ముద్రగడ సన్నాహాలు- హైకోర్టు అనుమతి- మొహరించిన పోలీసులు-

mudragada111ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహపాదయాత్రతో మరోసారి గోదావరి జిల్లాల్లో సామాజిక రాజకీయ వైరుధ్యాలు వేడెక్కుతున్నట్టు కనిపిస్తుంది. తన వర్గానికి చెందిన ప్రముఖులందరినీ సంప్రదించి, నవంబరు 16న రావుల పాలెం నుంచి యాత్ర ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. దానికి కొద్దిగా ముందుగానే డిజిపి సాంబశివరావు 30 వ సెక్షన్‌ విధిస్తూ ఎలాటియాత్రలు ప్రదర్శనలూ అనుమతి లేకుండా జరపడానికి లేదని శాసించారు. నిజానికి ఇది దివీస్‌, ఆక్వాపార్కు తదితర సమస్యలపై సాగుతున్న ఉద్యమాలను అణచివేయడం కూడా దీని వెనక ఉద్దేశం.అయితే రాజకీయ కోణంలో తక్షణం ముద్రగడ యాత్రపై దృష్టి కేంద్రీకృతమైంది. మాకు అనుమతులంటున్నారు గాని తెలుగుదేశం జనచైతన్య యాత్రలు అనుమతి తీసుకునే చేశారా అని ముద్రగడ ప్రశ్నించారు.స్వయానా ఆ ప్రాంతానికి అదే సామాజిక వర్గానికి చెందిన హౌం మంత్రి చినరాజప్ప సమాధానం కూడా ఆయన వాదననే బలపర్చేదిగా వుంది.చైతన్య యాత్రలో 150మంది వరకూ మాత్రమే పాల్గొన్నారని సామాజిక సమస్య గనక ముద్రడగ యాత్రల్లో చాలా ఎక్కువ మంది పాల్గొంటే ఉద్రిక్తత పెరిగే అవకాశముందని అంటూ తుని రైలు దగ్ధం సంఘటనను ఆయన ప్రస్తావించారు. వాస్తవానికి ఆ ఘటనను అరికట్టలేకపోవడం అటుంచి ఇన్నాళ్ల తర్వాత కూడా దర్యాప్తులో నిర్దిష్టంగా ఎలాటి పురోగమనం కనిపించడం లేదు. అలాటి ఆధారాలే వుంటే ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు గాని నిషేదాజ్ఞలు ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమవుతుంది.

తాజాగా ఇప్పుడు హైకోర్టు ఆయన పాదయాత్రకు అనుమతినివ్వడంతో ప్రభుత్వం పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కోర్టు అనుమతి నైతికంగా ఆయనకు బలం చేకూరుస్తుందనడం నిస్సందేహం. అదే సమయంలో శాంతిభద్రతల విషయం పోలీసులు చూసుకోవాలని కోర్టు యథాలాపంగా చెప్పినా దాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చే అవకాశం వుంటుంది. రాజమండ్రికి చెందిన మేడ శ్రీనివాసరావు ఈ యాత్రను ముందే ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు
మరోవైపున ఈ యాత్రలు ఉద్యమాల నేపథ్యంలో వేలాదిమంది పోలీసులను తరలిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. ఈసారి ప్రత్యేకంగా బాడీ వార్న్‌ కెమెరాలంటూ మనుషులకు కట్టుకునే అధునాతన కెమెరాలు పెద్ద సంఖ్యలోనే తెప్పించి నిఘా వేస్తారట. చర్చలు సంప్రదింపులతో పరిష్కారం కావలసిన సమస్యలను కేవలం సాయుధ బలగాలతో అదుపుచేయాలనుకోవడంఉద్రేకాలు పెంచుతుందనేది గతానుభవం. అయితే ఆ విధంగా చొరవ తీసుకుని సర్దుబాటు చేయగల వారెవరూ ప్రభుత్వంలో కనిపించడం లేదు. గతంలో జరిగిన సంప్రదింపులు కూడా సజావుగా కొనసాగలేదు.ఇప్పుడు మంజునాథ కమిషన్‌ విచారణకు భిన్నవర్గాల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. నిరససలూ సన్మానాలూ కూడా చూస్తున్నాం. హౌం మంత్రి ప్రకటనలో మాత్రం పల్స్‌సర్వే,మంజునాథ నివేదిక తర్వాత కాపులకు న్యాయం చేస్తామన్నట్టు మాట్లాడారు. ఈ లోగా ఎన్నికలు దగ్గరవచ్చన్న భావన కూడా వుంది.తన కుటుంబంపైన స్త్రీలపైన పోలీసుల భాష , జులుం కారణంగా గాయపడిన ముద్రగడ ఏదిఏమైనా అమీతుమీ తేల్చుకోవాలనే దగ్గర ఆవేదనతో చెబుతున్నారట.ఆఖరుకు ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెబితే దాన్ని వారు వినిపించకుండా చేయడం నెట్‌లో గమనించవచ్చు. ప్రభుత్వం మాత్రం ఇక ముద్రగడను మార్చలేమన్న నిర్ణయానికి వచ్చి ఆయన వర్గం నుంచి ప్రత్యామ్నాయనేతలనే అతిగా ప్రోత్సహిస్తున్నట్టు తెలుగుదేశంలో ఇతర వర్గాల వారు ఫిర్యాదు చేస్తున్నారు.

మీడియా, అలాగే వివిధ తరగతుల నుంచి వచ్చే సమాచారం ప్రకారం కాపులలో ఇప్పుడు నాలుగు రకాల విభజన వుంది.ముద్రగడ ఆయన బృందంతో వున్నవారు,జగన్‌ను బలపర్చేవారు,(ఈ రెండు రకాల మధ్య కొద్ది తేడా వుందంటారు. ఆందోళనను వైసీపీ ఎంతగా బలపర్చినా ముద్రగడ పూర్తిగా జగన్‌ మాట వినేవ్యక్తి కాదని వారి వాదన. అలాగే ముద్రగడ వెనక బిజెపి టిడిపి అనుయాయులు కూడాచాలామంది వున్నారు) అధికార తెలుగుదేశంలో వున్న వారు. మరినాలుగో తరగతి ఎవరంటే.. ఎటూ తేల్చుకోలేని తటస్తులు ,పవన్‌కళ్యాణ్‌ను చూసి ఉత్సాహపడుతున్నవారు.. ఆయన తనకు కులం లేదని చెబుతున్నా పునస్సమీకరణ తీసుకురాగలడని నమ్మకంతో చూస్తున్నవారుగా విభజించి చూపుతున్నారు. అయతే అత్యధికులు అధికార పక్షంపై అసంతృప్తితో వున్నారని వచ్చే ఎన్నికల్లో బలాబలాల మార్పులో వీరి పాత్రే కీలకమవుతుందని సామాజిక కోణం మాత్రమే చూసే విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు,పటేళ్లు,గుజ్జర్లు, ఇలా ఆందోళనలు రగులుకొంటున్న తరుణంలో ప్రభుత్వం ఆచితూచి అడుగేయాలని ప్రశాంతతను ప్రజాస్వామిక వాతావరణాన్నికాపాడాలని మాత్రం అందరూ కోరుకుంటారు. గతంలో వలె కాపుల ఆందోళనను పూర్తిగా వైసీపీకి అప్పగించే పని చేయరని కూడా తెలుగుదేశం నేతలంటున్నారు.  .కాబట్టి ఇవన్నీ ఆసక్తికరమైన ఆందోళనకరమైన మలుపులు తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *