పోలీసుల చర్యను ఖండిద్దాం..కాని మావోయిస్టులూ ఆలోచించాలి

ఒరిస్సాలో మావోయిస్టులపై ఏకపక్ష ఎన్‌కౌంటర్‌ను వామపక్షాలన్నీ ఖండించాయి.అన్ని పార్టీలూ ప్రశ్నించాయి. హైకోర్టు కూడా ఆర్కేను హాజరుపరచాలని కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. నా వరకూ నేను ఛానళ్లలో ఈ విషయమై సూటిగానే పోలీసుల వైఖరిని తప్పుపట్టాను.మరోవైపున మావోయిస్టుల తరపున ముందుభాగన నిలిచే పెద్దలు వరవరరావు సాక్షిలోనూ, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆంధ్రజ్యోతిలోనూ వ్యాసాలు రాశారు. ప్రభుత్వం లేదా రాజ్యం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై వీరి విమర్శలు సరైనవి, అందరూ ఆమోదించేవి. ఇది బాధాకర సందర్భం గనక వారి నుంచి మరో మాట ఆశించలేము కూడా. అయితే ఇద్దరూ కూడా మావోయిస్టుల వైపునుంచి కాస్తయినా ఆత్మ విమర్శ పునరాలోచన ఆశించకపోవడం సూచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్రేయోభిలాషులుగా వారిపై ఈ బాధ్యత మరింతగా వుంటుంది. వరవరరావు వ్యాసంలోనైతే రెండవ పేరాలోనే పశ్చిమబెంగాల్‌ వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించడంతో ప్రారంభించారు. సిపిఎం స్వయంగా దీనిపై ఆత్మ విమర్శ చేసుకున్నది. అయితే అదే సమయంలో మావోయిస్టుల మాటేమిటి? మార్క్సిస్టులు పార్లమెంటరీ వాదులు అనుకున్నా మమతా బెనర్జీతో కలసి ఎలా పనిచేశారు?చివరకు ఆమె ఆ కిషన్‌జీనే బలితీసుకున్న తర్వాతనైనా నేర్చుకున్న పాఠమేమిటి?focus111
హరగోపాల్‌ కూడా రాజ్యం పౌర సమాజం బాధ్యతను బాగా పేర్కొన్నారు. మావోయిస్టుల తుపాకులకూ వాటిని ఒకే విధంగా చూడొద్దన్నారు. మంచిదే. కాని ఆ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వారిపైనా వుండదా? చర్చలకు పిలిచి హతమార్చిన ప్రభుత్వాలను ఖండిద్దాం గాని మేము వ్యూహాత్మకంగానే వస్తున్నామని బహిరంగ వేదికలపై ప్రసంగించి విప్లవ ప్రతినిధుల్లో కనీస వాస్తవికత వుందనుకోవాలా? తమ తుపాకులు కార్యకలాపాలు అటు తిరిగి ఇచ్చే ఇంటర్వ్యూలు ఇవన్నీ సో కాల్డ్‌ బూర్జువా మీడియాలో సెన్షేషన్‌కోసం వాడుతుంటే ఆస్వాదించడాన్ని ఏమనాలి? హరగోపాల్‌ కూడా పార్లమెంటరీ పార్టీలు అన్నిటినీ ఒకే గాట కట్టేశారు. ప్రత్యామ్నాయం కోసం పోరాడేవారిలో మావోయిస్టులు అగ్రభాగాన వున్నారని అభివర్ణించారు. అంతేగాని వారి సైద్ధాంతిక సంక్షోభానికి బహిరంగంగా చేసుకున్న వాద వివాదాలకు నిరంతర లొంగుబాట్లకు కారణమేమిటో పరిశీలించరు. ఇంతకు ముందు మమత విషయంలో చెప్పుకున్నట్టు పాలకపక్షాల చేతిలో పాచికలైన ఉదంతాలు, ప్రజలపైనే మారణకాండ సాగించి చెంపలేసుకున్న వైనాలు దేనికి నిదర్శనం? ఏవోబీ కాల్పుల్లో ఇంతమంది ఒకేసారి బలికావడం కోవర్టుల సమాచారం వల్లనే జరిగివుంటుంది గాని అలాటి వారికి కూడా చోటిచ్చిన ఉద్యమం పరిస్థితిని బేరీజు వేసుకోరా?

మావోయిస్టులు ప్రజల కోసం పోరాడుతుందొచ్చు గాని ప్రజల పాత్ర లేకుండా సాధించగలిగింది వుండదు. గిరిజనులపై దోపిడీని ప్రశ్నించే నిరంతర పోరాటాలు ఉద్యమాలూ నడుస్తూనే వున్నాయి. కొన్ని విజయాలు కూడా సాధించాయి. అన్ని రంగాల్లోనూ ఆందోళనలు సాగుతున్నాయి. నా ఉద్దేశంలో వీటి ప్రభావం మావోయిస్టుల తుపాకుల కంటే ఎక్కువగా వుంది. వారు కూడా ఈ ప్రజా ఉద్యమ స్రవంతిని బలోపేతం చేస్తే చాలా మంచిది. ఇక్కడ చెబుతున్నది. పాలకులు చెప్పేప్రజాస్వామ్య స్రవంతి కాదు, ప్రజా ఉద్యమ స్రవంతి గురించి. జనారణ్యంలో సంచరిస్తున్న దోపిడీ శక్తులపై చేయాల్సిన పోరాటం చాలా వుంది గనక కొంత కాలం అరణ్యాల నుంచిబయిటకు వస్తే అంత వెల్లువ వచ్చినప్పుడు మళ్లీ వెళ్లి తుపాకులు పట్టుకోవచ్చు. ప్రజల్లో సామూహిక చైతన్యం రగిలించగలిగితే వారే ఆయుధాలవుతారు. వారి పాత్ర లేకుందా ఎవరు ఎంత వీరోచితంగా పోరాడినా పెద్ద ఫలితం వుండదు. ఆ రోజుల్లో లెనిన్‌ అన్న జారు చక్రవర్తిపై హత్యా ప్రయత్నం చేసి ఉరికంబం ఎక్కాడు. అందుకు భిన్నంగా లెనిన్‌ అన్నను గౌరవిస్తూనే ప్రజల్లో పనిచేసి విప్లవం తెచ్చాడు. వందేళ్ల నాటి ఈ చరిత్ర ఇప్పటికీ గుణపాఠమే.

మావోయిస్టులకు పౌర సమాజం లేదా ప్రజాస్వామిక శక్తులు చేసే ఇలాటి సూచనలు పోలీసు బాసుల చర్యలకు ఆమోదం కాదు. వాటిని వీటినీ ఒకే గాట కట్టడమూ లేదు. కాని ఎన్‌కౌంటర్‌లకూ గన్‌ కౌంటర్లకూ కూడా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని మాట నిజం. మారుమూల అడవుల్లో వుంటే వుండొచ్చు గాని విశాల భారతదేశంలో విప్లవ నిర్మాణానికి సరిపోదు. అలాగే వారికి ప్రజాస్వామిక పాఠాలు చెప్పే ప్రభుత్వాలు ఉద్యమాలపై లాఠీలతో విరుచుకుపడటం, ప్రభుత్వాలు ప్రకృతి వనరులూ దేశ సంపదలూ కార్పొరేట్లకు కట్టబెట్టడం కూడా సహించడానికి లేదు. వీటిని ప్రతిఘటించే శక్తి చైతన్యం ప్రజల్లో తీసుకురావాలి.

One thought on “పోలీసుల చర్యను ఖండిద్దాం..కాని మావోయిస్టులూ ఆలోచించాలి

  • November 3, 2016 at 10:30 am
    Permalink

    OKKA VISHAYAM MANAVI CHESTUNNA. ATTADUGU VARGALAKU, PEDDA DIKKU EVARANI ALOCHISTE, MANAKU KANIPINCHEDI COMMUNISTULU, MAOISTULU. EPPUDU NIJANGA NASTA POYINDI ATTADUGU, DIKKULENI PEDA PREJALU.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *