బిజెపి చేస్తే దేశభక్తి- ఇతరులైతే రాజకీయం!
కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు అంతకంతకూ ఏకపక్షంగా అప్రజాస్వామికంగా తయారవుతున్న తీరుకు తాజా ఉదాహరణ మాజీ సైనిక సుబేదార్ రాం కిషన్ ఆత్మాహుతి, అనంతర పరిణామాలు. ఒకర్యాంకుకు ఒకే పెన్షన్(వన్ ర్యాంక్ వన్ పెన్షన్) విధానం కోసం ఎంతో కాలం పోరాడి చివరకు అలసి పోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఒకసారి వెనక్కు వెళితే నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార ప్రారంభఘట్టంలోనే మాజీసైనికుల సభలో పాల్గొనడం అందరూ చూశారు. దానంతటికీ ఆధ్వర్యం వహించిన వికెసింగ్‌పై అనేక ఆరోపణలున్నా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు. అసలు మాజీ సైనికాధికారులకు రాజకీయ ప్రవేశం కల్పించింది బిజెపినే.ఇక ఇటీవల యురీ దాడి తర్వాత సర్జికల్ స్ట్రయిక్స్‌ను రాజకీయంగా ప్రచారం చేసుకున్న తీరు విమర్శలు చూస్తున్నవే. సరిగ్గా ఇలాటి సమయంలోనే సైనికుల ర్యాంకులు జీతభత్యాల విషయంలో ఏదో గత్తర జరిగింది. రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ వాటిని సరిచేస్తున్నామని ఒకసారి అదేమీ లేదని మరోసారి విరుద్ధ ప్రకటనలు చేశారు. మాజీ సైనికుల ముఖ్యంగా అధికారుల ప్రధాన కోర్కె ఓపిపిఆర్. ఒకర్యాంకులో రిటైరైన వారికి ఒకే పెన్షన్ వుండాలని దాని సారాంశం. అంటే గతంలో బాగా ఉన్నత స్థానం నుంచి రిరైరైన ఉన్నతాధికారి కంటే ఇటీవల కింది ర్యాంకులో రిటైరైన సైనికుడికి ఎక్కువ పెన్షన్ వస్తుంది. వేతనాల పెరుగుదలలో వ్యత్యాసాలే దీనికి కారణం.మామూలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు జీతాలు పెంచినా పెన్షనర్లకూ వర్తింపచేస్తామని చెబుతుంటారు. కాని సైన్యంలో ఆ పరిస్థితి వుండదు. గత ఎన్నికలలో వాగ్దానం చేసిన మోడీ ఇందుకోసం అయిదు వేల కోట్లు విడుదల చేశారు గాని నిజానికి అది వన్‌టైబ్ పెంపుగానే మిగిలిపోయింది తప్ప స్వాభావింకగా కొనసాగుతున్న అసమానతను చక్కదిద్దలేదు. ఈ విషయమై పోరాడుతూనే రాంకిషన్ ప్రాణాలు తీసుకున్నాడు. అది పొరబాటైనా ఆయన ఎంతగా విసిగిపోయారో తెలుస్తుంది. కనీసం తన మనవి వినేందుకు కూడా ఢిల్లీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో నిరాశచెంది ప్రాణాలు తీసుకున్నారు సింగ్.
బలవంతాన చనిపోయిన ఒక వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీ వెళితే అనుమతించకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికం. రాహుల్ ఈ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాడని బిజెపి ఆరోపణ. ఒకవేళ ఆయన అలా చేస్తే మీరు సమాధానం ఇవ్వొచ్చు. అంతేగాని అసలే అడ్డుపడ్డం అరెస్టు చేయడమేమిటి? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా పరామర్శకు అనుమతించకపోవడమే గాక అరెస్టు చేసి పలుచోట్లకు తిప్పారు.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన భూభాగంలో జరిగిన విషాదాన్ని చూసేందుకు అనుమతించకపోవడం ఫెడరలిజానికే చేటు. వాస్తవంలో ఆప్ ప్రభుత్వాన్ని కేంద్రం రోజూ ముప్పుతిప్పలు పెడుతున్నది.దీనిపై తీవ్ర నిరసన కూడా వ్యక్తమవుతున్నది. దేశంలో ఎక్కడా లేని ఆరోపణలపై ఆప్ ఎంఎల్‌ఎలను రకరకాలుగా అరెస్టు చేయడం అయనపైగవర్నర్ జంగ్‌ను ప్రయోగించడం కేంద్రం నిరంకుశత్వానికి నిదర్శనం.ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లో వుండొచ్చు గాని ఆ పేరుతో ముఖ్యమంత్రినే అడ్డుకోవడం ఎలాటి న్యాయం? కేజ్రీవాల్ ఉనికిని సహించడానికే బిజెపి సిద్ధంగా లేదు. ఇది మొత్తం ఫెడరలిజంపై దాడి.
కాహుల్ గాంధీని కేజ్రీవాల్‌ను మరెవరినైనా సరే రాజకీయం చేస్తున్నారంటూ అరెస్టు చేసి అసహనం చాటుకున్న ఈ ప్రభుత్వం మరణించిన జవాన్‌కు మతిస్తిమితం ఎలా వుందో దర్యాప్తు చేయాలని నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి వికెసింగ్‌ను మాత్రం అంటుకోలేదు. రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ సంతాపంతో సరిపెట్టారు.
నిజానికి రాంకిషన్ సింగ్ మాజీ సైనికుడే కాదు, హర్యానాలోని బమ్లా గ్రామానికి చక్కటి పాలన అందించిన సర్పంచి కూడా. ఆయన తీసుకున్న చర్యలు ఆ గ్రామం ముఖచిత్రాన్నే మార్చేశాయి. మరోవైపున తమ చిరకాల కోర్కె అయిన ఒకే పెన్షన్ కోసం నిరంతరం పోరాడుతూనే వున్నారు. జంతర్‌మంతర్ దగ్గరే మకాం వేశారు. కాబట్టి ఆయన పిరికివాడు కాదు. అయితే ఎంత అడిగినా కేంద్ర మంత్రులు ఇంటర్వ్యూ ఇవ్బకపోవడం ఆయనను కలచివేసినట్టు కనిపిస్తుంది. ఫలితంగానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసినా స్వగ్రామంలో అంత్యక్రియలకు రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్ కూడా హాజరై నివాళులర్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు.

