వెంకయ్య కాదు, రామ్ మాధవ్ మాట ఎక్కువ…?
పరిపూర్ణానంద స్వామి స్థాపించిన భారత్ టీవీకి చాలా సార్లు ఆహ్వానించినా నేను వెళ్లడం కుదరలేదు. మొదటిసారి నిన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ ప్రత్యేక హౌదా సమస్యపై చర్చకోసం వెళ్లాను. నాతోపాటు కాంగ్రెస్ తులసిరెడ్డి,వైసీపీ కృష్ణారెడ్డి, బిజెపి ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ పాల్గొన్నారు. వెంకయ్యా.. తప్పు నీదయ్యా అని చర్చకు శీర్షిక నిచ్చారు. ఈ చర్చలో బిజెపి శ్రీధర్ వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. ప్రత్యేక హౌదా విషయంలో కొంత లోపం జరిగిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అది ముగిసిన అధ్యాయం అవునా కాదా అనేది ప్రజలు చేసే పోరాటంపైన ఆధారపడి వుంటుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సత్కారాలు చేయించుకోవడం తమకు ఇబ్బందిగా వున్న మాట నిజమేనని అంగీకరించారు. నిజానికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ ప్రభుత్వంలో వెంకయ్య కన్నా రాం మాధవ్ ప్రభావం చాలా ఎక్కువనీ, జరిగింది జరగవలసింది కూడా ప్రధానంగా ఆయన పాత్రపై ఆధారపడి వుంటుందని చెప్పారు. రాష్ట్ర బిజెపిలో కూడా పురందేశ్
వరి వంటి వారు కీలక బాధ్యతలు తీసుకోవాలనే చర్చ వుందని అప్పుడు మరిన్ని మార్పులు చూడగలమని సూచించారు. వెంకయ్య నాయుడును ఎపి నుంచి గాక బయిటనుంచి రాజ్యసభకు పంపించి ఇక్కడ సురేష్ ప్రభుకు స్థానం కల్పించడంలో సంకేతాలు వున్నాయట. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఆయన నుంచి మార్చడంలోని రాజకీయాలను కూడా అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఒకరినొకరు పొగుడుకుంటూ వుండొచ్చని ఢిల్లీలోనూ బిజెపిలోనూ ప్రధాన ధోరణికి ఇది ప్రతిబింబం కాదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తో లేక మరొకరితో తాము భవిష్యత్తులో జట్టు కట్టే అవకాశం వుందని తెలిపారు. తాము ఇచ్చిన నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన వివరాలు అందలేదు గనకే విడుదల పూర్తి కావడం లేదని తెలిపారు. ఎపి కన్నా చాలా చిన్నవైన ఒరిస్సా వంటి రాష్ట్రాలకు కూడా మనకన్నా మెరుగ్గా నిధులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు గనకే రావలసినవి రాలేదని తులసిరెడ్డి చెప్పారు.మామూలుగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడే వైసీపీ నేతల వలె గాక కృష్ణారెడ్డి మాత్రం ఆయన ప్రశ్నలకు బిజెపి సమాధానం చెప్పుకోవాలన్నారు.
