సీట్ల పెంపుపై ఫీట్లు
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా లేదా అంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 225కు పెరుగనున్నట్టు ప్రకటించారు. ఈ పెంపుదల అసలు సాధ్యమా కాదా అంటే అది కేంద్రం ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంది. విభజన చట్టంలో వుంది గనక చేయనూ వచ్చు. దేశమంతా జరగాలంటూ ఆపనూ వచ్చు. ఏం చేస్తారనేది బిజెపి ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. తమవరకూ తాము ఇప్పుడు బలహీనంగా వున్నాము గనక సీట్లు పెంచవద్దని కోరినట్టు బిజెపి కీలక నేత ఒకరు చెప్పారు. పార్టీ అద్యక్షుడు అమిత్‌షా కూడా అదే అభిప్రాయంతో వుండటం వల్ల ఇప్పటి వరకూ తేల్చలేదట. అయితే అటు చంద్రబాబు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం సీట్లు ఎలాగైనా పెంచాలని పట్టుపడుతున్నారు. ఆ వ్యూహంతోనే బోలెడు మంది ఫిరాయింపుదార్లను చేర్చుకున్నారు.వారందరికీ ఇప్పుడున్న సీట్లలోనే స్థానం కల్పించడం కుదిరేపని కాదు. కాబట్టి ఎక్కువ సీట్లు చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్రంలో సీనియర్ నాయకులతో పదేపదే మాట్లాడ్డం లేఖలు రాయడం కూడా చేశారు. తమకైతే అధికారికంగా అలాటి వర్తమానం వచ్చిందని టిఆర్‌ఎస్ ముఖ్యనాయకులొకరు ఒక సందర్భంలో మాతో అన్నారు. ఇక చంద్రబాబు,లోకేశ్ వంటి వారు వీలైనప్పుడల్లా సీట్లు పెరుగుగాయని నొక్కి చెబుతున్నారు. ఇది ఒక విధంగా పార్టీ వారిలో విశ్వాసం నిలబెట్టే ప్రయత్నం కూడా. ఏమైనా నిధుల విడుదల సమస్యల పరిష్కారం వంటివిషయాల్లో నిర్లిప్తంగా వున్న మోడీ ప్రభుత్వం సీట్లపెంపుదల విషయంలోనైనా సానుకూలంగా వ్యవహరించకపోతే వ్యతిరేకత రావచ్చని సందేహిస్తున్నదట. కాబట్టి ఏదో విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులను సంతృప్తి పరచడానికే సిద్ధమవుతున్నది.దీనిపై ఎన్నికల సంఘంతోనూ న్యాయశాఖతోనూ సంప్రదింపులు జరుపుతున్నది. పైగా ఎక్కువ చోట్ల పోటీ చేయాలని కోరుతున్న వారిలో బిజెపి నాయకులూ వున్నారు. అన్నిటినీ మించి 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరి అవసరం వచ్చినా రావచ్చనే అంచనా కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నది. కాబట్టి సీట్ల పెంపుతో ఆశావహులు పండుగ చేసుకోవచ్చునేమో.
