవసరం. రెండో మూడో 500.1000 నోట్లు మార్చుకునేవారి దగ్గర నల్లధనం వుండదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే దేశ జనాభాలో 1శాతం మంది దగ్గర యాభóై శాతం సంపద వుంది. అలాటి ఘరానాబాబులంతా పెద్దపార్టీల ఖుద్దునే వుంటారు. ఇదివరకూ ఇప్పుడూ రేపు కూడా. కాబట్టే – కపట కలుషిత రాజకీయమా వర్థిల్లు. నల్లధనం కల్లతనమా వర్ధిల్లు. ప్రజా చైతన్యమా ప్రశ్నించు. ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజి,గమనం,18,11,16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *