మేనేజింగ్ ఈచ్ అదర్..బట్ నాట్ మోడీ!
మీరు మమ్ముల్ను మరీ ఎక్కువగా తిడుతున్నారు సార్, కొంచెం తగ్గించండి అన్నారు ఈ మధ్య నాతో బిజెపి రాష్ట్ర నేత ఒకరు. సమస్యలను బట్టి విమర్శలు తప్ప తిట్టడమేముంటుంది అని నేనేదో సర్దిచెప్పాను. ఆయన చెప్పదల్చుకున్న అసలు విషయం అది కాదు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోో మేము వున్న పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను తప్పిదాలను ఎండగట్టాలనుకుంటాం. అమిత్ షా కూడా అగ్రెసివ్‌గా వెళ్లమనే అంటారు. తీరా మేము కాస్త విమర్శ చేయగానే పైనుంచి తాఖీదు వచ్చేస్తుంది. తగాదా వద్దని నోటికి తాళం వేస్తారు. ఇంకేం చేస్తాం’ అని ఆయన చెప్పారు. దీనికి ఏకైక కారణం వెంకయ్య నాయుడేనని ఇలాటి నాయకులు వాపోతున్నారు. ఆయన తన సీనియారిటీనీ పాత సంబంధాలనూ ఉపయోగించుకుని తన గౌరవం కాపాడుకోవడం తనను ఆశ్రయించుకున్నవారికి మేలు చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని వారి అభియోగం. లేదా అంచనా కూడా. వెంకయ్యను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడనేది వారి వాదనలో కొసమెరుపు.ఇదే సమయంలో వేరే వేదికలప్లై కలిసిన టిడిపి నేతలు వెంకయ్య నాయుడు కారణంగానే తమ నాయకుడు అవసరమైనప్పుడు కూడా కేంద్రాన్ని విమర్శించలేకపోతున్నాడని ఆవేదన వెలిబుచ్చారు
ఇంతకూ చంద్రబాబు నాయుడు బిజెపిని మేనేజ్ చేస్తున్నారా? లేక బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు చంద్రబాబును మేనేజ్ చేస్తున్నారా? ఇరు పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు కలిగే తీవ్ర సందేహమిది.తీరని సందేహం కూడా. ఏది ఎటైతేనేం, ఇద్దరూ కలిసి ఎపిలో సగం పాలనా కాలం మేనేజ్‌చేశారు! మోడీని మేనేజ్ చేయలేరు గనక ఎలాగో తంటాలు పడుతున్నారు..