మరైతే చంద్రబాబు అలా ఎందుకన్నారు?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇటీవల మీడియా గోష్టులూ, ముఖాముఖి కార్యక్రమాలు జరుపుతున్నారు.బాగానే వుంది.ఇందుకోసం ఆయన ఇన్‌ఫార్మల్‌గా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. తమ పార్టీ వారితో చర్చలు జరుపుతున్నారు. ఇదంతా ఓకె గాని ప్రజల మనోభావాల గురించిన సరైన సమాచారం ఆయన గ్రహిస్తున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్డం ఒక్కటే ప్రత్యర్థులకు సమాధానమని భ్రమపడుతున్నట్టున్నారు. వయసు అనుభవం తక్కువ గనక కొంత సర్దుకున్నా అతిగా పొగడ్డం బెడిసికొడుతుంది. ఇటీవల ఆయన ప్రత్యేకహౌదా రాకపోయినా చంద్రబాబు నాయుడు వుంటే చాలన్నట్టు ఒక ఛానల్(సాక్షి కాదు) వార్త ఇచ్చింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హౌదా ఏది మేలే ఆయనకే బాగా తెలుసని లోకేశ్ సమర్థించారు. ఒక విధంగా ఇది చంద్రబాబును కూడా మించిపోవడమే. నిజంగా ఆయన వుంటే చాలనేట్టయితే అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక హౌదా అడిగివుండేదే కాదు. హౌదాపై రాజీ లేదని అన్నిసార్లు ప్రకటనలు చేసి వుండేదే కాదు. కేంద్రం ఇవ్వలేదు గనక సర్దుకున్నామనే స్తాయి నుంచి అసలు హౌదా కన్నా ఇదే మేలు అనే స్తితికి తెలుగుదేశం రావడం దారుణమే. అలాటి అంచనాకు ఆధారమే లేదు.ఇప్పటికి ప్యాకేజీకి రూపం లేదు. పరిణామం లేదు. అది ఒక విధంగా అస్పష్టంగా అయోమయంగా వుంది. ఇక ఇప్పుడు లోకేశ్ మరో అడుగు ముందుకేసి అసలు చంద్రబాబు వుంటే చాలు అన్నారంటే ఇక ప్యాకేజీ కూడా అవసరం లేదనుకోవాలా? నా ఉద్దేశంలో యువ నాయకుడుగా లోకేశ్ వంటి వ్యక్తి భిన్నాభిప్రాయాలు గౌరవించడం, పరిగణించడం మంచిదితప్ప ఎదురుదాడి ఆత్మస్తుతికే పరిమితమైతే పెద్ద ప్రయోజనం వుండదు.