పెద్దనోట్లరద్దుతో పెను ప్రభావం
అమెరికా అద్యక్ష ఎన్నికల గురించిన చర్చకోసం సాక్షి ఛానల్‌కు వెళ్లాను. మా చర్చకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం మొదలైంది. మధ్యలో ఆపి ఈ చర్చ తీసుకున్నాము. అయితే ఒక రౌండు అయ్యేలోపలే 1000.500 నోట్ల రద్దు వార్త వచ్చింది. ఇది ఒక విధంగా సంచలన నిర్ణయం. ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.
దీనికి ఒక కారణం పాకిస్తాన్ చొరబాటుదార్లు టెర్రరిస్టులు నకిలీ నోట్లను విచ్చలవిడిగా చలామణిలోకి తేవడం. ఈ చర్యతో వారి నకిలీ నోట్లు చెల్లకుండా పోతాయి.
రెండు- దేశంలో నల్లడబ్బు ఆసాములు పెద్దనోట్లలో దాచుకోవడం. ఇప్పుడు వారు ఆ డబ్బు తీసుకుని మళ్లీ కొత్త నోట్లు తీసుకోలేరు. ఎందుకంటే లెక్కలో వుండదు గనక.
ఆర్థిక వేత్తలు విధాన నిర్ణేతలు బ్యాంకుల నిర్వాహకులు స్వాగతించారు.కాని సామాన్యుడు మాత్రం ఆందోళనలో పడ్డాడు.తాత్కాలికమే కావచ్చు గాని మామూలు మనుషులు ఒక్కసారిగా వున్న రెండు మూడు నోట్లు రద్దయిపోతే ఇబ్బందుల్లో పడతారు. రెండు మూడు రోజులు బ్యాంకులు ఎటిఎంలు పనిచేయవు గనక తంటాలు తప్పవు.
దీంతోనే నల్లడబ్బు ఆగిపోతుందని కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే వారికి అనేక రకాల ఖాతాలు వుంటాయి. పైగా చెక్కులు ఇంటర్‌నెట్ లావాదేవీలకు ఏ ఆటంకం లేదు.
అయితే ఆ చేత్తో వెయ్యి రూపాయలు తీసేసి ఈ చేత్తో 2000 నోట్ల ప్రవేశపెట్టడం కొంత వింతగా వుంది. దీన్నిబట్టి చూస్తే నకిలీ నోట్ల నిరోధమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.
దీనికి ముందే ప్రభుత్వం భారీగా వంద నోట్ల ముద్రణ చేసి వుంటుందని భావించాలి. లేకపోతే సమస్యలు తప్పవు
డిసెంబరు చివరలోగా మార్చుకోలేని వాళ్లు కూడా ఐడెంటిటీ కార్డుతో మార్చి 31 వరకూ మార్చుకోవచ్చని అవకాశమిచ్చారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటు బంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు అక్కడి మందుల షాపులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఈ నోట్లు చెల్లుతాయన్నారు.
బహుశా అనుభవం బట్టి మరిన్ని వెసులుబాట్లు కల్పించవచ్చు
ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.అయితే 2000 నోటు ఆలోచనను విమర్శించింది.ఇక పశ్యిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనివల్ల పేదల సమస్యలు ఎదుర్కొంటారని విమర్శించారు.
దీనిపై తాను గతంలోనే లేఖ రాశానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ సంతోషం వెలిబుచ్చారు. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ స్వాగతించారు.సిపిఎం నేత ప్రకాశ్ కరత్ అధ్యయనం చేసి స్పందిస్తామన్నారు.
నల్లడబ్బు విదేశాల నుంచి తెప్పిస్తామని చెప్పి అమలు చేయలేదనే విమర్శ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. రేపు యుపి ఎన్నికల ప్రచారంలోనూ వాడుకోవడం తథ్యం.
ి 1946లోనూ 1978లోనూ పెద్ద నోట్ల రద్దు చేశారు. 1936లో 5000.10,000 విలువైన నోట్లు వుండేవి.వాటిని 1946లో రద్దు చేసి 1954లో మళ్లీ ప్రవేశపెట్టారట. 1978లో మొరార్జీదేశాయి జనతా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అప్పట్లో ఆ నోట్లు అపురూపంగా వుండేవి. వెయ్యి రూపాయల నోటు పేరిట సినిమానే వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. లక్షాధికారి,కోటీశ్వరుడు వంటి మాటలు వుండేవి. ఇప్పుడు లక్షల కోట్లు అన్న మాట అలవోకగా వాడేస్తున్నారు.ఇందులో చాలా భాగం నల్లడబ్బే. నకిలీ డబ్బు కూడా చాలా వుంది. మరి ప్రధాని నిర్ణయం దాన్ని అరికట్టగలుగుతుందా? ప్రజలపై ప్రభావమేమిటి? వివరాలు తెలిసేకొద్ది అనుభవాలు వచ్చే కొద్ది అర్థమవుతుంది.
మొత్తానికి ఎంతో కొంత మేలు చేస్తుంది గాని కొంతమంది అనుకుంటున్నట్టు దీంతోనే తలకిందులయ్యేది వుండదు. అలా అయ్యేవారు సామాన్యులే!
నేను గంట క్రితం పెట్రోలు బంకు దగ్గర ఎటిఎంల దగ్గర చూసినప్పుడు వారి పాట్టు ఆందోళన అర్థమవుతున్నాయి. అయినా తప్పదు కదా!.


ROKALI TALAKU CHUTTALI, (PICHCHI KUDIRINDI) MARI CHUTTEVAREVARU?