తెలంగాణ రాజకీయ చర్చ మార్చిన ‘మహా’ యాత్ర
తామొకటి తలిస్తే ప్రజలొకటి తలుస్తారన్న న్యూనూడి తమ్మినేనివీరభద్రం నాయకత్వంలో సాగుతున్న మహాపాదయాత్రకు పూర్తిగా వర్తిస్తుంది. ఈ యాత్రను వూరూరా నిలదీయాలని, క్షమాపణలు చెప్పించి ముక్కు నేలకు రాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విరుచుకుపడినా- ఆరువందల కిలోమీటర్ల పైన నిరాఘాటంగా సాగిపోతున్నది. గతంలోనూ వీరభద్రం ఖమ్మం జిల్లాలో మహాప్రస్థానం చేశారు. కాని ఈ యాత్ర అంతకు మించి అందరినీ ఆకర్షించగలిగిందంటే అందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు చెప్పవలసిందే. ఈ యాత్రకు ప్రజల ఆదరణ స్పందన మాత్రమే గాక ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడా లభించడం విశేషం. మామూలుగా ఒక పార్టీ చేసే పనిని మరో పార్టీ గుర్తించడం గౌరవించడం అరుదుగా జరుగుతుంది. కాని మహాపాదయాత్రకు అన్ని ప్రతిపక్షాల నుంచి, మేధావుల నుంచి సామాజిక సంఘాల నుంచి అభినందనలు అందుతున్నాయి. జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కంచ ఐలయ్య ఇంకా ఇతర పార్టీల నేతలు ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై, భట్టి విక్రమార్క మరో అంశంపై ఇలా వివిధ రకాల యాత్రలు బయిలు దేరడానికి కూడా ఇది ప్రేరణ అయినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా బస్సు యాత్ర చేస్తారని ఒకప్పుడు కథనాలు వచ్చాయి గాని ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా వుండొచ్చు.
ఈ సందర్భంగా బయిటకు వస్తున్న ప్రజల సమస్యలు చూస్తుంటే పరిపాలనా ఫలాలు, అధినేతల అతిశయాలు ఇంకా వారికి చేరలేదని తేలిపోతుంది. కుల వివక్ష పెత్తందారీ తనం వికటాట్టహాసం తెలిసిపోతుంది. శ్మశానాలు లేక దళితులు మంచినీరు లేక గ్రామస్తులు అనేక చోట్ల పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇవన్నీ ఒకరోజులో వచ్చినవి కాదు గాని బంగారుతెలంగాణ నిర్మాణ ప్రచారంలోనూ వీటిపై నిర్దిష్టమైన నిర్మాణాత్మక చర్యలు లేకపోవడం బాధాకరం. ఒక భాగం మీడియా ఈ యాత్రను విస్మరించడం లేక నామమాత్రంగా ఇవ్వడం జరుగుతున్నా ప్రజలు మాత్రం ఆదరిస్తున్నారంటే వారికి కమ్యూనిస్టు ఉద్యమంపై నమ్మకం లాల్ నీల్ నినాదం విజయం అర్థమవుతున్నాయి. వచ్చిన సమస్యలపై ఎప్పటికప్పుడు లేఖలు రాయడం, మీడియాకు చెప్పడంతో పాటు కార్యాచరణ కూడా సిద్ధం చేయడం ఈ పాదయాత్రలో ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం సజీవంగా వుందనే సందేశం ఇవ్వడమే గాక దానిపై ప్రజల విశ్వాసాన్ని రాజకీయ వ్యవస్థలో చెరగని స్థానాన్ని కూడా పాదయాత్ర మరోసారి చాటిచెప్పడం విశేషం. దీనివల్ల కార్యకర్తలకూ నాయకులకూ కూడా ప్రజా జీవితంతో ప్రగాఢపరిచయం ఏర్పడ్డమే గాక ప్రత్యక్షపరిశీలనా శక్తి గమనశీలత సమరశీలత కూడా పెరగడం తథ్యం. అందుకే చూసి వచ్చిన వారంతా అభినందించడమే గాక అనందిస్తున్నారు. అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా.
ఈ యాత్ర వల్ల కలిగిన మరో గొప్ప ప్రయోజనమేమంటే తెలంగాణలో రాజకీయ చర్చను వ్యక్తిగత విమర్శలూ వివాదాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయికి గ్రామసీమలకూ తీసుకుపోవడం. ఆ విధంగా చవకబారు నిందారోపణలు తగ్గి నిర్దిష్ట విమర్శలు నిర్మాణాత్మక ఆచరణ పెరిగితేనే ప్రజలకు మంచిది.