కార్పొరేట్ మేడిపండ్లు!
ఈ దేశంలో మరీ ముఖ్యంగా సరళీకరణ యుగం వచ్చాక కార్పొరేట్ పదం తారకమంత్రంగా మారింది.కార్పొరేట్ గవర్నెన్స్,కార్పొరేట్ ఎఫిషియన్సీ,కార్పొరేట్ స్టాండర్డ్, కార్పొరేట్ విద్య వైద్యం ఒకటేమిటి ప్రభుత్వాధినేతలుగా వున్నవారే కార్పొరేట్ అంటేనే గ్రేట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ వూపులో ప్రభుత్వ సంస్థలను కూడా తక్కువ చేస్తున్నారు. కాని ఇప్పుడు దేశంలోనే పురాతనమైన టాటాల సామ్రాజ్యంలో సైరస్ మిస్త్రీ తొలగింపునకు దారితీసిన పరిణామాలు అనంతర తగాదాలు నిజంగానే పారదర్శకంగా లోపరహితంగా వున్నాయా? నిజంగా అక్కడ ఏం జరుగుతుంది? ఇంత గందరగోళపు గవర్నెన్స్‌ను ఏమని పిలవాలి? వ్యాపారంలో నిర్ణయాల నుంచి లెక్కలు చూపడం నుంచి ఎన్ని పరస్పర ఆరోపణలు?
గతంలో సత్యం కంప్యూటర్స్ వ్యవహారం ఇలాగే తయారైంది.చంద్రబాబు నాయుడు ఆయన్ను దేశానికే ఆదర్శంగా చెప్పడమే గాక అమెరికా అద్యక్షుని సరసన కూచోబెట్టారు. తర్వాత ఎంత ఘోరంగా మారింది? నా హయాంలో బాగున్నారు గాని వైఎస్ పాలనలో చెడిపోయడని చంద్రబాబు అంటుంటారు గాని కార్పొరేట్ గొప్పతనం ఏమైంది?
రిలయన్స్ అధినేతలు గోదావరి గ్యాస్ వంటి విషయాల్లో చేసింది గాని, అదానీ ఆస్ట్రేలియాలో ఎదుర్కొన్న వివాదాలు గాని, జిఎంఆర్‌ను మారిషస్ నుంచి పంపించివేయడం గాని దేన్ని సూచిస్తుంది?
ఇప్పుడు విజరు మాల్యా, సహారా అధినేత సుబ్రతో రారు, తెలుగు రాష్ట్రాలను ఒక వూపు వూపిన విద్యావ్యాపారి కేశవరెడ్డి ఇత్యాదుల ఉదంతాలు ఉదాహరణలు ఏం చెబుతున్నాయి? మేడిపండు చూడ మేలిమై వుండు..పొట్ట విప్పి చూడ పురుగులుండు..
కార్పొరేట్లందరూ చెడ్డవాళ్లని కాదు గాని పారదర్శకత వుండదని మాత్రం చెప్పొచ్చు. వారి సమర్థతపై సర్కార్లు పొగడాల్సిన పనిలేదనీ చెప్పొచ్చు. ఇప్పుడు టాటా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకున్నారట. ఇలాటివన్నీ కవర్ చేసుకుంటారు మరి! ఫోటోలో చూస్తే అంతటి దిగ్గజం నార్త్‌బ్లాక్‌లో లిఫ్టు దగ్గర నిలబడి వుండటం చూడొచ్చు.