నోట్లరద్దుతో సమానత్వమన్న మోడీ- బిజెపి ఎంపిల విమర్శలు- ఏచూరి కీలక ప్రశ్నలు


నోట్లరద్దు పునర్ముద్రణ మార్పిడి ప్రహసనంపై వివిధ తరగతుల నుంచి వ్యతిరేకత పెరిగేకొద్ది సమర్థించుకోవడానికి ప్రధాని మోడీ వింత వాదనలు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఆయన ఉత్తర ప్రదేశ్‌లో రైల్వే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ చర్య వల్ల ధనికులూ పేదలూ సమానులైపోయారని సెలవిచ్చారు! నిన్న గోవాలో కళ్లనీళ్లు పెట్టుకుని సెంటిమెంటు పండించిన ఆయన ఈ రోజు పూర్తిగా ఎదురుదాడి చేశారు. కాకపోతే కాంగ్రెస్‌పేరిట దాడి నడిపించారు. వాస్తవం ఏమంటే ఒకటి రెండు పార్టీలు తప్ప అన్ని ప్రతిపక్షాలూ రాష్ట్రాలూ ఈ చర్యను విమర్శించాయి. గత రెండు రోజులుగా చెప్పుకున్నట్టు ఆర్థికవేత్తలు బ్యాంకర్లు కూడా పెదవి విరిచారు. ఈ రోజు సాక్షాత్తూ ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో అది కూడా గాంధీజీ జన్మస్థలమైన పోరుబందరు బిజెపి ఎంపి విఠల్ రాధాదిరు నోట్ల రద్దు వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన రాజకోట్ జిల్లా సహకారబ్యాంకు అద్యక్షుడు కూడా అయిన విఠల్ తన బ్యాంకులో సభ్యులైన పదిలక్షల మంది రైతులు ఏం కావాలన్న నగదు ఇచ్చి తెచ్చుకోవాలని ఇప్పుడు వారంతా ఇక్కట్లలో పడిపోయారని విమర్శించారు. పాలక పక్ష ఎంపి జగడాలమారి సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈ చర్యకు ఆర్థిక శాఖ తగు సన్నాహాలు చేయలేదని విమర్శించారు. మరోవంక బిజెపి ఉపాద్యక్షుడు వినరుసహస్రాబ్ది ఈ చర్యపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పొరబాట్లు మాట్లాడి మీడియాకు చిక్కిపోయారు. సాగర్‌లో వినోద్ పాండే అనే ఉద్యోగి నోట్ల క్యూలో నిలబడి మరణించిన సంగతి విలేకరులు ప్రస్తావిస్తే రేషన్ కోసం క్యూలలో కూడా జనం చనిపోతుంటారని తేలిగ్గా తీసిపారేశారు. వారి ప్రశ్నలకు జవాబులు లేక ఎదురుదాడిచేయబోయి చివరకు చేతులెత్తేశారు.
రాజకీయ వాదులే గాక వాణిజ్య పారిశ్రామిక సంఘాలైన అసోచెమ్, ఇంకా లనేక రంగాల సమాఖ్యలు కూడా నోట్ల రద్దు కష్టాలనుంచి బయిటపడేయడానికి చాలా సూచనలు చేశాయి.
ఒక 16వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో ఈ చర్చ లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధమైనాయి.సిపిఎం ఇప్పటికే నోటీసు ఇచ్చింది. ఇంకా సిపిఐ,వైఎస్‌ఆర్‌పార్టీ, జెడియు, ఆర్జేడి, ఎంజెఎం,టిఎంసి కూడా ప్రతిపక్ష నాయకుడైన గులాంనబీ అజాద్‌తో సంప్రదించాయి.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నోట్ల రద్దు సమస్యలను తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ఆసక్తికరమైన విషయం చెప్పారు. దేశ సంపదలో 90 శాతం అక్రమ ఖాతాలుగా విదేశాల్లో వుందని మోడీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. వారిలో 600 మంది పేర్లు ప్రభుత్వం దగ్గర వున్నాయి. మరి ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే బ్యాంకు రుణాలు ఎగవేసిన లక్షా12 వేల కోట్లమందిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు.