పవన్ సంపూర్ణ రాజకీయ శంఖారావం

అనంతపురం సభతో జనసేన అద్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం పూర్తి స్థాయిలో ప్రకటించారు. ఎంఎల్‌ఎగా పోటీ చేస్తానని రెండేళ్ల ముందే చెప్పేశారు. గెలిచినా ఓడినా ప్రజల అండ వున్నా లేకున్నా తాను వారితో వుంటానన్నారు. కాకినాడ సభలో ఆయన వ్యాఖ్యలపై ఎ వరికైనా ఏమైనా సందేహాలుంటే వాటిని పటాపంచలు చేస్తూ రాజకీయ యాత్ర ప్రారంభించారు. మొదటి పార్టీ మొదటి కార్యాలయం అనంతపురంలోనే మొదలుపెడతానని కూడా చెప్పారు. పదే పదే తెలుగుదేశం వైసీపీలను ప్రస్తావించడం ద్వారా మూడో శక్తిగా తన స్థానాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అవినీతిపై ఆరోపణలు, అమరావతిలో పొడుగు చేతుల పందేరాలు, ఒక కులానికే మేలు జరగకూడదన్న హితబోధలు వీటన్నిటిద్వారా సూటిగానే తన సందేశం చేరవేశారు. తను ఒక కులానికో మతానికో సంబంధించిన వాణ్ని కాదన్నప్పటికీ అన్నికులాలు అవకాశాలు లేనివారికి కూడా పారిశ్రామిక తదితర రంగాలలో స్థానం రావాలని చెప్పడంలోనూ తన మార్గం ఎలా వుండేది వెల్లడించినట్టయింది. తెలుగువారు అని గాకుండా సీమాంధ్రులు వారి చైతన్యం పోరాట పటిమ వంటివాటిపై చేసిన ప్రస్తావనలు కూడా ఆయన భవిష్యత్తు కార్యాచరణ నినాదాలను తలపించాయి. వెనక్కు పోయేది లేదని కూడా గట్టిగా ప్రకటించారు.
కాకినాడ సభతో పోలిస్తే అనంతపురం సభలో ఆయన ప్రసంగం కొంచెం జాగ్రత్తగా నడిచింది.ప్రత్యేక హౌదాపై వంచనను గట్టిగాే నిలదీశారు. ఇవ్వని హౌదా అడిగినందుకు ఇవ్వనందుకు కూడా కొందరు హీరోలై పోయారంటూ ఆంధ్రభోజులయ్యారని ఆయన చేసిన వ్యాఖ్య వెంకయ్య నాయుడుకు తగిలేదే. ఇందుకోసం సన్మానాలు ఎలా చేస్తారని కూడా గట్టిగా ప్రశ్నించారు. గతసారి తెలుగుదేశంను ఏమీ అనలేదన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి పదేపదే ఆ పార్టీని ప్రభుత్వాన్ని కూడా విమర్శనాత్మకంగా ప్రస్తావించారు. అయితే వైసీపీని కూడా దాంతో పాటే పేర్కొనడం ద్వారా ప్రతిపక్షం బాధ్యతా నిర్వహణనూ ప్రశ్నించినట్టయింది. కాకినాడతో పోలిస్తే ఇక్కడ వామపక్షాల గురించిన ప్రస్తావన వినిపించలేదు. తరిమెల నాగిరెడ్డిని కల్లూరి సుబ్బారావును మాత్రం గుర్తు చేసుకున్నారు. అనంతపురం కరువును గురించికూడా రాయలసీమ వెనుకబాటు తనం చెప్పడమే గాక ఇక్కడ ఉత్తరాంధ్రలలో వేర్పాటు ఉద్యమాలు వచ్చేఅవకాశముందని హెచ్చరిక చేయడం రాజకీయంగా చాలా కీలకమైన విషయం.ప్రత్యేక హౌదాపై చాలా చర్చలు చేశానన్న పవన్ పోలవరంకు కేంద్ర సహాయం నీటిపారుదల విభాగానికే పరిమితమమటూ ఒక పత్రం చదివి వినిపించారు.
పవన్ ప్రసంగం లోతుపాతులపై మరింత పరిశీలన మరోసారి చేద్దాం. ఇప్పటికైతే రాష్ట్ర రాజకీయరంగస్థలంపై ఆయన బలమైన పాత్రధారిగా మరో ప్రత్యామ్యాయ శక్తిగా ఆవిర్భవించనున్నట్టేకనిపిస్తుంది. ప్రభుత్వంతో పాటు వైసీపీ ఇప్పుడు విమర్శించేందుకు ఈ సభలో ఏమీ వుండకపోవచ్చు. అయినా అనకుండా వుంటారనుకోను. బిజెపి టిడిపి ఎలాగూ విమర్శిస్తాయి.