‘అతడు’ అసలైన బ్రహ్మానందం…
అతడు సినిమా జ్ఞాపకం వుంది కదా.. నాకైతే చాలా ఇష్టం. ఆ చిత్రంలో సీరియస్‌నెస్‌తో పాటు కామెడీ కూడా బాగా పండింది. అందులో బాగా పాపులర్ సన్నివేశం బ్రహ్మానందం హీరో మహేష్‌బాబును అడిగి మరీ కొట్టించుకుని కళ్లు తేలేయడం.. అక్కడికీ హీరోయిన్ త్రిష పళ్లుతోముకుంటున్నదల్లా పరుగెత్తుకొస్తుంది’బాబారు’ అని కేకేస్తూ.. అక్కడికైనా వింటేనే.. నేను అతన్ని కొట్టడం లేదమ్మా.. అతన్నే కొట్టమంటున్నాను అంటాడు గంభీరంగా.. సరే అనివార్య పరిస్థితుల్లో హీరో కొట్టడం.. మనవాడు గుడ్లుతేలేయడం,, చేతిలో పేస్టు సింబాలిక్‌గా చితికిపోయి కిందపడ్డం..
అంతకు మించిన సీన్ ఇప్పుడు బీహార్‌లో జరిగింది. ఎందుకంటే జీవితం సినిమాలు నాటకాలను మించిన కామెడ,, సందేశ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్జేడి ఎంఎల్‌ఎ అరుణ్‌యాదవ్ ఇక్కడ నిజ జీవిత బ్రహ్మానందమన్నమాట. భోజ్‌పూర్ జిల్లా అవతరణ దినోత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు జరుగుతుంటే ఇతగాడు వెళ్లాడు. పూర్వాశ్రమంలో యాదవ్ కూడా ఓ మోస్తరు వస్తాదేనట. బాగానే వుంది గాని ఈ కుస్తీ పోటీల దగ్గర వూరుకోకుండా ఆ అక్కడున్న వస్తాదుకు ఉచితసలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. రాజ్‌కుమార్ అనే ఆ కుర్రవస్తాదు కాస్సేపు ఓపిగ్గా విన్నాడు గాని ఇంకా బోరు కొట్టిస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఎంఎల్‌ఎల గారిని ఎత్తి కుదేశాడు. ఇంకేముంది? అంతా రభస..రచ్చ.. అప్పటికైనా వూర్దుకోకపోగా ఈయన గారు మళ్లీ కలబడబోయాడట.అక్కడున్న జిల్లా మెజిస్ట్రీట్ జోక్యం చేసుకుని సర్దిపంపించాడు.
అక్కడికీ కళ్లుతెరవని ఆరుణ్ యాదవ్ ఇప్పుడు వేరే బట్టలేసుకున్నాను గనక కుస్తీ చేయదల్చుకోలేదు. లేదంటేనే అంటూ నిష్క్రమించాడు.
ఇదంతా మన కమెడియన్లు ముఖ్యంగా బ్రహ్మానందం, వేణు మాధవ్‌లను గుర్తు చేయదూ?

