తల్లిసెంటిమెంటు..అసలైన పాయింటు!
ఆలోచనారహితమైన హడావుడి నోట్లరద్దు ప్రహసంలో ప్రభుత్వం రోజూ కొన్ని సరికొత్త నిర్ణయాలు చర్యలూ ప్రకటిస్తూనే వుంది. ప్రజలు కష్టాలు పడుతూనే వున్నారు. ప్రతిపక్షం రేపు సభలో నిలదీయడానికి సమాయత్తమవుతూ వుంది. అయితే అటు పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ ఇటు నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్‌తో ప్రధాని మోడీ ఎజెండా నిర్ణేత అయ్యారని ఆయన అనుచరులు ఆనందపడిపోతున్నారు. ఈ కథలో కొత్త ట్విస్టు భారతీయులకు ఎంతో ప్రియమైన తల్లిసెంటిమెంటు. మోడీజీ గోవాలో మాట్లాడుతూ దేశం కోసం తాను కుటుంబాన్ని ఇంటినీ అన్నిటినీ వదులుకున్నానని కన్నీళ్ల పర్యంతమైనారు. వాస్తవం ఏమంటే ఆయన భార్యను మాత్రమే అది కూడా చెప్పకుండా వదులకున్నారు. నా భార్య పేరు యశోదాబెన్ అని రాసిన ఆయన ఆమె ఉనికినే గుర్తించకపోగా తన గురించి తాను తెలుసుకోవడానికి సమాచారహక్కు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించారు. తల్లా పెళ్లామా అని ఎన్టీఆర్ ఒకప్పుడు తీసిన సినిమా టైటిల్‌లోని ప్రశ్న. మోడీ తల్లిని మాత్రం పూర్తిగా గౌరవించడమే గాక ప్రచారానికి కూడా వాడుతుంటారు.ఎందుకంటే ఇంతకు ముందు ఈ దేశాన్ని రాష్ట్రాలను పాలించిన వాళ్లకు కూడా చాలామందికి తలిదండ్రులున్నారు. వారెవరూ అమ్మకు అన్నం పెట్టడం కబుర్లు చెప్పడం మీడియాలో చూపించుకోలేదు. సరే అదాయన ఇష్టం.
నోట్లరద్దు దుమారంలోనూ ఈ తల్లిని తెరపైకి తీసుకురావడం బాగానే వుంది గాని దానివల్ల వచ్చే సంకేతాలు ఆలోచించినట్టు లేదు. ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ మోడీ వయస్సు 93 ఏళ్లు. అంత పండుముసలి కూడా నోట్లరద్దు వల్ల బ్యాంకుచుట్టూ తిరగాల్సి రావడం ప్రభుత్వ నిర్ణయం ఎంత పొరబాటో చెప్పే ఉదాహరణ మాత్రమే. ఇలా దేశంలో ఎన్ని వేలమంది వయోవృద్ధులు నానాబాధలు పడుతున్నారో.. పెన్షన్లు రాక చెల్లక అలమటిస్తున్నారో! ప్రధాని తల్లిగారు గనక మనమామ్మకు సమస్య వుండకపోవచ్చు గాని మారుమూల తల్లులూ తాతలకు ఎవరు తోడుంటారు? ఎవరు తోడు నిలుస్తారు? తల్లి సెంటిమెంటు బాగానే వుంది గాని ఈ పాయింటు ఆలోచిస్తారా మోడీజీ? ఏం పాపం చేశామని వారంతా అవస్థ పడాలి?