కోదండరాముడే .. రావణుడైతే.. గురితప్పిన సుమబాణం
పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నిహితబృందంలో సభ్యులు.యువకుడుగానే ఉన్నతస్థానానికి ఎదిగిన తర్వాత జాగ్రత్తగా మాట్లాడేందుకు స్థాయి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకోసారి పూర్వాశ్రమంలో ఆగ్రహావేశాలకు మారుపేరైన సుమన్ ఇతనేనా అని కూడా సందేహం కలుగుతుంటుంది. ఎవరిపైనైనా తీవ్రంగా మాటల దాడి చేయాలనుకుంటే అధినేత సుమన్‌ను ప్రయోగించడం చాలా సార్లు జరిగింది. అందులో పేలినవీ పేలనివీ కూడా వున్నాయి. అయితే టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై కూడా ఆ తరహాలోనే దాడి చేయడం, కాంగ్రెస్ ఏజంటుగా చిత్రించడం ఎవరూ మెచ్చేది కాదు. రాజకీయాలు వద్దనే మీరు కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధీని ఎందుకు రహస్యంగా కలుసుకున్నారని సుమన్ తేదీలు ప్రకటించారు. కోదండరాం నిజంగా రాజకీయాల్లో చేరి పదవులు పొందాలనుకుంటే అధికార పక్షమైన టిఆర్ఎస్తో మంచిగా వుండేవాళ్లు గాని ఇక్కడ గాని ఢిల్లీలో గాని అధికారమే లేక బలహీనమైన కాంగ్రెస్ ఏజంటుగిరీ ఎలా ఎంచుకుంటారు? పైగా యువ ఎంపి అనేముందు ఆ తేదీలలో కోదండ ఎక్కడ వున్నారో చూసుకోనవసరం లేదా? తాను ఆ తేదీలలో వారణాసిలోనూ హైదరాబాద్ ధర్నాచౌక్లోనూ వున్నానంటూ మీ నిఘా విభాగం ఇంత బలహీనమా అని కోదండ ఎగతాళి చేసే పరిస్థితి కల్పించారంటే కోపంలో కనీస వివరాలు చూసుకోలేదన్నమాట. పైగా సోనియా గాంధీని రహస్యంగా ఎందుకు బహిరంగంగా కలుసుకుంటే మాత్రం తప్పేమిటి? ఎన్నికలకు ముందు కెసిఆర్ సకుటుంబ సపరివార సమేతంగా కలసి కృతజ్ఞతలు చెప్పి రాలేదా? కోదండం ్ కుబుసం విడిచిన పాము అన్నారు గాని ప్రకృతిలో కుబుసం విడిస్తే శక్తి పెరుగుతుంది!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెంటనే టిఆర్ఎస్ ప్రభుత్వానికి సర్వం అప్పగించి జెఎసి చైర్మన్ చేతులు ముడుచుకుని మాటలు మానుకుని మద్దతు తెల్పడానికే పరిమితం కావాలని పాలకపక్షం కోరుతుందా? కెసిఆర్‌ను జాతిపిత అంటూ గాంధీతో పోల్చుతుంటారు గాని గాంధీజి స్వాతంత్ర దిన వేడుకల్లో కూడా పాల్గొనకుండా తన ఆశ్రమంలో ఆవేదనలో వుండి పోయారు. నేను కోరిన స్వాతంత్రం ఇది కాదన్నారు.కాంగ్రెస్ ఎంతగా పాడై పోయిందో 1946లోనే బహిరంగంగా వెల్లడించారు.ఆయననెవరూ దేశ ద్రోహి అనలేదు. తెలంగాణలో కోదండరాం వంటివారు ప్రభుత్వ తప్పిదాలను విమర్శిస్తే ద్రోహులూ మరొక పార్టీ ఏజంట్లు అయిపోతారా? కాంగ్రెస్ సిపిఎం తెలుగుదేశం తో సహా ఎవరు ఏ ఆందోళన చేసినా ఉద్దేశాలు అంటకట్టడం, ముద్రలు వేయడం ప్రజాస్వామికమా? ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేయడం తప్పా? తప్పు కాదని ప్రజలు అనుకున్నారు గనకే సిపిఎం పాదయాత్రను వూరూరా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చినా ఇప్పటికి 24 రోజులుగా నిరాఘాటంగా 600 కిమీ పూర్తయింది. సిపిఎం రాష్ట్ర విభజన వద్దని చెప్పిందని విమర్శించిన వారు ఆ రోజున తమ ఉద్యమానికి సమన్వయకర్తగా వున్న కోదండరాంపై అంతకంటే తీవ్రంగా దుమ్మెత్తిపోయడం మరొకరి తరపున పనిచేశారని చెప్పడం తమను తాము అవమానించుకోవడమే. అప్పట్లో కోదండరాంను కెసిఆర్ చెప్పినట్టు విన్నారని విమర్శలు వచ్చేవి. అదే వ్యక్తిపై ఇంత దారుణంగా అభాండాలు వేయడం అసహనానికి పరాకాష్ట. చైతన్య వంతమైన తెలంగాణ దీన్ని ఆమోదించదు.
కోదండరాం సుమన్ విమర్శలకు ఇచ్చిన సమాధానం సమంజసంగానే వుంది. ఎక్కడెక్కడ టెంట్లు వేసుకుంటే అక్కడంతా కోదండరాం ప్రత్యక్షమై మద్దతు తెల్పుతున్నారని విమర్శించారు. కాని తాను ఇకముందు కూడా పోరాడే వారికి అండగా వుంటారని గట్టిగానే ప్రకటించారు. పాలకపక్షం అభాండాలపై కోదండం సంధించారు గనక ఈ సంవాదం, సంఘర్షణ ఏ రూపం తీసుకుంటాయో చూడాలి. ఏది ఎలా పోయినా ప్రజాస్వామిక స్వేచ్చలను ప్రతిపక్షాల ప్రజా వేదికల ఉద్యమాలను గౌరవించడం ముఖ్యం.

