ప్రత్యేక హౌదా- పారిశ్రామిక పెట్టుబడులు
అవసరాన్ని బట్టి మాటలు మార్చే అవకాశవాద నేతలకు నిజానిజాలతో నిమిత్తం వుండదు. ప్రత్యేకహౌదా మా ఘనత అని వారు గొప్పగా ప్రచారం చేసుకున్నప్పుడు అది అమృతం. వాగ్దానాన్ని వమ్ము చేసి హౌదాను నిరాకరించాలని నిర్ణయించుకున్నాక అదే విషం. నిరర్థక వ్యవహారం. అసలు ఉపయోగమే లేకపోతే పొందేందుకు అర్హతలు లేకపోతే ఎందుకడిగారు? ఎందుకు గొప్పగాప్రచారం చేసుకున్నారు?అయిదేళ్లు పదేళ్లు పదిహేనేళ్లు అని వేలం పాటలా ఎందుకు పోటీ పడ్డారు? అంతా మోసమేనా? ఎన్నికల కోసం విసిరిన పాచికేనా?
ప్రణాళికేతర సహాయంగా రెవెన్యూ లోటు భర్తీ కోసం 8 ప్రత్యేక హౌదా రాష్ట్రాలకు 13వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధుల వివరాలు కోట్లలో ఇలా వున్నాయి(చివరలో వున్నది వారి మొత్తం రెవెన్యూ రాబడిలో ఈ
సహాయం శాతం)
1.హిమచల్ ప్రదేశ్ – 1883 11.5
2.మణిపూర్ – 1379 17.8
3.మిజోరాం – 819 18.9
4.మేఘాలయ -1030 11.7
5.త్రిపుర – 1030 14.4
6.అరుణాచల్ – 623 9.6
7.నాగాలాండ్ – 1719 26.4
8.జమ్మూ కాశ్మీర్ – 3355 11.2

ఇంత స్పష్టంగా వివరాలు కనిపిస్తుంటే హౌదా వల్ల పెద్దగా వచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులూ బిజెపి నేతలు చెప్పడం ఎంత హాస్యాస్పదం?ఇప్పుడు పెరిగిన సిఫార్సుల ప్రకారం ఇంకా చాలా రావలసి వుంటుంది.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కెపిత్యాగి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక హౌదా ప్రయోజనాలు వివరించారు.
హౌదా ఇచ్చాక ఈ పదమూడేళ్లలో హిమచల్‌లో(జనాభా 68 లక్షలు) దాదాపు 10,864పరిశ్రమలు వచ్చాయనీ, 15,324 కోట్ల పెట్టుబడులతో లక్షా 29, 443 మందికి ఉద్యోగాలొచ్చాయనీ చెప్పారు. ఇక కోటి జనాభా గలఉత్తరాఖండ్‌లో 30,224 పరిశ్రమలూ 35,343 కోట్లపెట్టుబడులూ 2 లక్షల 45,573 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయి.
ఈ హౌదా నిరాకరణ మింగించేందుకు తంటాలు పడిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి స్వయానా ఈ రాయితీలను చూపి ఉత్తరాఖండ్‌లో యూనివర్సల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారే! పారిశ్రామిక వేత్తగా వుండి ఎంపి అయిన యువ సభ్యుడు గల్లా జయదేవ్ కూడా ఉత్తరాఖండ్‌లో తమ అమరరాజా బ్యాటరీస్ కోసం స్థలంకొన్నారే? అదే చోట శివశక్తి బయోప్లాంటెక్ యూనిల్ ఎందుకు పెట్టారు?ఇంకో ఎంపి సిఎం రమేష్ రాయతీలున్నాయనే కదా అక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు!
పర్వతమయమైన హిమచల్ ప్రదేశ్‌లో రెడ్డీస్ ల్యాబొరేటరీ, హెటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, ర్యాన్ బాక్సీ, సిప్లా,టొరెంటో, పనాసియా, క్యాడిలా వంటి ఫార్మా దిగ్గజాలు నెలకొన్నాయి. నెస్లే,దాబర్, వర్థమాన్,బిర్లా,టీవీఎస్ మోటర్స్,ఏసీసీ, అంబుజా, మైక్రోటెక్, లాటివన్నీ వున్నాయి.
ఉత్తరాఖండ్‌లోనూ రాకపోకలు సరిగ్గాలేని కొండ ప్రాంతమైనా హిల్ట్రాన్, హెచ్‌సీఎల్,విప్రో,బ్రిటానియా,డాబర్, హిందూస్తాన్ యూనీ లివర్, మహీంద్రా అండ్‌మహీంద్రా, టాటా మోటార్స్, తదితర ప్రముఖ సంస్థల యూనిట్లున్నాయంటే పన్ను రాయితీలే కారణం.
ఈ రాయితీలు ఇవ్వడం పారిశ్రామిక వేత్తలకే లాభం అనుకుంటే పొరబాటు. పెట్టుబడులు రాకతో ఉత్పత్తి వల్ల ఉపాధి అవకాశాలు పెరగాలనేదే ఇక్కడ వ్యూహం. ప్రపంచ వ్యాపితంగా జరిగిన అధ్యయనాలలో పెట్టుబడులు పెట్టేవారు ఏ ప్రాంతం ఎంచుకుంటారంటే పన్నుల పరంగా ఆదాయం మిగిలే చోటకు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అధికంగా వుండే చోటకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. కొన్ని అననుకూలతలు వున్నా పెట్టుబడులు రావాలంటే వారికి ప్రోత్సాహకాలు వుండాలి. 1860-1947 మధ్య కాలంలో అంటే స్వాతంత్రానికి పూర్వమే ఈ పరిస్థితి వుందని తవర్జా చేసిన పరిశోధన నిరూపించింది. అమెరికాలో బాల్టిక్ 1991లో జరిపిన అధ్యయనం ప్రకారం పన్ను రాయితీ ఒకశాతం వుంటే పెట్టుబడుల పెరుగుదల 10 నుంచి 30 శాతం వుంటుందని తేలిపింది. ఇంకా పారిశ్రామికంగా అభివృద్ది చెందిన జపాన్, బ్రిటన్‌ల నుంచి ప్యూర్టరికో, బ్రెజిల్ వంటి చిన్న దేశాల అనుభవం కూడా అలాగే వుంది. ప్రోత్సాహకాలు అక్కడ పెద్ద పాత్ర వహించాయని రామచంద్రన్. కె. అధ్యయనం తేల్చింది. మన దేశంలో పారిశ్రామికంగా పేరొందిన మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో జె.పరంజపే 1988లో జరిపిన అధ్యయనం కూడా ఇదే చెప్పింది. చంద్రబాబు నుంచి మోడీ వరకూ పరమ ప్రామాణికంగా పరిగణించే ప్రపంచ బ్యాంకు కూడా మూడు ఐ లు – ఇన్సిస్టిట్యూషన్స్,ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్,ఇన్సెంటివ్స్ వుంటేనే పారిశ్రామికీకరణ జరుగుతుందని 2009లో నివేదించింది.అదే ఏడాది ఐక్యరాజ్యసమితి అధ్యయనం కూడా అలాటి సిఫార్సే చేసింది.
వన్నీ గమనంలోకి తీసుకున్నాకే ప్రత్యేక హౌదా రాయితీల వంటి సదుపాయాలు రూపొందాయి.వీటి ఫలితాలు కూడా గణనీయంగా వున్నాయి. 2012లో ప్రణాళికా సంఘం ఉత్తరాఖండ్, హిమచల్, కాశ్మీర్‌లలో ప్రత్యేక హౌదా రాయితీల ప్రభావంపై అద్యయనం చేయించింది. హిమచల్ ప్రదేశ్‌లోని త్రివేణి పరిశోధనా సంస్థకు అనుబంధమైన స్టెల్లార్‌సొసైటీ ప్రణాళికా సంఘ ప్రాయోజకత్వంలో జరిపిన ఈ సుదీర్ఘ అధ్యయన నివేదిక మూడు రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణ ఉపాధి సంపద పెరుగుదల వివరాలు నిర్దిష్టంగా అందజేసింది. ఈ అధ్యయనంలో భాగంగా అధికారిక పత్రాలు నివేదికలు మాత్రమే గాక పెట్టుబడులు పెట్టిన వారిని కూడా విస్తారంగా ఇంటర్వ్యూలు చేసి అభిప్రాయాలు సేకరించారు
ఆ వివరాలు మరో భాగంలో చూద్దాం