సమతుల్యత దెబ్బతీసిన చంద్రబాబు తప్పిదం
చంద్రబాబు నాయుడు కుటుంబం విజయవాడకు మారుతున్నట్టు శనివారం టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లడం న్యాయమే. కాని పదేళ్లు హైదరాబాదులోనే వుంటానని తెలుగుదేశంను మళ్లీ అధికారంలోకి తెచ్చాకే వెళతానని మొదట్లో ఆయన ప్రకటించిన విషయం ఇప్పుడు గుర్తుకు వస్తుంది. తెలుగుదేశం పరంగా ఆయన ఆ నిర్ణయం మార్చుకోవచ్చు గాని తెలుగు రాష్ట్రాల పరంగా పదేళ్ల ఉమ్మడి రాజధానిని పూర్తిగా వదిలేయడం రాజకీయ రాజ్యాంగ సమతుల్యతను దెబ్బతీయదా? గత శాసనమండలి సమావేశంలోనే ఆయన దాదాపు వీడ్కోలు చెప్పేశారు. మొదట అవసరాన్ని మించి గంభీరోక్తులు తర్వాత హఠాత్‌గా తిరోగమనం గౌరవ ప్రదంగా వున్నాయని ఎవరైనా అనగలరా? వాస్తవానికి హైదరాబాదులో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఓటర్లు టిడిపి బిజెపి కూటమికి ఇచ్చారు. వారి పట్ల బాధ్యత నెరవేర్చవలసింది. హైదరాబాదు తెలుగువారందరితో సహా జాతీయ నగరంగా వెలుగొందేది. కాని తెలుగుదేశం నేత తమ ఎంఎల్‌ఎలనే కాపాడుకోలేకపోయారు. ఒకసారి నేను దీనిపై ఆయనతో అంటే వెళ్లేవాళ్లు వెళ్లారు ఇక సమస్యలేదు అన్నట్టు మాట్టాడారు. కాని తర్వాత మరో పది మంది పార్టీ మారారు. వారిని ఆపలేకపోగా రాని ఎంఎల్‌సి పదవి కోసం టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎను ప్రలోభపెడతానన్న రేవంత్ రెడ్డిని అనుమతించారు. అదే ఆయన పార్టీని ఆయననూ మాత్రమే గాక రెండు రాష్ట్రాల సంబంధాలనూ సమతుల్యతనూ కూడా దెబ్బతీసింది. ఇదంతా టిఆర్‌ఎస్ కుట్ర అనొచ్చు గాని కెమెరాలో, టేపులో దొరికిపోయిన వాస్తవాన్ని ఎలా కాదనగలరు? ఆ తర్వాత ఆయన ఆనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు చాలా వున్నాయి. పోనీ వాటిపై గట్టిగా నిలబడ్డారా అంటే అదీ లేదు. వున్నట్టుండి మొత్తం బిచాణా ఎత్తేశారు. టిటిడిపిని కూడా పట్టించుకోడం బాగా తగ్గించారు. దీనివల్ల టిటిడిపిలో పనిచేయాలనుకునే వారికి కూడా గందరగోళమేర్పడింది. మరోవైపున ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నుంచి సామూహిక ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఒకోచోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు తయారై కూచున్నారు.కొన్నిచోట్ల కొట్టుకుంటున్నారు కూడా. మంత్రివర్గ మార్పులను కూడా దీనివల్ల పూర్తి చేయలేకపోతున్నారు. కుమారుడు లోకేశ్‌ను తీసుకోవాలన్న ఆశ కూడా వాయిదా వేసుకుంటున్నారు. నిషేదాలు నిర్బంధాలకు పాల్పడుతున్నారు. మిత్రులుగా బయిలుదేరిని పవన్ కళ్యాణ్ వంటివారు కూడా విమర్శకులవైపు నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ తప్పులు సరిచేసుకునే బదులు ప్రతిపక్షాలపైన దాడి చేయడానికి విమర్శకులపై విరుచుకుపడటానికి ప్రాధాన్యత నిస్తున్నారు. ఇప్పటికైనా కొంత ఆత్మ విమర్శ పునరాలోచన చేసుకుంటే తెలుగువాళ్లకు మేలు జరుగుతుంది. సమర్థనే సర్వస్వమనుకుంటే ఆ పార్టీతో సహా అందరికీ నష్టం కలుగుతుంది.
