బీచ్‌ లౌ.. క్యేసినో.. గోవా టు వైజాగ్‌ టు విజయవాడ..

 

విశాఖ తీరంలో తలపెట్టిన లౌఫెస్టివల్‌ ఏది ఏమైనా జరిగితీరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారట. ఆయన ఇంత గట్టిగా చెబుతారని తెలియక మంత్రులు గంటా శ్రీనివాసరావు వంటి వారు కొంత సర్దుకుంటున్నట్టు దిద్దుకుంటున్నట్టు మాట్లాడారు. అయితే అధినేత అంతరంగం తెలిశాక అనిత,బోండా ఉమామహేశ్వరరావు తదితరులు ముందుగానే బికినీ ఫెస్టివల్‌ను సమర్థిస్తూ భారీ వాదనలే చేశారు. దీని సారాంశం ఏమంటే విశాఖ తీరంలో వికృత సంసృతిని ప్రవేశపెట్టి ఆదాయం పెంచడం.. బీచ్‌లో ఆధునిక ఈతదుస్తులు బికినీలు వేసుకోవడానికి వెనుకాడే వారిని ఆ దిశలో నడిపించడం.
కొద్దినెలల కిందట గోవాలో మంత్రి సుధీన్‌ దవళికర్‌ మహిళలు బికినీలు వేసుకోవడం అపరధామైనట్టు మాట్లాడితే అందరం ఖండించాం. చివరకు అప్పటి ముఖ్యమంత్రి మనోహర్‌ పరిక్కర్‌ బికినీని నిషేదించే ఆలోచనలేదని వివరణ ఇచ్చి వివాదం ముగించారు. అలాగే ఆరెస్సెస్‌ సంఘ పరివార్‌ శక్తులు వలైంటీన్స్‌ డే నాడు దౌర్జన్యాలు చేసినా ఖండించాము. కాబట్టి ఇక్కడ సమస్య బికినీలు లేదా వలైంటీన్స్‌డేలు కాదు.ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని టూరిజానికి ప్రోత్సాహం పేరిట విదేశాల నుంచి జంటలను పిలిపించి ఆ సంసృతిని ఇక్కడ దిగుమతి చేయడానికి దాన్నొక అలవాటుగా మార్చి ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించడం. నిస్సందేహంగా ఇది వెగటు పుట్టించే ఆలోచన. గోవాచారిత్రిక నేపథ్యం అక్కడ పోర్చుగీసు పాలన వుండటం వంటి కారణాలు ఒక ప్రత్యేకత కలిగించాయి. అవేవీ విశాఖలో లేవు.అలాటప్పుడు టీవీలలో కావాలని స్టెప్పులు వేయించి వెకిలి మాటలు మాట్లాడించినట్టు ప్రభుత్వమే పనిగట్టుకుని ఈ మహత్తర ప్రాజెక్టు చేపట్టవలసిన అవసరం లేనేలేదు. పైగా అది అభ్యంతరకరం కూడా. మాట్లాడితే దేశ సంసృతి గురించి గగ్గోలు పెట్టే బిజెపి ఆరెస్సెస్‌లు ఈ ప్రతిపాదనను ఎలా తీసుకురానిచ్చాయో అర్థం కాదు. బిజెపి కౌ ఫెస్టివల్‌, టిడిపి లౌ ఫెస్టివల్‌ కలిస్తే ఎపి ఏ దిశలో పోతుందో వాస్తవం చెప్పాలంటే గతంలో చంద్రబాబు పాలనా కాలంలో వేశ్యావృత్తిక ి లైసెన్సింగు గురించి మాట్లాడి తర్వాత సర్దుకున్నారు.ఇక్కడ విశృంఖల వాతావరణం అనుమతిస్తే విదేశీయులు విస్తారంగా వస్తారనేభ్రమ ఆశ ఆయనకు వున్నాయనేది స్పష్టం. కాని అందులోని నైతిక సమస్యలు సామాజిక కోణాలు పట్టించుకోకపోవడం బాధ్యతా రాహిత్యమవుతుంది. విజయవాడతో సహా పలు చోట్ల నదీ ద్వీపాల్లో క్యేసినోలు(పేకాట శిబిరాలు) పెద్ద ఎత్తున నిర్వహించేందుకువచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలించడం కూడా ఇలాటిదే. పేకాటలు బీచ్‌ షోల ద్వారా ఆదాయం వందల కోట్లలో వస్తుందని కాదు ప్రభుత్వ ఆలోచన. ఆ వూపులో ప్రజలు ముఖ్యంగా యువత దారితప్పితే ఉద్యమాలు ఉద్రేకాలు తగ్గిపోతాయని ఆశ మాత్రమే అది.
ఇప్పటికే హాపీ సండేస్‌ అంటూ కోస్తా ప్రాంతంలోని కొన్ని పట్టణాలలో కుర్రకారుతో డాన్సులు రికార్డింగులు చేయించి మురిపిస్తున్నారు.ఇది కూడా తోడైతే చెప్పేదేముంది? ఏకకాలంలో స్వాముల చుట్టూ తిరుగుతూ భక్తి బోధనలూ మరోవైపు అభినవ భామా కలాపాలు తలపెట్టడం ప్రభుత్వ దృష్టిలోపం మాత్రమే. వ్యక్తులు ఎంపిక వేరు. ప్రభుత్వ ఆధ్వర్యం వేరు.

పోర్చుగీసు ప్రభావం గురించి ఒక చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. 1985లో చైనా పర్యటనలో మకావూ అనే చిన్న ద్వీపం దగ్గరకు వెళ్లాము. అది అప్పటికి ఇంకా పోర్చుగీసుల లీజులో వుంది. పేకాట కేంద్రాలు జోరుగా నడుస్తున్నాయి. మాతో వున్న దౌత్యాధికారి గోవాలో కూడా ఇంతేనా అని అడిగాడు. ఔనని ఎవరో చెప్పారు. ఈ పోర్చుగీసులు ఎక్కడున్నా ఇదే తంతు అన్నాడు ఈసడింపుగా. బుడతకీచులు అంటూ తెలుగు వాళ్లు పిలిచిన వారి వరవడిని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెలుగునాట తేవాలనుకోవడం అనాలోచితమే కాదు అనర్థదాయకం కూడా.
ఈ విషయమై చర్చ వచ్చినప్పుడు నాకు దేశోద్ధారకులు చిత్రంలోని ఎన్టీఆర్‌ వాణిశ్రీ పాట గుర్తుకు వచ్చింది. ఇది కాదూ మా సంసృతి అని.. కాలంతో పాటు అదంతా మారుతుండొచ్చు గాని తెలుగుదేశం నేతలు ఆలోచించేందుకు పనికి వస్తుందేమోనని ఇక్కడ లింకు ఇస్తున్నా.సముద్రుడికే తెలియాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *